Subrata Roy
-
Subrata Roy : వేల కోట్ల ‘సహారా గ్రూప్’ డిపాజిట్లపై కేంద్రం కీలక నిర్ణయం!
కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాయ్(75) మంగళవారం ముంబయిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత సహారా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహారా -సెబీ అకౌంట్స్‌లో ఉన్న అన్‌క్లయిమ్డ్ నిధుల మొత్తాన్ని ప్రభుత్వ అకౌంట్‌కు (Consolidated Fund of India) ట్రాన్స్ఫర్ చేయాలనే అంశంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 11ఏళ్ల క్రితం సహారా గ్రూప్ సామాన్యుల నుంచి సేకరించిన రూ.25 వేల కోట్లకు పైగా డిపాజిట్లను సెబీకి అందించింది. అందులో తమ డబ్బులున్నాయని, అందుకు సహారా ఇచ్చిన రిసిప్ట్‌లను సెబీకి (ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో) అప్లయ్ చేసుకుంటే.. వాటిని పరిశీలించిన సెబీ కేవలం రూ.138.07 కోట్లని తిరిగి వెనక్కి ఇచ్చింది. సెబీ నుంచి కేంద్ర బ్యాంక్ అకౌంట్‌కు ఇప్పుడు సెబీ వద్ద ఆ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిదారులకు రీఫండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు మార్చేందుకు కేంద్రం అన్వేషిస్తుందని ఈ అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. అన్‌క్లయిమ్డ్ డిపాజిట్లన్నీ ప్రజా సంక్షేమానికే అయితే, సెబీ అకౌంట్ నుంచి ప్రభుత్వ అకౌంట్‌కు నిధులు ట్రాన్స్ఫర్ చేసిన అనంతరం కేంద్రం నిజమైన డిపాజిటర్లను గుర్తించి, వారికి తిరిగి డబ్బులు చెల్లించనుంది. మిగిలిన అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను ప్రజా సంక్షేమం కోసం కేంద్రం వినియోగించాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది. వేల కోట్ల డిపాజిట్లు సహారా నుంచి సెబీకి సెబీ ఈ ఏడాది మార్చి 31 నాటికి 17,526 దరఖాస్తులకు గాను 48,326 ఖాతాల్లో రూ.138 కోట్లు జమ చేసింది. సహారా గ్రూప్ నుండి రికవరీ చేసి.. ఆయా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం రూ.25,163 కోట్లుగా ఉంది. ప్రత్యేక పోర్టల్ నిజమైన డిపాజిటర్ల చట్టబద్ధమైన బకాయిలకు సంబంధించి రూ.5,000 కోట్లు సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని రానున్న 9 నెలల్లో 10 కోట్ల మంది మదుపరులకు తిరిగి చెల్లిస్తామని కేంద్రం అప్పట్లో తెలిపింది. ఇందులో భాగంగా హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది జులై నెలలో పోర్టల్‌ను ప్రారంభించారు. సహారా గ్రూప్‌నకు చెందిన కోపరేటివ్ సొసైటీలు అయిన సహారా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, సహరాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హమారా ఇండియా క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్, స్టార్స్ మల్టీపర్పస్ కోపరేటివ్ సొసైటీలకు చెందిన మదుపరులకు ఈ మొత్తాలు చెల్లిస్తున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా
సహారా అంటే సహాయం, సహారా అంటే సముద్రం. సహారా అంటే ఓ ఎడారి. కానీ మన దేశంలో సహారా అంటే ఓ కంపెనీ. ఆ సంస్థని స్థాపించింది సుబ్రతా రాయ్. ఇంటింటికి తిరుగుతూ డొక్కు స్కూటర్ మీద మిర్చీ బజ్జీలు అమ్ముకునే స్థాయి లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. ఇటుక ఇటుక పేర్చి కట్టిన సుబ్రతా రాయ్ కార్పొరేట్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? అపర కుబేరుడిగా అవతరించిన రాయ్.. చివరికి అందరూ ఉన్న అనాధలా తలకొరివి పెట్టించుకోలేని దుస్థితికి ఎలా దిగజారారు. సహారాలో పనిచేస్తూ జీతం తీసుకునే ఉద్యోగులు, సహారా నుంచి కమీషన్ తీసుకునే కమీషన్ ఏంజెంట్లు, సహారా కస్టమర్లు సైతం దేవుడు, సహారా శ్రీగా పిలిచే సుబ్రతా రాయ్ 1948 బీహార్‌లోని అరారియాలో బెంగాలీ హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఛబీ, సుధీర్ చంద్ర రాయ్‌లు తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని ఢాకా, బిక్రంపూర్‌లో సంపన్న భాగ్యకుల్ జమీందార్ భూస్వామి కుటుంబానికి చెందినవారు. మిర్చి బజ్జీలు అమ్ముతూ అయితే, షుగర్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహించే తండ్రి సుధీర్ చంద్ర రాయ్ మరణంతో కుటుంబ పోషణ భారం సుబ్రతారాయ్ మీద పడింది. దీంతో కుటుంబ పోషణ కోసం ‘జయ ప్రొడక్ట్’ పేరుతో మిర్చి బజ్జీలు, పునుగులు, ఇతర తినుబండరాలను భార్య సప్నారాయ్ తయారు చేస్తే.. డొక్కు లాంబ్రెట్టా స్కూటర్ మీద ఇంటింటికి తిరుగుతూ అమ్మేవారు. ఇలా తినుబండారాలే కాకుండా భార్య సప్నారాయ్తో మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. కానీ ఆ రెండు బిజినెస్‌లు ఫెయిల్ అయ్యాయి. రెండు బిజినెస్‌లు ఫెయిల్ ప్రతి రోజు చెమట చిందిస్తేనే నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే పరిస్థితి మరింత దిగజారడంతో.. ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు సుబ్రతా రాయ్. అప్పుడే తన మాటే మంత్రంలా పనిచేసేలా రాయ్ మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ఈసారి గురి కుదిరింది. బిజినెస్ నిలబడింది. 30 ఏళ్ల పాటు అప్రతిహితంగా సాగింది. చివరికి సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. జైలు జీవితం ఎలా ఉంటుందో నేర్పింది. ఇంతకీ ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఇప్పుడంటే ఎటు చూసినా బ్యాంకులే దర్శనమిస్తున్నాయి. కానీ 1970లలో బ్యాంకులు ఉండేవి కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో బ్యాంక్ గురించి, సేవింగ్స్ గురించి పెద్దగా తెలిసేదికాదు. ఇక్కడే సుబ్రతరాయ్ మాస్టర్ మైండ్‌కి ఓ బిజినెస్ ఐడియా తట్టింది. అదేంటంటే? స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ స్కూటర్ మీద తినుబండరాలు అమ్మే సుబ్రతా రాయ్ స్థానికంగా ఉండే టీ స్టాల్ నిర్వాహకులు, రిక్షా నడపుతూ జీవనం కొనసాగించేవారు, తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు నిర్వహించే నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘మీరు ఏ పని చేస్తున్నా. వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా మీ దగ్గర ఎంతుంటే అంత బ్యాంక్‌లకు వెళ్లే అవసరం లేకుండా నా దగ్గర దాచండి. దాచిన మొత్తానికి కొంత కాలం తర్వాత అధిక మొత్తం వడ్డీ ఇస్తానని ఆశ చూపించారు. ఇలా ఒక రూపాయి నుంచి పదులు, వందలు ఇలా కొద్ది మొత్తాన్ని దాచుకోవచ్చని చెప్పడంతో వారికి ఇదొక మంచి అవకాశంగా భావించారు. ఈ ప్రచారంతో పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, మెట్రో నగరాల్లోని ప్రజలు సహారాలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. సహారాతో కనెక్టైనా ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా కట్టి పడేయడం రాయ్‌కి కొట్టిన పింది. కస్టమర్లను, ఏజెంట్లను, ఉద్యోగులను సహారాపరివార్ అంటూ తన మాటే మంత్రంలా పనిచేసేలా కట్టిపడేస్తుండేవారు. పైగా పేదలకు పెళ్లిళ్లు చేసి వారు ఆర్ధికంగా నిలబడేలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. సహారా పరివార్ పేరుతో దేశం మొత్తం ప్రచారం చేసేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యమైనట్లే? సహారా సంస్థమీద, సుబ్రతా రాయ్ మీద నమ్మకాన్ని పెంచేందుకు క్రికెట్లోకి అడుగుపెట్టారు. క్రికెట్‌ను మతంలా భావించే ఇండియన్ క్రికెట్ టీంకు స్పాన్సర్ చేశారు. దీంతో సహారా మీద ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. డిపాజిట్లు సైతం భారీగా పెరిగాయి. హాస్పిటల్ ఖర్చులు, చదువులు, పెళ్లిళ్లలకు సహారాలో డిపాజిట్ చేసిన డబ్బులు, వాటి నుంచి వచ్చే వడ్డీ ఉపయోగపడడంతో చాలా మంది సుబ్రతా రాయ్‌ని దేవుడిలా భావించారు. సంస్థ ఉద్యోగులు, కమిషన్ ఏంజెట్ల కష్టానికి ప్రతిఫలంగా వేతనాలు ఇవ్వడంతో సుబ్రతారాయ్‌ని సహారా శ్రీగా పిలిచేవారు. ఆయన చెప్పులు తాకితే జీవితం ధన్యం అనేలా ఫిలయ్యేవారనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలా 1978లో రూ.2వేల రూపాయల పెట్టుబడి, ముగ్గురు ఉద్యోగులతో ప్రారంభమైన సహారా 1.13 మిలియన్ల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. 1997కి సహారా సంస్థ 1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా అవతరించింది. ఎయిర్ సహారా, న్యూయార్క్‌లో లగ్జరీ హోటల్స్ కొనుగోలు, భారత్‌లో యాంబీ వ్యాలీ పేరుతో రిసార్ట్... ఇలా వాట్ నాట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్‌ను నిర్మించారు. క్రికెట్, ఏవియేషన్ రంగంలో సైతం అడుగు పెట్టారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. రూ.550కోట్లతో ఇద్దరు కుమారుల పెళ్లి సుబ్రాతా రాయ్‌కి సుశాంతో, సీమంతో రాయ్ ఇద్దరు కుమారులు. 2004 ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో వాళ్లిద్దరి పెళ్లిని రూ. 550 కోట్లతో నాలుగు రోజుల పాటు నిర్వహించారు. ముఖ్య అతిధుల కోసం ప్రైవేట్ జెట్లను ఏర్పాటు చేశాడు సుబ్రతారాయ్. కొద్ది మందిని కొంత కాలమే మోసం చేయొచ్చు. ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సుబ్రతారాయ్ చేసిన మోసాలకు ముసుగు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కొడుకుల పెళ్లితో సుబ్రతా రాయ్ జీవనశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. నిరుపేదల సొమ్మును దోచుకునేలా ఇలా నిరుపేదలు దాచుకున్న మొత్తాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వెల్లవెత్తాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అప్పటి వరకు ప్రజలు డిపాజిట్ చేసిన అసలు, వడ్డీని సహారా ఇచ్చేది. రోజులు గడిచే కొద్ది ఆ మొత్తాన్ని ఇవ్వకుండా సహారా గ్రూప్‌లోని ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా వారిని మోటివేట్ చేసేవారు. అంతేకాదు అప్పటి వరకు ఏజెంట్లు ఇంటికి వెళ్లి డిపాజిట్లను వసూలు చేసేవారు. కానీ ఇకపై ఏజెంట్లకు ఇంటింటికి తిరగరని మీరే వచ్చి డిపాజిట్ చేయాలని హుకుం జారీ చేశారు. అలా డిపాజిట్ చేసేందుకు వీలు లేక కట్టని వారిని స్కీమ్‌ల నుంచి వారి పేర్లను తొలగించేవారు. తొలగించిన వారి డిపాజిట్లను తిరిగి ఇచ్చేది కాదు సహారా గ్రూప్. సహారా మోసం వెలుగులోకి వచ్చింది అప్పుడే అయితే సుదీర్ఘ విరామం తర్వాత 2009లో స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సహారా ఇండియా గ్రూప్ తన రియల్టీ విభాగం సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్ (ఎస్పీసీఎల్) ఐపీవోకి వెళుతున్నట్లు సుబ్రతారాయ్ ప్రకటించారు. ఆ ప్రకటన సహారాని ఊహించని మలుపు తిప్పింది. ఐపీవోకి వెళ్లాలంటే కంపెనీల వివరాలు లాభాలు, నష్టాలు, వివాదాలన్నింటిని వివరిస్తూ ‘డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్’ను సెబీకి దాఖలు చేయాలి. ఇక్కడే సహారా గ్రూప్ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా రూ.24,000 కోట్ల కుంబకోణానికి పాల్పడినట్లు సెబీ గుర్తించింది. సుబ్రతా రాయ్‌ని ఇరికించిన రోషన్‌లాల్ ఆ తర్వాత కొద్ది రోజులకు డిసెంబర్ 25, 2009న, జనవరి 4, 2010న సెబీకి రెండు ఫిర్యాదులు అందాయి. సహారాకు చెందిన ఈ రెండు (పైన పేర్కొన్న) సంస్థలు కొన్ని బాండ్ల జారీలో చట్టవిరుద్ధమైన మార్గాలను ఉపయోగించాయని ఆరోపించాయి. ఆ ఫిర్యాదు చేసింది మరోవరో కాదు. ఒకరు పెట్టుబడిదారులు సభ్యులు చేస్తే, జనవరి 4, 2010న ఆడిటర్ రోషన్‌లాల్ చేశారు. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. రోషన్ లాల్ ఫిర్యాదు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా సెబీకి చేరింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా, సెబీ.. సహారా గ్రూప్ నుండి వివరణలు కోరడం ప్రారంభించింది. సంచలనం సెబీ ప్రశ్నల పరంపరపై రాయ్ స్పందిస్తూ ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,669 బాక్సుల్లో 3 కోట్ల మంది మదుపర్ల ధరఖాస్తులు, రెండు కోట్ల రిడెంప్షన్ వోచర్లను సెబీకి పంపారు. దీంతో సెబీ ప్రధాన కార్యాలయం ఉన్న ముంబై శివార్లలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కుల్లో వచ్చిన ఆధారాల్ని సెబీ ఒక గోదామును అద్దెకు తీసుకుని ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించి మరీ ఈ పత్రాలను సర్దాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహారా కేసులో 20 కోట్ల పేజీలను స్కాన్ చేసి, ఒక సర్వర్‌లో దాచింది. నన్ను ఉరితీసుకోవచ్చు పలు దఫాలుగా సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం, కేసు అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్ చెబుతూ వచ్చింది. అంతేకాదు తన 32 వ్యాపారం రంగంలో ఎన్నడూ న్యాయ నిబంధనలకు వ్యవహరించలేదని, అలా చేస్తే నన్ను ఉరి తీయొచ్చని సుబ్రతారాయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు నుంచి బయట పడేలా లలిత్ మోడీ సాయం ఇలా 2010 నుంచి ప్రారంభమైన సుబ్రతారాయ్ కేసు 2014 మార్చి 4 వరకు కొనసాగింది. మార్చి 4 పోలీసు కస్టడీలో ఉన్న సుబ్రతారాయ్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉండి కేసు నుంచి బయటపడేందుకు ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాడు రాయ్. ఇందు కోసం జైలులో వైఫైని ఏర్పాటు చేయాలని కోరారు. ఇక తన ఆస్తుల్ని అమ్మి కేసు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని, కార్పొరేట్ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీని కోరాడు. ఇలా 2014 నుంచి 2016 వరకు తీహార్ జైలులో శిక్షను అనుభవించారు. చివరికి 2014 మార్చి 4 బెయిల్‌పై విడుదలయ్యారు. కడసారి చూపుకు నోచుకోని తాజాగా, సుబ్రతారాయ్ అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించగా.. గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేసులు కారణంగా ఇద్దరు కుమారులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించిన రాయ్‌ని కడసారి చూపుకు ఆయన ఇద్దరు కుమారులు సుశాంతో, శ్రీమంతోలు నోచుకోలేదు. చివరికి అందరూ ఉన్న అనాధలా లండన్‌లో చదువుకుంటున్న సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. -
సహారా ఇష్యూ కొనసాగుతుంది
ముంబై: గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బుచ్ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో 75ఏళ్ల రాయ్ మంగళవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. సహారా అంశం కంపెనీకి సంబంధించినదని, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ఇష్యూ కొనసాగుతుందని తెలియజేశారు. ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా విలేకరులకు బుచ్ ఈ విషయాలు వెల్లడించారు. సహారా ఇన్వెస్టర్లకు వాపసు చేయాల్సిన రూ. 25,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లోనే ఉండగా, రాయ్ మరణించిన నేపథ్యంలో బుచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆధారాలున్న ఇన్వెస్టర్ల క్లయిములకు అనుగుణంగా సుప్రీం కోర్టు నియమిత కమిటీ సొమ్ములు వాపసు చేస్తున్నట్లు బుచ్ తెలియజేశారు. వివరాల్లోకి వెడితే.. సహారా గ్రూప్‌లో భాగమైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీఏ), సహారా హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలు .. ఓఎఫ్‌సీడీల (డిబెంచర్లు) ద్వారా 2007–08లో ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించడం వివాదాస్పదమైంది. దీనితో పోంజీ స్కీముల ఆరోపణల మీద సహారా గ్రూప్ 2010 నుంచి సమస్యల్లో చిక్కుకుంది. ఆపై 2014లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాయ్‌ను అరెస్ట్ చేశారు. గ్రూప్ కంపెనీలు రెండింటికి సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్లు వాపస్ చేయకపోవడంతోపాటు .. కోర్టుముందు హాజరుకావడంలో విఫలం చెందడంతో రాయ్ అరెస్ట్ అయ్యారు. తదుపరి రాయ్ బెయిల్ పొందినప్పటి కీ గ్రూప్ కంపెనీల సమస్యలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రిఫండ్ చేయడానికి, న్యాయస్థానం ఆదేశాల మేరకు సెబీ ప్రత్యేక ఖాతాల్లోకి సహారా గ్రూప్ రూ. 24,000 కోట్లు జమ చేసింది. -
సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ
సహారా గ్రూపు ఫౌండర్ చైర్మన్ సుబ్రతా రాయ్ మరణంతో, సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంగతి, వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయనే ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ క్లారిటీ ఇచ్చింది. చట్టపరమైన చర్యలు, విచారణ వ్యక్తిపై కాదని, గ్రూపుపై అని, ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని సెబీ చైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ గురువారం స్పష్టం చేశారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా దర్యాప్తు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ FICCI నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ సందర్భంగా బుచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు రీఫండ్ చేయాల్సింన మొత్తం రూ. 25,000 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, మార్చి 31 నాటికి సెబీ మొత్తం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్ చేసింది. పెట్టుబడి రుజువుతో ముందుకు వస్తున్న వారికి చెల్లింపులు జరిగాయని ఆమె చెప్పారు. కాగా సెబీ-సహారా కేసులో మద్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతోంది. ఈ కేసులో రెండు సహారా గ్రూప్ సంస్థలు– సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారనేది అభియోగం. సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జారీ చేసిన హౌసింగ్ బాండ్ల వ్యత్యాసాలను చార్టర్డ్ అకౌంటెంట్ రోషన్ లాల్ ఫిర్యాదుతో సహారా గ్రూప్ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై 2008లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ విచారణ తర్వాత సుబ్రతా రాయ్ కూడా జైలు పాలయ్యారు సహారా కన్వర్టబుల్ డిబెంచర్లు (OFCDలు) జారీ ద్వారా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. సుమారు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుండి సేకరించిన ఈ నిధులను తిరిగి చెల్లించాలని సహారా గ్రూప్ సంస్థలైన SIREL, SHICLలకు 2011లో సెబీ ఆదేశించింది. ఆగస్టు 31, 2012న, సెబీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, సేకరించిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. -
సుబ్రతారాయ్ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్, లక్నోలోని బైకుంత్ ధామ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన ఇరువురు కుమారులో అందుబాటులో లేకపోవడంతో సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గంగా నది ఒడ్డున యనవడు హిమాంక్ ఆయన చితికి నిప్పింటించారు. రాయ్ కుమారులు, సుశాంతో, శ్రీమంతోలు విదేశాల్లో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారని సన్నిహిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లండన్‌లో చదువుకుంటున్న హిమాంక్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. సుబ్రతా రాయ్ చిన్న కుమారు శ్రీమంతో పెద్ద కుమారుడు హిమాంక్ రాయ్ లండన్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. సుబ్రతా రాయ్ భార్య స్వప్న, అతని మేనకోడలు ప్రియాంక సర్కార్,ఇతరకుటుంబ సభ్యుల బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుకున్నారు. అటు రాయ్ మృతదేహాన్ని కూడా కూడా చార్టర్ విమానంలో లక్నోకు తరలించారు. సహారా సుబ్రతాకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు రాయ్‌కు కడసారి నివాళులర్పించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు ఆరాధన మిశ్రా మోనా, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, అమ్మర్ రిజ్వీ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు, మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్, యూపీ మంత్రి నితిన్ అగర్వాల్, స్మితా ఠాక్రే, బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, సున్నీ మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తదిరులు ఆయనను కడసారి దర్శించుకున్నారు. అలాగే కంపెనీకి చెందిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆయన అధికారిక నివాసానికి తరలి వచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్ సహారాజీ అంటూ నినదించారు. #WATCH | Lucknow, Uttar Pradesh: On Sahara Group Chairman Subrata Roy's demise, singer Sonu Nigam says, "Since 1997, I and Subrata Roy have had an association. I have spent a very good time with him. He is like my brother, father, and friend..." pic.twitter.com/vYYnNeICC2 — ANI (@ANI) November 16, 2023 VIDEO | Sahara group founder and chairman Subrata Roy‘s mortal remains being taken for the last rites ceremony at Sahara City in Lucknow. pic.twitter.com/QEngVKsEfS — Press Trust of India (@PTI_News) November 16, 2023 -
127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు.. సెబీకి పంపిన సుబ్రతా రాయ్.. కారణం ఇదేనా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణం దాదాపు మూడు కోట్ల మంది పెట్టుబడిదారులు చేసిన మదుపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్సైట్ ప్రకారం.. ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్‌లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్సైట్ చెబుతోంది. సెబీ చర్యల కారణంగా సుబ్రతా రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం అవడం మొదలైంది. సహారా సంస్థ రియల్ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.25వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై కేసు నమోదైంది. 2011లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) అనే రెండు సంస్థలను సెబీ ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి సుబ్రతా రాయ్ వార్తల్లో నిలిచారు. ఆ ట్రక్కుల్లో మూడు కోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లు ఉన్నాయి. నిర్ణత గడువులోగా రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. రూ.5 వేల కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.5 వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో హామీ ఇస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. రాయ్ రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు సెబీకు దాదాపు రూ.25వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు గతంలో సుబ్రతారాయ్ ప్రకటించారు. కానీ కంపెనీ పెట్టుబడిదారులకు సెబీ తిరిగి సొమ్ము చెల్లించలేదని రాయ్ ఆరోపించారు. సెబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు మొత్తం రూ.25,163 కోట్లు నిర్ణయించినప్పటికీ రూ.138 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది. రెండు సహారా గ్రూపు సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించేటప్పుడు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 31 నాటికి తమకు 20వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 17500 దరఖాస్తులకు సంబంధించిన డబ్బును వాపసు చేశామని సెబీ తెలిపింది. సరైన రుజువులు సమర్పించని కారణంగా మిగతావాటిని చెల్లించలేదని వివరించింది. సెబీ లేవనెత్తిన ప్రశ్నలపై బాండ్ హోల్డర్ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో వాటిని నిలిపేసినట్లు సమాచారం. -
సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది?
సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ మంగళవారం అర్థరాత్రి కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మరణించారు. 75 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచానికి వీడ్కోలు పలికారు. భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన సుబ్రతా రాయ్ విభిన్న వ్యాపార ప్రయోజనాలతో కూడిన సహారా ఇండియాను నెలకొల్పారు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సుబ్రతా రాయ్‌ను ‘సహారాశ్రీ’ అని కూడా పిలుస్తుంటారు. ఆయనకు బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో విడదీయరాని స్నేహం ఉందని చెబుతారు. అమితాబ్ బచ్చన్ వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయినప్పుడు సుబ్రతా రాయ్ ‘బిగ్‌బీ’కి సహాయం అందించారు. వీరి స్నేహం ఇక్కడి నుంచే మొదలైంది. వీరిద్దరినీ సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత అమర్ సింగ్ దగ్గర చేశారని చెబుతారు. ఈ ముగ్గురూ మంచి స్నేహితులుగా మెలిగారు. దీనికి గుర్తుగా పలు ఫొటోలు ఇంటర్నెట్లో కనిపిస్తాయి. సుబ్రతా రాయ్ సహారా మేనకోడలు శివాంక వివాహం 2010లో జరిగింది. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమయంలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ సుబ్రతా రాయ్ సహారా కలిసి కనిపించారు. ఇప్పుడు సుబ్రతా రాయ్ సహారా మన మధ్య లేరు. బుధవారం(నేడు)లక్నోలో సుబ్రతా రాయ్ సహారా అంత్యక్రియలు జరగనున్నాయి. ఇది కూడా చదవండి: సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది? -
సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది?
సహారా ఇండియా గ్రూప్ చైర్మన్ సహారాశ్రీ సుబ్రతా రాయ్ సహారా ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్థాపించిన సహారాగ్రూప్ నేడు హౌసింగ్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఆయన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సుబ్రతా రాయ్ సహారా భార్య, పిల్లలు ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నారు. సుబ్రతా రాయ్‌కు భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కుమారులు సీమాంతో, సుశాంతో రాయ్ ఉన్నారు. ఆయన తన కుమారుల పెళ్లిళ్లకు రూ.550 కోట్లు ఖర్చు చేశారని చెబుతుంటారు. వీరి వివాహాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం సుబ్రతారాయ్ భార్య, కుమారుడు సుశాంతో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. సుబ్రతా రాయ్ కుటుంబం ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ దేశమైన నార్త్ మాసిడోనియా పౌరసత్వం తీసుకుంది. భారత చట్టాల నుంచి నుంచి తప్పించుకునేందుకే వారు నార్త్ మాసిడోనియా పౌరులుగా మెలుగుతున్నట్లు సమాచారం. సుబ్రతా రాయ్‌పై ‘సెబీ’ కేసు నడుస్తోంది. పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. సుబ్రతా రాయ్‌కి మాసిడోనియన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తుంటాయి. సుబ్రతా రాయ్ పలుమార్లు మాసిడోనియా రాష్ట్ర అతిథి హోదాను కూడా అందుకున్నారు. సుబ్రతారాయ్ భార్య స్వప్నా రాయ్‌పై 2017లో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఆమె తరపున దాఖలయిన పిటిషన్లో.. ఆమె చట్టాన్ని గౌరవించే మహిళ అని, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పౌరురాలు అని, ఆమెకు నేర చరిత్ర లేదని పేర్కొన్నారు. సహారా ఇండియా ఫ్యామిలీ ఛైర్మన్ భార్యగా ఆమెకు ఎల్ఓసీ జారీ చేశారు. మాసిడోనియాలో మూడు బడా వ్యాపారాలను ప్రారంభించాలని సహారా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి డెయిరీ, రెండవది లాస్ వెగాస్ తరహాలో సెవెన్ స్టార్ హోటల్, మూడవది ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం ఇండోర్ సెటప్. వీటికి మాసిడోనియా ప్రభుత్వం నుంచి కూడా సాయం అందుతున్నదని తెలుస్తోంది. ఉత్తర మాసిడోనియాలో పౌరసత్వం పొందడం చాలా సులభం. 4 లక్షల యూరోలు పెట్టుబడిగా పెడితే అక్కడి పౌరసత్వం దక్కుతుంది. దీంతో పాటు వారి సంస్థలో 10 మంది స్థానికులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి షరతులను నెరవేర్చిన వారు మాసిడోనియన్ పౌరసత్వం పొందవచ్చు. ఇది కూడా చదవండి: సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత Sahara Group Managing Worker and Chairman Subrata Roy passes away due to cardiorespiratory arrest: Sahara Group pic.twitter.com/ugUdBrxiSp — ANI (@ANI) November 14, 2023 -
ఉద్యోగులకు టాటా స్టీల్ భారీ షాక్.. 800 మంది తొలగింపు
న్యూఢిల్లీ: నిర్మాణాత్మక పోటీతత్వం, లాభదాయకతలో భాగంగా టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్‌లో 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వీరిలో 300 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. టాటా స్టీల్ యూరప్ నుండి రెండు స్వతంత్ర కంపెనీలుగా టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ నెదర్లాండ్స్‌ను వేరు చేసే ప్రక్రియను 2021 అక్టోబరులో టాటా స్టీల్ పూర్తి చేసింది. నెదర్లాండ్స్‌లో కంపెనీకి ఏటా ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యంగల తయారీ ప్లాంట్ ఉంది. -
సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా ఇండియా గ్రూప్ చైర్మన్ సహారాశ్రీ సుబ్రతా రాయ్ సహారా మంగళవారం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం లక్నోలోని సహారా షహర్‌కు తరలించనున్నారు. అక్కడ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించనున్నారు. రాయ్ మృతికి వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సహారా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ వర్కర్, చైర్మన్ సుబ్రతా రాయ్ సహారా మృతికి విచారం తెలియజేస్తున్నాం. దూరదృష్టి కలిగి, అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అయిన సహారాశ్రీ సుబ్రతా రాయ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. రాయ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారని’ దానిలో పేర్కొంది. నవంబర్ 12న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు. సుబ్రతా రాయ్ సహారా 1948, జూన్ 10న జన్మించారు. సహారా ఇండియా పరివార్‌ను స్థాపించారు. బీహార్‌లోని అరారియా జిల్లాలో జన్మించిన సుబ్రతా రాయ్ కోల్‌కతాలోని హోలీ చైల్డ్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ సాంకేతిక సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. సహారాశ్రీగా పేరొందిన ఆయన తన వ్యాపారాన్ని 1978లో గోరఖ్‌పూర్ నుండి ప్రారంభించారు. 2012లో ఇండియా టుడే మ్యాగజైన్ భారతదేశంలోని 10 మంది ధనవంతులలో సుబ్రతా రాయ్ పేరును చేర్చింది. నేడు సహారా గ్రూప్.. హౌసింగ్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సహారాశ్రీ మృతికి సమాజ్‌వాదీ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంగా ఒక పోస్ట్‌లో సమాజ్‌వాదీ పార్టీ సుబ్రతా రాయ్ మృతికి సంతాపం తెలిపింది. సహరాశ్రీ సుబ్రతా రాయ్ మరణం చాలా బాధాకరమని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత सहाराश्री सुब्रत रॉय जी का निधन, अत्यंत दुःखद। ईश्वर उनकी आत्मा को शांति दें। शोकाकुल परिजनों को ये असीम दुःख सहने का संबल प्राप्त हो। भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/QO6vAjriAv — Samajwadi Party (@samajwadiparty) November 14, 2023 -
కోట్ల ఖర్చుతో పెళ్లి.. ఆడంబరమే అయినా ఆదర్శమూ ఉంది..
భారత దేశంలో పెళ్లి అనేది చాలా పెద్ద వేడుక. సామాన్య మధ్య తరగతి వారి నుంచి సంపన్నుల వరకూ వారి వారి స్థాయిలో వివాహ వేడుకను జరిపిస్తుంటారు. ఇక బడా వ్యాపారవేత్తల సంగతి చెప్పనక్కర లేదు. అత్యంత ఆడంబరంగా జరిగిన చాలా పెళ్లిళ్ల గురించి మనకు తెలుసు. అయితే ఆడంబరంతో పాటు ఆదర్శం కూడా ఉన్న ఓ ప్రఖ్యాత వ్యాపారవేత్త కొడుకుల జంట వివాహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (అమెజాన్ నుంచి 100 మంది అవుట్!) సహారా ఇండియా పరివార్ చైర్మన్ సుబ్రతా రాయ్ కుమారులు సుశాంతో, సీమంతో రాయ్‌ల వివాహాలు 2004లో ఒకే వేదికలో జరిగాయి. రూ. 550 కోట్లతో అంగరంగ వైభవంగా వారి వివాహాలు జరిపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో నాలుగు రోజుల పాటు జరిగిన వివాహానికి అతిథులను ప్రైవేట్ జెట్లలో తరలించినట్లు వార్తలు వార్తలు వచ్చాయి. అయితే ఆ విలాసవంతమైన వివాహాలకు సంబంధించి ఆదర్శవంతమైన మరో కోణం ఉంది కుమారుల వివాహం సందర్భంగా సుబ్రతా రాయ్ కుటుంబం వివిధ మతాలు, కులాలకు చెందిన 101 మంది నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చేసి సుమారు 15000 మంది పేదలకు భోజనం అందించారు. కాగా సుశాంతో, సీమాంతోల వివాహ వేడుకలకు దాదాపు 11,000 మంది అతిథులు హాజరయ్యారు. (వామ్మో.. పసిడి పరుగు, వెండి హై జంప్!) వివాహ వేడుకలో 100కి పైగా వివిధ రకాల వంటకాలను వడ్డించారు. సుశాంతో రాయ్ రిచా అహుజాను, సీమంతో రాయ్ చాందిని తూర్ను వివాహం చేసుకున్నారు. వివాహ వేదికను ఖరీదైన పూలు, పాలిష్ లైట్లు, ప్రిజం గ్లాసులు, దీపాలతో అద్భుతంగా అలంకరించారు. అతిథులలో పలువురు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఉన్నారు. -
బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ!
వ్యాపారం చేశారు... విజయాలు సాధించారు... కొందరు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఈ వ్యాపారవేత్తల జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రస్తుతం కొందరు విజయవంతమైన వ్యాపారవేత్తల ‘బయోపిక్’కి హిందీలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రియల్ బిజినెస్మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ చేస్తున్నారు సినీ బిజినెస్మెన్ అయిన నిర్మాతలు. ఇక ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం. మూడు తరాల టాటా కథ టాటా గ్రూపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశపు అతి పెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్ షెడ్జీ టాటా. జమ్ షెడ్జీ తర్వాత ఆ కుటుంబానికి చెందిన వారసులు బాధ్యతలు చేపట్టారు. వారిలో రతన్ టాటా ఒకరు. దేశంలో పేరున్న ఈ కుటుంబంపై సినిమా నిర్మించడానికి టీ సిరీస్ భూషణ్‌కుమార్ హక్కులు పొందారు. ‘ది టాటాస్’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. టాటా కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యాపారవేత్తల కథతో ఈ సినిమా ఉంటుంది. ‘ది టాటాస్, హౌ ఎ ఫ్యామిలీ బిల్ట్ ఎ బిజినెస్ అండ్ ఎ నేషన్’ నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంకా ఈ చిత్రానికి నటీనటులు, దర్శకుడి ఎంపిక జరగలేదు. కాఫీ కింగ్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాకుడు వీజీ సిద్ధార్థ జీవితం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో సిద్ధార్థ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యాపారంలో విజయవంతంగా దూసుకెళుతున్న ఆయన అనూహ్యంగా నదిలో శవం అయి తేలడం వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ‘కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్థ’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. హిందీలో అక్షయ్‌కుమార్ ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరరై పోట్రు’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధ. రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కాగా సౌత్‌లో ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించిన సూర్య రీమేక్‌ని కూడా నిర్మించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకి ఇది తొలి చిత్రం అవుతుంది. విజయాలు.. వివాదాలతో... విజయాలు, వివాదాలతో వార్తల్లో నిలిచిన సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ బయోపిక్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు కానీ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, రచయితగా గుల్జార్ వ్యవహరించనున్నారు. ‘దిల్ సే, గురు, యువరాజ్, స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలకు రెహమాన్, గుల్జార్ పని చేశారు. గుల్జార్ లాంటి అద్భుత రచయితతో మళ్లీ కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు. లలిత్ లైఫ్‌తో... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవిత విశేషాలతో సినిమా రూపొందనుంది. ఐపీఎల్‌తో క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లలిత్ మోడీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వార్త వచ్చింది. అయితే ఈ వార్త నిజం కాదని లలిత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘ఏదో పుస్తకం ఆధారంగా నాపై సినిమా తీస్తున్నారని విని ఆశ్చర్యపోయాను. దానికి, నాకూ ఎలాంటి సంబంధం లేదు. నా బయోపిక్ గురించి నేను స్వయంగా ప్రకటిస్తాను’’ అని లలిత్ పేర్కొన్నారు. విజయంతో వెలుగులోకి... ప్రముఖ అంధ పారిశ్రామిక వేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం వెండితెరకు రానుంది. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఎన్నో ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. చూపు లేకపోయినా విజయంతో వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్ జీవితం ఆధారంగా దర్శకురాలు తుషార్ హిద్రానీ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీకాంత్ బొల్లా పాత్రను రాజ్‌కుమార్ రావ్ పోషించనున్నారు. ఇవే కాదు.. మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తల బయోపిక్స్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా స్ఫూర్తిగా నిలిచే వ్యాపారవేత్తల జీవిత చిత్రాలంటే ఇంకా ఉంటుంది. అందుకే దర్శక–నిర్మాతలు రియల్ బిజినెస్మెన్ జీవితాలను రీల్‌పై ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. -
మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి!
లక్నో: మార్కెట్ రెగ్యులేటర్ సెబీని సహారా ఇండియా పరివార్ ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించింది. సహారాకు చెందిన రూ.25,000 కోట్లు ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అందులో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో కేవలం రూ.125 కోట్లనే ఇన్వెస్టర్లకు చెల్లిందని పేర్కొంది. మిగిలిన డబ్బును ఎందుకు చెల్లించలేకపోతోందని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బాధిత కంపెనీగా సహారా మిగులుతోందని విమర్శించింది. అక్రమంగా వసూలు చేశారంటూ తమ వద్ద నుంచి డిపాజిట్ చేయించుకున్న రూ.25,000 కోట్లను ఇన్వెస్టర్లు అందరికీ చెల్లింపులు చేయాలని లేదా ఆ మొత్తాలను తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. తద్వారా తామే తమ డిపాజిట్‌దారులకు డబ్బు చెల్లించుకుంటామని స్పష్టం చేసింది. సెబీ వద్ద సహారా డబ్బు డిపాజిట్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు అసలు లక్ష్యం నెరవేరడం లేదని పేర్కొంది. -
న్యూయార్క్ ప్లాజా అమ్మకానికి భారీ డీల్!
న్యూయార్క్ : సహారా గ్రూప్‌కి చెందిన ప్రఖ్యాత ప్లాజా హోటల్‌ను ఎట్టకేలకు ఇద్దరు వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు. న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో సుబ్రతా రాయ్‌కి చెందిన సహారా గ్రూప్‌కు 70 శాతం వాటాలు ఉన్నాయి. చాలా కాలంగా సహారా సంస్థ ఈ హోటల్‌ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్తలు దీన్ని కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న వైట్ సిటీ వెంచర్స్ యజమాని షాహల్ ఖాన్, హకీమ్ సంస్థ యజమాని కమ్రాన్ హకీమ్ 70 శాతం వాటాలను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ జూన్ 25తో ముగుస్తుంది. 1907లో ఈ హోటల్ ప్రారంభమైంది. అమెరికాలో ఈ ఒక్క హోటల్‌కే ‘నేషనల్ రిజిస్టార్ ఆఫ్ హిస్టారిక్ ప్లేసెస్’లో చోటు దక్కింది. 70 శాతం వాటాను సహారా గ్రూప్ కార్పొరేట్ పైనాన్స్ హెడ్ సందీప్ వాద్వావ, 5 శాతం వాటాను ఛత్వల్‌లు 2012లో కొనుగోలు చేశారు. అయితే సహారా చాలా కాలంగా ఈ హోటల్ అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నా.. మిగతా 25 శాతం వాటాను కలిగి ఉన్న దుబాయ్ యువరాజు అల్వలీద్ బిన్ తాలీల్ వల్ల కుదరలేదు. అయితే గత ఏడాది ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జానిస్ లాంగ్ లాసల్లే హోటల్‌ను వేలం వేసే బాధ్యతను తీసుకుంది. దాంతో 75 శాతం వాటాను విక్రయించినట్లు సందీప్, ఛత్వల్‌లు ప్రకటించారు. ఈ విక్రయ ఒప్పంద వ్యవహారం చాలా రహాస్యంగా సాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ హోటల్‌ను 2005లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేసి దివాలా తీశారు. మొత్తానికి భారీ ఒప్పందంతో సహారా గ్రూప్ ఊపిరి పీల్చుకుంది. -
యాంబీ వ్యాలీ వేలం నిలిపివేయండి!
సుప్రీంకు సహారా అభ్యర్థన న్యూఢిల్లీ: యాంబీ వ్యాలీ ఆస్తి వేలాన్ని నిలిపేయాలని సహారా చీఫ్ సుబ్రతో రాయ్ బుధవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రెండు గ్రూప్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి నిధులు వసూలు చేయటమే కాక... పునః చెల్లింపుల్లో విఫలమైన కేసులో రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలానికి ఇంతక్రితం బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌ను నియమిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఇందుకు సంబంధించి లిక్విడేటర్ నోటీసు ప్రచురించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సహారా తాజా పిటిషన్ దాఖలు చేసింది. చెల్లింపుల ప్రణాళికను సుప్రీం ముందు సహారా ఉంచుతున్నందున మహారాష్ట్ర పూనే జిల్లాలో ఉన్న ఈ ఆస్తి వేలం నిలిపివేయాలని రాయ్ కోరారు. అయితే కేసు విచారణ తేదీని తరువాత నిర్ణయిస్తామని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. చెల్లించాల్సిన మొత్తం రూ.24,000 కోట్ల నిధుల్లో మిగిలిన దాదాపు రూ.9,000 కోట్ల చెల్లింపులకు 18 నెలల సమయాన్ని ఇప్పటికే సహారా కోరింది. అయితే వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్నది సెబీ వాదన. -
యాంబీ వ్యాలీ వేలానికి సిద్ధం కండి!
న్యూఢిల్లీ : సహారా గ్రూప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తి యాంబీ వ్యాలీ వేలం వేసే ప్రక్రియను చేపట్టాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం, బొంబై హైకోర్టును ఆదేశించింది. యాంబీ వ్యాలీ ప్రాపర్టీస్‌కు సంబంధించిన విక్రయ నోటీసు ప్రచురించాలని పేర్కొంది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని అంతకముందే సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే దీనిలో రూ.247 కోట్లను మాత్రమే సహారా చీఫ్ సెబీ అకౌంట్లో జమచేశారు. మిగతా మొత్తం రూ.305.21 కోట్లను ఆగస్టు 21 వరకు డిపాజిట్ చేస్తామని సుబ్రతారాయ్ తరుఫున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ చెప్పారు. బ్యాలెన్స్ మొత్తంతో పాటు రూ.1500 కోట్లను సెప్టెంబర్ 7 వరకు సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు సుబ్రతారాయ్‌ను ఆదేశించింది. దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. అంతేకాక సుబ్రతారాయ్ పెరోల్ గడువును అక్టోబర్ 10 వరకు కోర్టు పొడగించింది. తుదపరి విచారణను సెప్టెంబర్11న చేపట్టనునున్నట్టు కోర్టు చెప్పింది. -
సహారా 710 కోట్లు డిపాజిట్!
♦ జూలై 15లోపు రూ.552 కోట్ల చెక్కు ♦ నగదుగా మారాలని సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్... సెబీ–సహారా అకౌంట్లో రూ.710.22 కోట్లు డిపాజిట్ చేశారు. అయితే ఈ మొత్తంలో రూ.552.21 కోట్లకు సంబంధించిన చెక్కు జూలై 15వ తేదీలోపు తప్పనిసరిగా నగదుగా మారాలని (రియలైజేషన్) అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. నిజానికి ఇందుకు మరింత గడువు (జూలై 15 తరువాత) కావాలన్న రాయ్ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. అసల్లో బకాయి రూ.9,000 కోట్లు... జూన్ 15 లోపు రూ.1,500 కోట్లు చెల్లిస్తాననీ, అటు తర్వాత సరిగ్గా నెల రోజులకు రూ.552.22 కోట్లు చెల్లిస్తాననీ రాయ్ ఇంతక్రితమే కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే జూన్ 15 నాటికి రూ.790.18 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.709.82 కోట్ల చెల్లింపులకు జూలై 4వ తేదీ వరకూ గడువు కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది. తాజాగా డిపాజిట్ చేసిన మొత్తం తరువాత, చెల్లించాల్సిన అసలు రూ.24,000 కోట్లలో ఇంకా రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది. యాంబీ వేలం దిశలో మరో ముందడుగు... కాగా సహారా యాంబీ వ్యాలీలో ఆస్తుల వేలానికి సంబంధించి బాంబే హైకోర్ట్ అధికారిక లిక్విడేటర్ వినోద్‌శర్మ సిద్ధం చేసిన నియమ, నిబంధనావళికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేసింది. చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేకపోతే యాంబీ వ్యాలీలో సహారా గ్రూప్‌కు ఉన్న రూ.34,000 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయాలని సుప్రీంకోర్టు ఇంతక్రితమే ఆదేశించింది. మదుపరులకు రెండు సహారా సంస్థలు (సహారా ఇండియా రియల్టీ కార్పొరేషన్, సహారా హౌసింగ్) రూ.24,000కు పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో ఇరువురు కంపెనీల డైరెక్టర్లతోపాటు దాదాపు రెండేళ్లు జైలులో ఉన్న రాయ్, తల్లి మరణంతో గత ఏడాది మే 6న పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే సుప్రీం ఆదేశాలతో నిర్దేశిత సమయాల్లో చెల్లించాల్సిన మొత్తంలో కొద్దికొద్దిగా చెల్లిస్తూ, రాయ్ పెరోల్‌పై కొనసాగుతున్నారు. -
డబ్బు కట్టకపోతే యాంబీ వ్యాలీ వేలమే
సహారా అధినేత సుబ్రతారాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు జూలై 20 వరకు పొడిగిచ్చింది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ జూలై 20కు వాయిదావేసింది. అయితే ఆ రూ.552 కోట్ల చెల్లింపులకు మరింత సమయమివ్వాలనే సహారా గ్రూపు సుప్రీంకోర్టును కోరింది. వారి అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఒకవేళ ఈ నగదును జూలై 15 వరకు కట్టకపోతే, తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. తాత్కాలికంగా అయితే యాంబీ వ్యాలీ వేలాన్ని ఆపుతున్నామని, కానీ రూ.552 కోట్లను చెల్లించపోతే, యాంబీ వ్యాలీ వేలం ప్రక్రియ వెనువెంటనే ప్రారంభమవుతుందని తెలిపింది. కాగ, గత విచారణ సందర్భంగా రూ.709.82 కోట్లను డిపాజిట్ చేయడానికి సుబ్రతారాయ్‌కు నేటి వరకు అవకాశమిచ్చింది. ఇందుకు అనుగుణంగా తాత్కాలిక బెయిల్‌ను కూడా నేటి(జూలై 5) వరకు పొడిగించింది. జూన్ 15, జూలై 15న సెబీకి వరుసగా రూ.1,500 కోట్లు, రూ.552.22 కోట్లు చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఇంతక్రితమే సహారా రెండు చెక్కులను డిపాజిట్ చేసింది. అయితే ఈ డబ్బును సమకూర్చలేకపోవడాన్ని తీవ్రంగా తీసుకున్న సుప్రీంకోర్టు, మహారాష్ట్రలో సంస్థకు చెందిన రూ.34,000 కోట్ల విలువైన యాంబీ వ్యాలీ జప్తునకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
సహారా రాయ్‌కు మరో 10 రోజుల గడువు
రూ.710 కోట్ల డిపాజిట్‌పై సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సెబీ–సహారా కేసులో రూ.709.82 కోట్లను డిపాజిట్ చేయడానికి సుబ్రతాయ్రాయ్కి సుప్రీంకోర్టు మరో 10 రోజుల సమయాన్ని ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా తాత్కాలిక బెయిల్‌ను కూడా జూలై 5 వరకూ పొడిగించింది. రాయ్ తరఫున జస్టిస్ దీపక్ మిశ్రా, రంజన్ గొగొయ్‌లతో కూడిన బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. రూ.1,500 కోట్లు డిపాజిట్ చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా రాయ్ ఇప్పటికే రూ.790.18 కోట్లు సెబీ–సహారా అకౌంట్లో డిపాజిట్ చేశారని, మిగిలిన మొత్తం డిపాజిట్‌కు మరికొంత సమయం కావాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు తన ఆమోదాన్ని తెలియజేసింది. జూన్ 15, జూలై 15న సెబీకి వరుసగా రూ.1,500 కోట్లు, రూ.552.22 కోట్లు చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఇంతక్రితమే సహారా రెండు చెక్కులను డిపాజిట్ చేసింది. అయితే ఈ డబ్బును సమకూర్చలేకపోవడాన్ని తీవ్రంగా తీసుకున్న సుప్రీంకోర్టు, మహారాష్ట్రలో సంస్థకు చెందిన రూ.34,000 కోట్ల విలువైన యాంబీ వ్యాలీ జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. -
10 రోజులే అవకాశం, లేదంటే జైలుకే
సహారా అధినేత సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు మరో 10 రోజులు అవకాశమిచ్చింది. ఆయనకు ముందు ఇచ్చిన జూన్ 19 వరకు పెరోల్ గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకముందు ఇచ్చిన గడువులో జూన్ 15 వరకు రూ.1500 కోట్లను చెల్లించాలని లేకపోతే, ఏకంగా తిహార్ జైలుకే పంపుతామని గట్టిగా హెచ్చరించింది. కానీ వాటిలో సహారా రూ.790 కోట్లను మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు పెరోల్ పొడిగింపును కోరింది. లండన్ లోని గ్రోస్వెనోర్ హౌస్ స్టేక్ ను అమ్మామని, దీని ద్వారా మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి చెల్లించాల్సిన నగదును సేకరిస్తున్నామని సహారా సుప్రీంకోర్టుకు చెప్పింది. మిగతా రూ.709.82 కోట్ల మొత్తాన్ని కూడా సహారా-సెబీకి 10 రోజుల్లో రీఫండ్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో జైలుకు పంపాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించింది. మొత్తంగా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.25,781 కోట్ల మొత్తంలో ఇంకా సహారా రూ.11,169 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇన్వెస్టర్స్ నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేసిన ఘటనలో దోషిగా ఉన్న సుబ్రతోరాయ్ ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు. ఈ విషయంపై సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కు వ్యతిరేకంగానూ, వాటి ప్రమోటర్ సుబ్రతారాయ్, ముగ్గురు డైరెక్టర్లపై 2012లో సెబీ కేసు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణలో నడుస్తోంది. సహారా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తం కోసం కోర్టు వేలం ప్రక్రియను కూడా చేపడుతోంది. -
సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
-
సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15 కల్లా 2500 కోట్ల రూపాయలు సెబీ-సహారా అకౌంట్లో జమచేయాలని ఆదేశించింది. లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. జూన్ 15 వరకు సెబీ అకౌంట్లో డబ్బులు జమచేసేందుకు రెండు చెక్ లను ఇస్తానని సుప్రీంకోర్టుకు హాజరైన సుబ్రతారాయ్ చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు వార్నింగ్ ఇచ్చింది. చెక్ లు క్లియర్ కాకపోతే, మళ్లీ తిహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని జడ్జీలు పేర్కొన్నారు. సహారా గ్రూప్ కు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా 25వేల కోట్ల మేర వసూలు చేసి, వాటిని తిరిగి ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో వైఫల్యం చెందడంతో అధినేత సుబ్రతారామ్ 2014 లో తీహార్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత తన తల్లి చనిపోయినప్పుడు పెరోల్ మీద బయటికి వచ్చిన సుబ్రతారాయ్, అప్పటినుంచి తన పెరోల్ ను పొడిగించుకుంటూ వెళ్తున్నారు. సహారాకు చెందిన మహారాష్ట్రలోని లగ్జరీ అంబీ వ్యాలీ టైన్ షిప్ ను వేలం వేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలపై సుబ్రతారాయ్ న్యాయవాది, మాజీ మంత్రి కపిల్ సిబాల్ వాదించారు. ఇది 10వేల ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉందని, దీని విలువ 34వేల కోట్ల మేర ఉంటుందని తెలిపారు. సెబీకి బాకీ పడిన దానికంటే దీని విలువే ఎక్కువని చెప్పారు. అయితే ఈ వేలాన్ని మరోసారి సమీక్షించాలనే కపిల్ సిబాల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా జూన్ 19న తమ ముందు హాజరుకావాలని సుబ్రతారాయ్ ను సుప్రీం ఆదేశించింది. సహారా ఇప్పటికే దేశీయంగా, విదేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మడానికి ప్రయత్నిస్తోంది. -
రూ. 5,000 కోట్లు కట్టండి.. లేదంటే యాంబీ వ్యాలీ వేలం
సహారా సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ 17వ తేదీ నాటికి రూ.5,092.6 కోట్లు డిపాజిట్ చేయకపోతే, రూ.39,000 కోట్ల విలువచేసే పూణేలోని ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీ వేలం వేయక తప్పదని సహారాకు అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో సహారా వాటాను 550 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి సిద్ధపడిన ఇంటర్నేషనల్ రియల్లీ సంస్థ ఈ డీల్ విషయంలో విశ్వసనీయతను నిరూపించుకోడానికి తొలుత రూ.750 కోట్లను సెబీ– సహారా రిఫండ్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని కూడా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తనఖాలోని ఆస్తుల జాబితాను అందజేయాలని జస్టిస్ రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడా కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే సహారాకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు సహారా గ్రూప్ సంస్థలు మదుపరుల నుంచి మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసులో దాదాపు రెండేళ్లు సహారా చీఫ్ తీహార్ జైలులో ఉన్నారు. తల్లి మరణంతో పెరోల్‌పై విడుదలైన ఆయన, అటు తర్వాత సుప్రీం నిర్దేశాల మేరకు కొంత మొత్తాల్లో నిధులు డిపాజిట్ చేస్తూ... పెరోల్‌పై కొనసాగుతున్నారు. ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తంపై 2016 అక్టోబర్ 31 వరకూ సహారా గ్రూప్ వడ్డీసహా రూ.47,669 కోట్లు చెల్లించాల్సి ఉందని ఫిబ్రవరిలో కేసు వాదనల సందర్భంగా సెబీ న్యాయవాది ప్రతాప్ వేణుగోపాల్ న్యాయస్థానానికి తెలిపారు. -
పెరోల్ పొడిగించాలంటే రూ. 5,092 కోట్లు!
⇒ ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయాలి ⇒ సహారా రాయ్‌కు సుప్రీం గడువు న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను పొడిగించడానికి సుప్రీంకోర్టు కీలక షరతు విధించింది. ఏప్రిల్ 7వ తేదీలోపు సెబీ–సహారా అకౌంట్లో రూ.5,092.6 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను ఆదేశించింది. తన ఆస్తులు అమ్మడానికి ఆరు నెలల గడువు కావాలని గ్రూప్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. తనకు సమర్పించిన జాబితాలోని ఆస్తులు అమ్మడానికి ఆమోదముద్ర వేసింది. మదుపరులకు డబ్బు పునఃచెల్లించడానికి వీలుగా తగిన చర్యలు తీసుకోడానికి తగిన అన్ని చర్యలపై దృష్టి సారించాల్సిందేని స్పష్టం చేసింది. ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయడానికి వీలుగా తనకు సమర్పించిన జాబితాలోని 15 ఆస్తుల్లో పదమూడింటిని అమ్మవచ్చని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అలాగే మరో జాబితాల్లో ఉన్న తనఖాలోలేని ఆస్తుల అమ్మకానికీ సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం చెల్లింపు తరువాత పెరోల్ గడువును మరికొంతకాలం పొడిగించి మొత్తం డబ్బు డిపాజిట్ చేసే మార్గాలను అన్వేషించే అవకాశం కల్పిస్తామని సుప్రీం సూచించింది. ఇంటర్నేషనల్ రియల్టీ సంస్థకు సూచనలు... కాగా న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్లో సహారా వాటాలను 550 మిలియన్ డాలర్లకు కొనడానికి ముందుకు వచ్చిన ఒక అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థకు...రాజన్ గొగోయ్, ఏకే శిక్రీలు కూడా ఉన్న ఈ త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ దిశలో తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి రూ.750 కోట్లను ఏప్రిల్ 10వ తేదీ లోగా అత్యున్నత స్థాయి న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
సుబ్రతారాయ్‌కు పెరోల్ పొడిగింపు
• ఫిబ్రవరి 6లోపు రూ.600 కోట్లు డిపాజిట్ చేయాలి • లేకుంటే జైలుకేనని సుప్రీంకోర్టు హెచ్చరిక న్యూఢిల్లీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు మరోసారి పెరోల్ పొడిగించింది. వచ్చే ఫిబ్రవరి 7 వరకు పొడిగించిన ధర్మాసనం ఆ తర్వాత కూడా జైలు బయటే ఉండాలంటే రూ.600 కోట్లను సెబీ-సహారా రిఫండ్ ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విఫలమైతే జైలుకు వెళ్లాల్సి ఉం టుందని హెచ్చరించింది. అదే సమయంలో జైల్లోనే ఉంచాలని తాము కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించగా... ఆస్తులను అమ్మి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయడం చేతకాకపోతే ఆ పని చేసేందుకు ప్రాపర్టీ రిసీవర్ నియామకాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. తొలుత రూ,1000 కోట్లను డిపాజిట్ చేయాలని సుబ్రతారాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ఆదేశించిన కోర్టు లేదంటే ప్రాపర్టీ రిసీవర్‌ను నియమిస్తామని పేర్కొంది. తర్వాత దాన్ని రూ.600 కోట్లకు తగ్గించింది. రూ.1.87 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్న గ్రూపు ఇప్పుడు బకారుులు చెల్లించలేకపోవడం ఏంటన్న ధర్మాసనం.. జైలు నుంచి విముక్తి పొందిన తర్వాత రాయ్ ఎంత డిపాజిట్ చేశారని కోర్టు ప్రశ్నించింది. రూ.11,000 కోట్లను డిపాజిట్ చేసినట్టు, ఇంకా రూ.11,136 కోట్లు చెల్లించాల్సి ఉందని సిబల్ తెలిపారు. సెబీ లెక్క ప్రకారం బకారుులు రూ.14,000 కోట్లు ఉన్నాయన్నారు. 21 వారుుదాల్లో బకారుులన్నీ చెల్లించేస్తాం... సెబీకి రూ.11,136 కోట్ల బకారుులు చెల్లించే విషయంలో కార్యాచరణ ప్రణాళికను సహారా గ్రూపు సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. రెండున్నరేళ్ల కాల వ్యవధిలో మొత్తం బకారుులను 21 వారుుదాల్లో చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు అనుమతించాలని, మొత్తం బకారుులను చెల్లించాక సుబ్రతారాయ్తోపాటు గ్రూపు డెరైక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవిశంకర్ దూబేలను పూర్తి స్థారుులో విడుదల చేయాలని కోర్టుకు విన్నవించింది. చెల్లింపుల్లో విఫలమైతే ఈ ముగ్గురూ లొంగిపోతారని పేర్కొంది. -
మరో రూ. 200 కోట్లు చెల్లించండి..
న్యూఢిల్లీ: సహారా సంస్థల చీఫ్ సుబ్రతారాయ్ కి సుప్రీంకోర్టు మరోసారి ఊరటను కల్పించింది. సహారా అధిపతి పెరోల్ ను నవంబరు 28వ తేదీవరకు పొడిగించింది. సహారా గ్రూప్ సెబీకి ఈ నెలాఖరుకు రూ.200కోట్లు డిపాజిట్ చేయడానికి అంగీకరించడంతో కోర్టు ఈ ఆయనకు వెసులుబాటును కల్పించింది. నవంబరు 28 లోపు 200 కోట్ల రూపాయలను చెల్లించాలని చీఫ్ జస్టిస్ టీ.ఎస్ థాకూర్, జస్టిస్ అనిల్ దావే, ఏకే సిక్రీ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సెప్టెంబర్28 నాటి కోర్టు ఆదేశాల ప్కారం సహారా న్యాయవాదిబశుక్రవారం రూ.215కోట్లు డిపాజిట్ చేశారు. మరో రూ.200కోట్లను ఈ నెలాఖరుకు డిపాజిట్ చేయనున్నట్టు కోర్టుకు స్పష్టం చేసింది. అలాగే గతంలో సుప్రీం ఆదేశాలకు మేరకు సెబీకి రూ.12వేల కోట్లు ఏ విధంగా చెల్లిస్తారనే అంశంపై సుబ్రతారాయ్ న్యాయవాది కోర్టుకు రోడ్ మ్యాప్ అందజేశారు. డిసెంబరు 2018 నాటికి సహారా పూర్తి చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కాగా సెబీలో అవకతవకల కేసులో సుబ్రతారాయ్ రెండేళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ ఏడాది మే నెలలో తల్లి మరణించడంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. సెబీకి రూ.500కోట్లు చెల్లించే ఒప్పందంతో కోర్టు గతంలో పెరోల్ పొడిగించిన న్యాయస్థానం షరతులతో పెరోల్ పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. -
నేడు సెబీకి సహారా రూ.200 కోట్ల డిపాజిట్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ శుక్రవారం సెబీ వద్ద రూ.200 కోట్లు డిపాజిట్ చేయనుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరో ఇరువురు డెరైక్టర్లుఅశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే పెరోల్ గడువు పొడిగింపునకు సంబంధించి ఈ మొత్తాన్ని శుక్రవారం చెల్లించడం జరుగుతుందని రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలిపారు. -
మీపై నమ్మకం కోల్పోయాం
♦ రూ.12వేల కోట్లను ఎప్పటిలోగా చెల్లిస్తారు? ♦ రోడ్‌మ్యాప్ ప్రకటించండి సహారాకు సుప్రీం ఆదేశం ♦ రాయ్, మరో ఇద్దరి బెయిల్ పొడిగింపు న్యూఢిల్లీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్, గ్రూపు డెరైక్టర్లు అశోక్‌రాయ్ చౌదరి, రవిశంకర్దూబే పెరోల్‌ను సుప్రీంకోర్టు అక్టోబర్ 24 వరకు పొడిగించింది. రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వచ్చే విచారణ తేదీలోగా చెల్లించడంలో విఫలమైతే రాయ్‌తోపాటు మరో ఇద్దరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు బుధవారం సహారా కేసు విచారణకు వచ్చింది. సహారా తరఫున కపిల్ సిబల్, సెబీ తరఫున అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు. మిగిలిన నగదు మొత్తాన్ని సెబీకి చెల్లించేందుకు రాయ్‌కు ఏడాదిన్నర సమయం ఇవ్వాలని కపిల్ సిబల్ వాదించారు. ఎలాంటి షరతులు విధించవద్దని కోరారు. షరతుల మధ్య ఆస్తుల విక్రయం సాధ్యం కాదన్నారు. స్పందించిన ధర్మాసనం రాయ్‌ను ఆస్తులు విక్రయించకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించింది. సెబీ సైతం ఈ విషయంలో స్వేచ్ఛ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ‘సహారా సెబీకి గతంలో సమర్పించిన 60 ఆస్తుల చిట్టాలో 47 ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసిన విషయాన్ని వెల్లడించలేదు. మీపై నమ్మకం కోల్పోయాం. రూ.12 వేల కోట్ల మిగతా బకాయిలను ఏ విధంగా, ఎప్పటిలోగా చెల్లిస్తారన్న దానిపై నిర్మాణాత్మక ప్రతిపాదన/రోడ్‌మ్యాప్‌ను అఫిడవిట్ రూపంలో ఇవ్వండి’ అని ధర్మాసనం సహారాను ఆదేశించింది. అంతకు ముందు సెబీ తరఫున దత్తార్ వాదిస్తూ వడ్డీతో కలుపుకుని సహారా సెబీకి రూ.37వేల కోట్లను చెల్లించాల్సి ఉందని, ఇందులో అసలు మొత్తం రూ.24వేల కోట్లు అని తెలిపారు. ఇన్వెస్టర్ల నుంచి రూ.24,029 కోట్లను సహారా సేకరించగా... ఇప్పటి వరకు రూ.10,918 కోట్లు చెల్లించినట్టు వివరించారు. -
రూ.12వేల కోట్లు ఎలా చెల్లిస్తున్నారో చెప్పండి?
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌కు పెరోల్ గడువు అక్టోబర్ 24వరకు పొడిగిస్తూ ఊరటనిచ్చిన సుప్రీం, సెబీకి చెల్లించాల్సిన రూ.12వేల కోట్లను ఎలా చెల్లిస్తున్నారో తెలుపాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సమర్పించాలని ఆయన తరుఫున న్యాయవాదిని సుప్రీం ఆదేశించింది. మరోవైపు పెరోల్ గడువు పొడిగింపు కోసం సుబ్రతా రాయ్ సెబీ వద్ద రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.. కాగ గత శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం న్యాయవాదికి, సహారా న్యాయవాదికి మధ్య జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరోల్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వెంటనే జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించింది. అయితే దీనిపై సుబ్రతా రాయ్ సుప్రీంకు క్షమాపణ చెప్పుకున్నారు. ఇలాంటి తప్పు మరోసారి జరుగదని, తన పెరోల్‌ను తిరస్కరించడాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో పెరోల్ పొడిగింపుపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం, గడువును అక్టోబర్24 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. కాగా నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే 6న నాలుగు వారాల పెరోల్ సుప్రీం మంజూరు చేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సిన మొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతుతో ఆగస్టు 3న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ 23వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. నేటి విచారణ సందర్భంగా మరోసారి సుబ్రతారాయ్ పెరోల్‌ను పొడిగించింది. -
మరోసారి ఇలాంటి తప్పు చేయను
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ క్షమాపణ చెప్పారు. తన పెరోల్‌ను తిరస్కరించడాన్ని పునఃసమీక్షించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. పెరోల్‌ను రద్దుచేస్తూ, వెంటనే తనను జైలుకు తరలించాల్సిందిగా సుప్రీం చేసిన ఆదేశాలను కూడా రీకాల్ చేయాలని అభ్యర్థించారు. సుబ్రతా రాయ్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్, బెంచ్ అధినేత జస్టిస్ టీఎస్ థాకూర్‌కు ఈ విషయం వెల్లడించారు. ఉన్నత న్యాయస్థానాన్ని క్షమాపణ కోరుతున్నా, మరోసారి ఇలాంటి తప్పులు జరుగదనే హామీని ఇస్తున్నాననే సుబ్రతారాయ్ క్షమాపణను కపిల్ సిబాల్ జస్టిస్ థాకూర్‌కు తెలిపారు.. న్యాయస్థానాలు ఇలాంటి విషయాలను ఉపేక్షించవు, దేనికైనా ఓ పరిమితి ఉంటుందని సుబ్రతా రాయ్‌పై జస్టిస్ థాకూర్ సీరియస్ అయ్యారు. రాయ్ అప్లికేషన్‌ను విచారించడానికి జస్టిస్ అనిల్ ఆర్.ధావే, జస్టిస్ ఏకే. సిక్రీతో సంప్రదింపులు చేస్తానని తెలిపారు. తల్లి మరణంతో మావనీయ కోణంలో ఈ ఏడాది మే6న నాలుగువారాల పెరోల్‌ను సుప్రీంకోర్టు మంజూరుచేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సిన మొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతుతో ఆగస్టు 3న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత నేటివరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెరోల్ కేసు విచారణ సందర్భంగా సహారా న్యాయవాది, సుప్రీం న్యాయవాది వాదోపవాదాల అనంతరం సుబ్రతాను జైలుకు తరలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఆదేశాలపై మరోసారి పునఃసమీక్షించాలని సుబ్రతా కోరుతున్నారు. -
23 వరకూ రాయ్ పెరోల్ పొడిగింపు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు సెప్టెంబర్ 23వ తేదీ వరకూ పొడిగించింది. రెండు గ్రూప్ సంస్థలు మదుపుదారుల నుంచి మార్కెట్ నిబంధనలను వ్యతిరేకంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేయడం, వడ్డీతో సహా దాదాపు రూ.35,000 కోట్లు తిరిగి చెల్లించడంలో వైఫల్యం నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలు సుబ్రతా రాయ్ తిహార్ జైలులో గడిపారు. తల్లి మరణంతో మానవతా కారణాలతో మే నెలలో పెరోల్ పొందారు. అయితే ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన డబ్బు సమీకరణ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా సుప్రీంకోర్టు ఆయనకు పెరోల్‌ను పొడిగిస్తూ వస్తోంది. అయితే అందుకు ఆయన కొంత మొత్తం సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి రూ.353 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిటర్లకు తాము ఇప్పటికే నిధులు మొత్తం చెల్లించేశామన్న సహారా వాదనపై సెప్టెంబర్ 2వ తేదీన తీవ్రంగా స్పందించింది. ఇందుకు డబ్బు ఎలా సమీకరించారు? డబ్బు చెల్లించిన వారి సుస్పష్ట వివరాలను తెలియజేస్తే కేసు మూసేస్తామని కూడా సుప్రీం సూచించింది. అంత డబ్బు ఆకాశం నుంచి రాలి పడదుకదా? అని కూడా వ్యాఖ్యానించింది. -
సెప్టెంబర్ 16 వరకూ సుబ్రతారాయ్ పెరోల్ పొడిగింపు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు- మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. బెయిల్‌కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లకు సంబంధించి... సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ, పెరోల్‌పై కొనసాగుతున్నారు. జూలై 11వ తేదీ ఆదేశాల మేరకు నిర్దేశిత రూ.300 కోట్లు చెల్లించడంతో ఆయన తాజా పెరోల్ గడువు పొడిగింపు ఉత్తర్వ్యును పొందగలిగారు. -
సహారా రాయ్‌కి పెరోల్ పొడిగింపు
♦ మిగిలిన రూ.300 కోట్లు కడతారా..? లేక జైలుకెళతారా? ♦ సుబ్రతారాయ్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ♦ సహారా ఆస్తుల విక్రయంపై ఆంక్షల తొలగింపు న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతారాయ్‌కు మరి కొంత ఊరట లభించింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన పెరోల్ గడువును ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సహారా కేసులో జైలు పాలైన కంపెనీ డైరక్టర్లు రవిశంకర్ దూబే, అశోక్రాయ్చౌదరిలకు సైతం పెరోల్ మంజూరు చేసింది. రూ.500 కోట్లు కోర్టుకు జమ చేస్తానన్న హామీ మేరకు మిగిలిన రూ.300 కోట్లను కోర్టుకు జమ చేస్తారా...? లేక తిరిగి జైలుకు వెళతారా? అని రాయ్‌ని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మాతృమూర్తి మరణంతో మానవీయ కోణంలో సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఆయన రూ.200 కోట్లను మాత్రమే డిపాజిట్ చేశారు. కాగా, మిగిలిన రూ.300 కోట్లను డిపాజిట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు గడువివ్వాలని సుబ్రతారాయ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే, ఆస్తుల విక్రయానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ధర్మాసనం రీసీవర్‌ను నియమించి సహారాకు చెందిన అన్ని ఆస్తులను అప్పగిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? అని ఎదురు ప్రశ్నించింది. తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ సున్నితంగా హెచ్చరించింది. ఇన్వెస్టర్లకు రూ.36వేల కోట్లను తిరిగి చెల్లించాలన్న తమ ఆదేశాలను గుర్తు చేసింది. ఆదేశాల అమలులో విఫలమైతే రాయ్‌తో పాటు మరో ఇద్దరు డైరక్టర్లను తిరిగి తిహార్ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అంతకుముందు రూబెన్ బ్రదర్స్ నుంచి తీసుకున్న 2.4 కోట్ల పౌండ్లు (సుమారు రూ.200కోట్లు) సెబీ-సహారా ఖాతాకు బదిలీ చేసేందుకు అనుమతించాలన్న సిబల్ అభ్యర్థనను ధర్మాసనం ఆమోదించింది. సహారా గ్రూపునకు సైతం ఊరట రాయ్‌తోపాటు సహారా గ్రూపునకు కూడా సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. సహారా గ్రూపునకు చెందిన ఇతర ఆస్తుల విక్రయ, హక్కుల బదిలీకి అనుమతించింది. దీని ద్వారా రూ.5వేల కోట్ల మేర నిధులు సమీకరించి బ్యాంకు గ్యారంటీ కింద సమర్పించేందుకు ఓ అవకాశం ఇచ్చింది. బెయిల్ కోసం సమర్పించాల్సిన రూ.5వేల కోట్లకు ఇది అదనం. లోగడ 19 ఆస్తులను మాత్రమే విక్రయిచేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మ్యూచువల్ పండ్స్, బంగారంపై డిపాజిట్లు, ఎన్ఎస్ఈలో వాటాలను నగదుగా మార్చుకునేందుకు సైతం సుప్రీంకోర్టు అనుమతి జారీ చేసింది. -
సహారా చీఫ్‌కు కాస్త ఊరట.. భారీ షాక్
ఒకవైపు ఆనందం, మరోవైపు షాక్ తినడం రెండూ ఒకేసారి వస్తే ఎలా? సహారా చీఫ్ సుబ్రత రాయ్ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. మానవీయ కోణంలో ఆలోచించి సుబ్రత రాయ్ పెరోల్‌ను ఆగస్టు మూడో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. దాన్ని ఆయన దుర్వినియోగం చేయకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆగస్టు మూడోతేదీ లోగా రూ. 300 కోట్లు కోర్టుకు చెల్లించాలని, లేకపోతే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. సహారా ఆస్తులన్నింటినీ ఒక రిసీవర్‌కు ఎందుకు అప్పగించకూడదన్న అంశంపై వాదనలను ఆగస్టు మూడో తేదీన కోర్టు వింటుంది. సుబ్రతరాయ్కి ఈ సంవత్సరం మే 6వ తేదీన పెరోల్ వచ్చింది. తర్వాత దాన్ని మే 11న రెండు నెలలు పొడిగించారు. సోమవారంతో ఆ గడువు ముగిసింది. దాంతో ఈ అంశంపై మళ్లీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాయ్‌కి కాస్తంత ఊరట కలిగించేలా పెరోల్ పొడిగించినా, ఆ లోపు రూ. 300 కోట్లు చెల్లించాలంటూ షాకిచ్చింది. -
జులై నాలుగున భూముల వేలం
న్యూఢిల్లీ: ఆన్ లైన్ లో సహారా గ్రూప్ ఆస్తుల విక్రయానికి తొలి ముహూర్తం ఖరారైంది. మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ నియమించిన హెచ్డీఎఫ్సీ రియాల్టీ ఎస్బీఐ క్యాప్ ఇ-వేలానికి రడీ అయ్యింది. ఆర్ధిక నేరాల ఆరోపణలతో సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ (67) కు చెందిన వివిధ రాష్ట్రాల్లో ఉన్న అయిదు ఆస్తులను హెచ్డీఎఫ్సీ రియాల్టీ ఆధ్వర్యంలో వేలానికి పెట్టారు. సుమారు 722 కోట్ల విలువైన ఈ ఆస్తులను జులై నాలుగన వేలం వేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఒక నోటీసును విడుదలైంది. జులై నాలుగు ఉదయం 11గం. రాత్రి 12గ.లకు ఈ ఇ-వేలం నిర్వహించబడుతుందని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తర ప్రదేశ్ లలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూమిని వేలం వేయనున్నారు. ఆసక్తి వున్న వారు జూన్ 10న ఈ సదరు భూమునలు ఆస్తులను తనిఖీ చేసుకోవచ్చిన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ సహారా ఆస్తుల వేలానికి సిద్ధమైంది. సహారా అధిపతి సుబ్రతో రాయ్ చెల్లించాల్సిన అప్పుల్లో భాగంగా, అన్యాక్రాంతంకాని, తనఖాలోలేని సహారా ఆస్తులను వేలం వేయాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కి మాండేటరీ ఆదేశాలను సుప్రీం జారీ చేసింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ రియాల్టీ, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్బీఐ క్యాప్స్)కు సెబీ నియమించింది. దేశవ్యాప్తంగా 87సహారా ఆస్తులను ఆన్లైన్ ద్వారా వేలం వేసే ప్రక్రియను ఆ సంస్థలు ప్రారంభించింది.మరోవైపు తన అనుమతిలేనిదే మార్కెట్ విలువ కంటే 90శాతం కంటే తక్కువకు విక్రయించరాదని సుప్రీంకోర్టు నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. -
సహారా చీఫ్ కు మరింత ఊరట!
♦ జూలై 11 వరకూ పెరోల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు ♦ సెబీకి రూ. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం... న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో మరింత ఊరట లభించింది. తల్లి మరణం కారణంగా అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు వీలుకల్పిస్తూ చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం నాలుగు వారాలపాటు పెరోల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాయ్‌తో పాటు గ్రూప్ డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరిలు ఈ నెల 6న జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఈ పెరోల్‌ను జూలై 11 వరకూ పొడిగించేందుకు కోర్టు బుధవారం అంగీకరించింది. అయితే, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి రాయ్, చౌదరిలు రూ.200 కోట్లు చెల్లించేందుకు వీలుగా ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా డిపాజిట్లు సమీకరించిన కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సుబ్రతా రాయ్ 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, జూలై 11కల్లా రూ200 కోట్లు గనుక డిపాజిట్ చేయకపోతే మళ్లీ తీహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. పెరోల్‌పై బయట ఉన్న సమయంలో రాయ్, చౌదరిలు సహారా ఆస్తుల అమ్మకానికి వీలుగా ఔత్సాహిక కొనుగోలుదార్లను కలవొచ్చని సుప్రీం పేర్కొంది. అయితే, దేశంలోపలే ఉండటంతో పాటు పోలీస్ ఎస్కార్ట్లోనే ఎక్కడికైనా వెళ్లాలని స్పష్టం చేసింది. మరోపక్క, సహారా ఆస్తుల వేలానికి సంబంధించి సెబీ తన చర్యలను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీగా చెల్లించాల్సిన రూ.5,000 కోట్లు, బెయిల్ కోసం అదనంగా కట్టాల్సిన రూ.5,000 కోట్లను సమీకరించేందుకుగాను సహారా ఇతర ఆస్తుల అమ్మకం ప్రక్రియను చేపట్టవచ్చని సుప్రీం సూచించింది. -
200 కోట్లు కట్టు లేదా జైలుకు వెళ్లు!
న్యూఢిల్లీ: సహారా అధినేత సుబ్రతా రాయ్‌కి ఇచ్చిన పెరోల్ జూలై 11వ తేదీ వరకు సుప్రీంకోర్టు బుధవారం పొడిగించింది. జూలై 11లోగా రూ. 200 కోట్లు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబికి కట్టాలని, లేకపోతే మళ్లీ తీహార్ జైలుకు వెళ్లకతప్పదని ఆయనను కోర్టు స్పష్టం చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి)కు రూ. 200 కోట్ల డిపాజిట్ చెల్లించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు అండర్ టేకింగ్ ఇవ్వాలని సుబ్రతా రాయ్, సహారా గ్రూప్ డైరెక్టర్ అశోక్ రాయ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిని చెల్లించడంలో వారు విఫలమైతే.. ఆ ఇద్దరు తిరిగి తీహార్ జైలు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2014 మార్చి 4 నుంచి సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన తల్లి చనిపోవడంతో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సుబ్రతారాయ్‌కి సుప్రీంకోర్టు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. దీంతో మే 6న సుబ్రతా రాయ్, అశోక్ రాయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 2008-2009 మధ్యకాలంలో సహారా గ్రూప్‌నకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు చిన్న పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించాయి. ఈ డిపాజిట్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబికి గ్యారంటీ చెల్లించడంలో విఫలమవ్వడంతో సుబ్రతారాయ్, అశోక్ రాయ్ జైలు పాలయ్యారు. -
సహారా సుబ్రత రాయ్‌కి సుప్రీంలో ఊరట
సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతరాయ్కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గురువారం రాత్రి ఆయన తల్లి మరణించడంతో.. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాలుగు వారాల పెరోల్ మంజూరైంది. అయితే.. పెరోల్ సమయంలో ఆయన మఫ్టీలో ఉన్న పోలీసుల రక్షణలోనే ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సుబ్రతరాయ్తో పాటు ఆయన అల్లుడు అశోక్ రాయ్ చౌదరికి కూడా అంతే సమయం పాటు పెరోల్ ఇచ్చారు. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే రెండు సంస్థలలో పెట్టుబడి పెట్టినవాళ్లకు ఆ సొమ్ము వెనక్కి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోవడంతో.. గత రెండేళ్లుగా సుబ్రతరాయ్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
సహారా ఆస్తులు అమ్మేయండి!
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, ఆ కంపెనీ మరో ఇద్దరు డైరెక్టర్లను జైలు నుంచి విడుదల చేసేందుకు వీలుగా ఆ కంపెనీ ఆస్తులను అమ్మివేయాలని మార్కెట్ రెగ్యూలేటర్ సెబిని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి సేకరించిన రూ. 10వేల కోట్ల డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు వీలుగా సహారా ఆస్తులను మార్కెట్లో అమ్మాల్సిందిగా మంగళవారం ఆదేశాలు జారీచేసింది. సహారా సంస్థకు మొత్తం 40వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటి అమ్మకాల కోసం స్వతంత్ర ఏజెన్సీని నియమించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని మూడు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మార్కెట్ రేటు (సర్కిల్ రేటు)పై 90శాతం కన్నా తక్కువకు ఆస్తులు అమ్మకుండా చూడాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)ని ఆదేశించింది. చిన్న పెట్టుబడిదారుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో 2014 మార్చిలో సహారా అధినేత సుబ్రతరాయ్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం రూ. 5వేల కోట్లు నగదు పుచీకత్తు, రూ. 5వేల కోట్లు బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోవడంతో ఆయన రెండేళ్లుగా జైలులో గడుపుతున్నారు. -
సంక్షోభంలో సంక్షేమం: సుబ్రతా రాయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడే పథకాలను రద్దుచేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, వీటిని సంఘటితంగా ఎదుర్కోవాలని సెంటర్ ఫర్ బడ్జెట్ గవర్నెన్స్ అకౌంటబులిటీ జాతీయ సమన్వయకర్త సుబ్రతారాయ్ అన్నారు. శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర బ్రడ్జెట్ కన్సల్టేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 32 నుంచి 42 శాతానికి పెంచామంటూనే సంక్షేమ పథకాల్లో భారీగా కోత విధిస్తోందన్నారు. కేంద్రం చర్యల వల్ల దాదాపు 70 సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా సంక్షేమరంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకుంటున్న మరో నిర్ణయం వల్ల కొత్త చిక్కు రాబోతోందని, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను వేర్వేరుగా కాకుండా కలిపి నిర్ణయించాలని చూస్తోందని, దీనివల్ల ఏవి పథకాలో, ఏవి జీతభత్యాలో తెలియక బలహీన, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు. పేదలకు పన్నుపోటు విధిస్తూ కార్పొరేట్‌శక్తులకు రాయితీలిస్తోందని ఆరోపించారు. సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్, పీఫుల్స్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాల నిపుణులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. -
ఆస్తుల అమ్మకంపై సహారా కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతా రాయ్‌ని జైలు నుంచి విడిపించడానికి సహారా కొత్త ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు వివరించింది. బెయిల్ మొత్తానికి సంబంధించి ఆస్తుల విక్రయంపై సహారా సమర్పించిన తాజా ప్రతిపాదనపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పందనను కోరింది. నాలుగు వారాల్లో దీనికి సమాధానం తెలపాలని సూచించింది. తాజా ప్రతిపాదనను సహారా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు ఉంచారు. దీని ప్రకారం ముంబైలో హోటల్- సహారా స్టార్, అలాగే ఫార్మూలా 1లో 42 శాతం వాటాలు, నాలుగు విమానాల అమ్మకానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో లండన్‌లోని గ్రాసోవర్ హౌస్ హోటల్, న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ హోటల్స్ విక్రయాలకూ చర్చలు జరుగుతున్నాయి. గ్రాసోవర్ హౌస్ హోటల్ విక్రయ చర్చలు స్టార్ ఆఫ్ కతార్‌తో జరుగుతున్నాయని, రూ.2,300 కోట్లు వెచ్చించడానికి ఆ సంస్థ సిద్ధమవుతోందని సిబాల్ కోర్టుకు తెలిపారు. అమెరికాలో హోటళ్ల రీఫైనాన్స్ విషయంపై ఒక రష్యా బ్యాంకుతో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో తన ఆస్తుల అమ్మకానికి కూడా సహారా కోర్టు అనుమతి కోరుతోంది. 2014 మార్చి 4 నుంచీ సహారా చీఫ్ తీహార్ జైలులో ఉన్నారు. ఇన్వెస్టర్లకు రూ.36,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాయ్‌తో పాటు రెండు కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు కూడా జైలులో గడుపుతున్నారు. -
డబ్బే సర్వస్వం కాదు..
♦ ఒత్తిడిని అధిగమించే శక్తిని దేవుడిచ్చాడు ♦ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ ♦ ‘థాట్స్ ఫ్రం తీహార్’ పేరుతో పుస్తకం విడుదల న్యూఢిల్లీ: వేల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము రీఫండ్ వివాదంలో దాదాపు రెండేళ్లుగా తీహార్ జైల్లో మగ్గుతున్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ తాజాగా రచనా వ్యాసంగం చేపట్టారు. సహారా గ్రూప్ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాయ్ రాసిన ‘థాట్స్ ఫ్రమ్ తీహార్’ పుస్తకాన్ని సోమవారం విడుదల చేశారు. ‘లైఫ్ మంత్రాస్’ శీర్షికన వెలువడనున్న మూడు పుస్తకాల శ్రేణిలో ఇది మొదటిది. జైలు జీవితంలో తన ఆలోచనలను ఇందులో పొందుపర్చిన రాయ్.. ఇది తన ఆత్మకథ మాత్రం కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రాథమిక సౌకర్యాలతో జైలు గదిలో గడపాల్సి రావడం తనకు షాక్‌కు గురిచేసిందని రాయ్ తెలిపారు. జైలు జీవితం చాలా ఒంటరిగాను, దుర్భరంగానూ ఉంటుందని, కానీ అదృష్టవశాత్తు ఎల్లవేళలా ఒత్తిడిని అధిగమించగలిగే శక్తిని భగవంతుడు తనకు ఇచ్చాడని ఆయన వివరించారు. ‘నేనేం చేశానని నాకీ శిక్ష .. అని అనిపించేది. ఇలాంటి ఆలోచనలు అనేకానేకం మెదడును తొలిచేసేవి. ఎవరినైనా.. బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఒంటరిగా బంధించేసినప్పుడు జుత్తు పీక్కోవాలనిపిస్తుంది.. ఒకోసారి పిచ్చెత్తిపోతుంది’ అంటూ రాయ్ పుస్తకంలో పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కోసం దేశవిదేశాల్లో దాదాపు 5,120 చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. డబ్బున్నా, షరతులు విధిస్తే... ‘బోలెడంత డబ్బుంటే సుఖంగా బతికేయొచ్చనుకుంటారు అందరూ. కానీ కోరుకున్నంత సంపద ఉన్నా .. మహలు నుంచి బైటి కెళ్లొద్దు.. ఎవరితో మాట్లాడొద్దు, బాహ్యప్రపంచంతో సంబంధం పెట్టుకోవద్దు.. కనీసం టీవీ, రేడియో లాంటివి కూడా ఉండవు అంటూ షరతులు విధిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇరవై .. లేదా ముప్పై లేదా నలభై రోజుల తర్వాతో.. బైటికెళ్లేందుకు తలుపులు తీస్తే ఏం చేయాలో అర్థం కాక ఆ వ్యక్తి జుత్తు పీక్కుంటూ ఉంటాడు లేదా పిచ్చెత్తి పోయి ఉంటాడు. దీన్ని నమ్మని వారెవరైనా నన్ను కలిస్తే ప్రాక్టికల్‌గా నిరూపిస్తాను’ అని రాయ్ వివరించారు. తన భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకునే అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. అప్పట్లోనే హాయిగా ఉండేది... సహారా గ్రూప్ 1978లో కేవలం రూ. 2,000తో మొదలైందని, ఇప్పటికన్నా అప్పట్లో ఎంతో సంతోషంగా ఉండేదని రాయ్ రాసుకొచ్చారు. పుస్తకం ప్రకారం ప్రస్తుతం గ్రూప్ విలువ దాదాపు రూ. 1,80,000 కోట్లు. అత్యాశకు పోయేవారు సంతోషంగా ఉండలేరని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. ప్రతీ క్షణం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలన్నది తన తండ్రి నుంచి నేర్చుకున్నానని ఆయన వివరించారు. డబ్బే పరమావధిగా పనిచేసే ఏ సంస్థా పురోగమించలేదని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధోగతి పాలైనవి చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
జైల్లో రాజభోగాలకు రూ 1.23 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ జైల్లోనూ రాజభోగాలు అనుభవించారు. ఏడాదికిపైగా ప్రత్యేక సెల్లో ఉన్న రాయ్ ఏ లోటూ లేకుండా విలాసవంతమైన జీవితం గడిపారు. ప్రత్యేక వసతులు కల్పించినందుకుగాను తీహార్ జైలు అధికారులకు ఆయన చెల్లించిన మొత్తం 1.23 కోట్ల రూపాయలు. భద్రత, విద్యుత్, కాన్ఫరెన్స్ రూమ్ అద్దె, భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించినందుకు జైలు అధికారులు ఈ మొత్తాన్ని వసూలు చేశారు. ఆయనకు వీడియో కాన్ఫరెన్స్, వైఫై, ఏసీ గదులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, ల్యాండ్ ఫోన్లు, ఓ సెల్‌ఫోన్, సహాయ సిబ్బందిని వినియోగించుకునేందుకు అనుమతించారు. సహారా గ్రూప్ జైలు అధికారులకు ఇంకా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు చెప్పారు. కాగా గత నెలలో రాయ్‌ను సాధారణ సెల్‌కు మార్చారు. డిపాజిటర్లకు 20 వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమైనందుకు రాయ్‌తో పాటు సహారా గ్రూపు డైరెక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబెలను కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తీహార్ జైలుకు తరలించారు. రాయ్‌కు బెయిల్ మంజూరు చేయడానికి 10వేల కోట్ల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 5 వేల కోట్లు రూపాయల నగదు, మరో ఐదు వేల కోట్లకు చెక్ రూపంలో సమర్పించాలని సూచించింది. అయితే ఈ డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఆయన విడుదల కాలేదు. తీహార్ జైల్లో రాయ్‌కు అత్యంత భద్రత ఉండే వార్డును కేటాయించారు. బెయిల్ కోసం డబ్బులు సమకూర్చుకునేందు కోసం న్యూయార్క్, లండన్‌లో ఉన్న రాయ్ హోటళ్లను అమ్ముకునేందుకు వీలుగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు. -
సహారా మ్యూచువల్ ఫండ్ లెసైన్స్ రద్దు
సెబీ కీలక నిర్ణయం ఫండ్ వ్యాపారానికి సంస్థ తగదని వ్యాఖ్య {పస్తుత ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ముంబై : సహారా గ్రూప్‌కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం మరో షాక్ ఇచ్చింది. ఆ సంస్థ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) లెసైన్సును రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఈ వ్యాపారం చేయడానికి సహారాకు తగినంత పటిష్ఠత లేదని పేర్కొంది. మరో ఫండ్ హౌస్‌కు సహారా మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్‌ను (కార్యకలాపాలను) బదిలీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ మేరకు 22 పేజీల ఉత్తర్వును వెలువరించింది. సహారా పోర్టిఫోలియో మేనేజ్మెంట్ లెసైన్స్‌ను కూడా ఇటీవల సెబీ రద్దు చేసింది. సహారాకు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.24,000 కోట్లు వసూలు చేయడం, వాటిని తిరిగి చెల్లించడంలో వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ కేసుల్లో ప్రస్తుతం ఆ సంస్థ చీఫ్ సుబ్రతారాయ్ తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో రూలింగ్ ఇవ్వగా దాన్ని సంస్థ ఇప్పటికీ చెల్లించలేకపోతోంది. సేవల తక్షణ నిలుపుదల... తన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. ఇప్పటినుంచీ సహారా మ్యూచువల్ ఫండ్, సహారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రస్తుత లేదా తాజా మదుపరుల నుంచి ఫండ్‌కు సంబంధించి డబ్బులు తీసుకోరాదని పేర్కొంది. దీనితోపాటు సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ (సహారా స్పాన్సర్), సహారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల (సహారా ఏఎంసీ) కార్యకలాపాలను వీలైనంత త్వరలో కొత్త స్పాన్సర్కూ, సెబీ ఆమోదిత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి బదలాయించాలని సహారా ఎం ఎఫ్‌ను సెబీ ఆదేశించింది. వచ్చే ఆరు నెలల్లో సహారా లెసైన్స్ పూర్తిగా స్తంభించిపోతుందని పేర్కొంటూ... ఈ లోగా యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలన్నీ తీసుకోవాలని సహారా ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ఆదేశించింది. రానున్న ఐదు నెలల్లో ఫండ్ బదలాయింపు ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లేదంటే మరో 30 రోజుల్లో సంస్థే ఇన్వెస్టర్లకు కేటాయించిన యూని ట్లను తప్పనిసరిగా అమ్మేసి, ఎటువంటి అదనపు వ్యయం లేకుండా ఆయా ఫండ్ విలువను ఇన్వెస్టర్లకు చెల్లించాలని స్పష్టం చేసింది. -
సహారాపై అమెరికా కోర్టులో దావా
న్యూఢిల్లీ : చైర్మన్ సుబ్రతా రాయ్ బెయిల్‌కి నిధులు సమీకరించడంలో తలమునకలైన సహారా గ్రూప్‌కి రోజుకో సమస్య వచ్చి పడుతోంది. అమెరికాలో అమ్మకానికి పెట్టిన సహారా గ్రూప్ రెండు హోటల్స్‌ను తమకు స్వాధీనం చేయాలంటూ తాజాగా హాంకాంగ్‌కి చెందిన జేటీఎస్ ట్రేడింగ్ అమెరికా కోర్టులో దావా వేసింది. న్యూయార్క్‌లోని రెండు హోటల్స్‌తో పాటు లండన్‌లోని గ్రాస్‌వీనర్ హోటల్ రీఫైనాన్సింగ్కి డీల్ కుదర్చాల్సిన టీమ్‌లో దుబాయ్‌కి చెందిన ట్రినిటీ వైట్ సిటీ వెంచర్స్‌తో తాము జతకట్టినట్లు జేటీఎస్ పేర్కొంది. అయితే, సహారా గ్రూప్, ట్రినిటీ, స్విస్ బ్యాంక్ యూబీఎస్ కలిసి మధ్యలోనే తమ సంస్థను పక్కన పెట్టేశాయని, దీనివల్ల తమకు భారీగా నష్టం జరిగిందని తెలియజేసింది. ఇందుకు పరిహారంగా మూడు సంస్థలూ కలిసి 350 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ జేటీఎస్ దావా వేసింది. మరోవైపు, ట్రినిటీ వైట్ సిటీకి జేటీఎస్కి మధ్య లావాదేవీల విషయం తమకు తెలియదని, తమకి ఏమాత్రం సంబంధం లేని కేసులోకి అన వసరంగా లాగుతున్నారని సహారా గ్రూప్ తెలిపింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది. -
బాకీ కడితేనే బెయిల్
న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాల ఆరోపణలతో తీహార్ జైల్లో గడుపుతున్న సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ కు మరోసారి ఎదురు దెబ్బతగిలింది. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడంలో విఫలమవ్వడంతో సుబ్రతో రాయ్ కు బెయిల్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. టిఎస్ థాకూర్, జస్టిస్ అనిల్ ఆర్ దేవ్ జస్టిస్ ఎకె సిక్రి లతో కూడిన డివిజన్ బెంచ్ సుబ్రతో రాయ్ బెయిల్ వ్యవహారంపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. కంపెనీ దాఖలు చేసిన బ్యాంక్ గ్యారంటీ ఫార్మాట్ ను అంగీకరించినప్పటికీ బాకీ చెల్లించేదాకా బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. అయితే ఆ సొమ్మును చెల్లించడానికి కొంత వెసులుబాటును కల్పించింది. 36,000 కోట్ల రూపాయలను సెబీకి చెల్లించేందుకుగాను18 నెలల గడువును ఇచ్చింది. ఈ మొత్తాన్ని తొమ్మిది వాయిదాలలో చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో సహారాకు కొంత ఊరట లభించినట్టే. రూ.5 వేల కోట్లు, అంతే మొత్తానికి బ్యాంకు పూచీకత్తు సమర్పించే దాకా తీహార్ జైలు నుంచి విడుదల చేయబోమని రాయ్ కు కోర్టు స్పష్టం చేసింది. రాయ్ కు విధించిన కస్టడీని మరో 8 వారా ల పాటు పొడిగించింది. డిపాజిట్‌దార్లను మోసం చేసిన కేసులో సంక్షోభంలో పడి , బెయిల్ కోసం సమకూర్చుకోవాల్సిన డబ్బు కోసం సహారా గ్రూప్ నానా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. -
అమ్మకానికి సహారా గ్రాస్‌వీనర్ హౌస్
లండన్: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కొన్నాళ్ల క్రితం సహారా గ్రూప్ లండన్‌లో కొనుగోలు చేసిన గ్రాస్‌వీనర్ హౌస్ హోటల్‌ను రుణదాతలు అమ్మకానికి పెట్టారు. దీని విలువ దాదాపు 500 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఉంటుందని అంచనా. సహారా గ్రూప్‌నకు విదేశాల్లో గ్రాస్‌వీనర్ హౌస్‌తో పాటు ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ పేరిట మరో రెండు హోటల్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్టర్లకు చెల్లింపుల కేసుకు సంబంధించి అరెస్టయిన గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ .. బెయిల్ కోసం కావాల్సిన నిధులను ఈ హోటల్స్‌పై రుణం కింద తెచ్చుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రాస్‌వీనర్ హౌస్‌పై తీసుకున్న రుణాలను సహారా సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో దీని విక్రయ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ను రుణదాతలు ఎంపిక చేసినట్లు బ్రిటన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రియల్టీ కన్సల్టెన్సీ దిగ్గజం జోన్స్ లాంగ్ లాసల్ (జేఎల్ఎల్) దీనికి కొనుగోలుదారును అన్వేషించనుంది. 2010-2012 మధ్య కాలంలో సహారా గ్రూప్.. గ్రాస్‌వీనర్ హౌస్, ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ హోటళ్లను 1.55 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం రియల్టీ రేట్లు పెరిగిన నేపథ్యంలో వీటి విలువ 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. వీటి కొనుగోలు కోసం బ్యాంక్ ఆఫ్ చైనా వద్ద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు అమెరికాకు చెందిన మిరాచ్ క్యాపిటల్ దగ్గర్నుంచి కొత్తగా రుణం తీసుకునేందుకు సహారా ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. గ్రాస్‌వీనర్ హౌస్ కథ ఇదీ.. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సర్ ఎడ్వర్డ్ ల్యుటెన్స్ డిజైన్ చేసిన లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ గ్రాస్‌వీనర్ హౌస్‌ను 1929లో నిర్మించారు. అంతర్గతంగా 56,700 చ.మీ. మేర విస్తరించిన ఈ హోటల్లో 74 సూట్స్ సహా మొత్తం 494 రూమ్స్ ఉన్నాయి. యూరప్‌లోనే అతి పెద్ద ఫైవ్‌స్టార్ బాల్రూమ్ ఇందులో ఉంది. అలాగే పేరొందిన పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2008లో దాదాపు రూ. 1,300 కోట్లతో దీనికి కొత్త హంగులు అద్దారు. దీన్ని ప్రస్తుతం జేడబ్ల్యూ మారియట్ నిర్వహిస్తోంది. 2010లో దీని కొనుగోలుకు సహారా గ్రూప్ 470 మిలియన్ పౌండ్లు వెచ్చించింది. అప్పట్లో ఇది అత్యంత భారీ డీల్. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ చైనా రుణాలను తిరిగి చెల్లించగలమని సహారా గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. సాంకేతికాంశాలే సమస్యకు కారణమని పేర్కొంది. -
రూ.10కోట్లే లేనప్పుడు 30 కోట్లు ఎలా చెల్లిస్తారు?
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు సంబంధించి రూ.10,000 కోట్ల సమీకరణకు సహారా ముప్పతిప్పలు పడుతోంది. ఈ డబ్బులు చెల్లించేందుకు న్యాయస్థానాన్ని మరో ఆరువారాల గడువు కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 10,000 కోట్ల రూపాయలు చెల్లించడానికే ఇబ్బంది పడుతున్న మీరు ఇన్వెస్టర్లకు 30,000 వేల కోట్లు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కారణ పిటిషన్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుండి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమవడంతో సుబ్రతా రాయ్ జైలు పాలయ్యారు. జైలులోనే ఉండి ఆస్తులు అమ్ముకోవడానికి ఆయనకు ధర్మాసనం అనుమతినిచ్చింది. -
మిరాచ్ మోసంపై ఎఫ్ఐఆర్: సహారా
న్యూఢిల్లీ: విదేశాల్లోని తమ మూడు హోటళ్ల (న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్ - లండన్‌లోని గ్రాస్‌వీనర్) వాటాల విక్రయ వ్యవహారంలో తమను ఘోరంగా మోసం చేసిన కేసులో అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్, ఆ సంస్థ అధికారులపై క్రిమినల్, సివిల్ పరమైన న్యాయ చర్యలను ప్రారంభించినట్లు సహారా ప్రతినిధి ఒకరు తెలిపారు. రుణానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ అమెరికా లేఖ విషయంలో ఫోర్జరీ, మోసం వ్యవహారంలో తమ ఫిర్యాదుపై మిరాచ్పై ఎఫ్ఐఆర్ నమోదయినట్లు కూడా పేర్కొంది. కాగా తమ చీఫ్ సుబ్రతారాయ్‌ని తీహార్ జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు సంబంధించి బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణలపై కూడా కొత్త మార్గాలపై దృష్టి పెట్టినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. మేము సైతం - మిరాచ్: కాగా సహారా న్యాయపరమైన చర్యలపై పంపిన ఈ-మెయిల్ ప్రశ్నలకు మిరాచ్ కేపిటల్ సమాధానం ఇచ్చింది. తాను సైతం సహారాపై న్యాయపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపింది. త్వరలో ఇందుకు సంబంధించి ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామని పేర్కొంది. -
సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ దేశీయంగా నాలుగు ప్రాపర్టీలను విక్రయించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. జైల్లో ఉన్న సంస్థ చైర్మన్ సుబ్రతో రాయ్ బెయిల్‌కు కావాల్సిన రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు సహారా గ్రూప్ ఈ విక్రయాలు తలపెట్టింది. పుణే, జోధ్‌పూర్, చౌమా (గుడ్‌గావ్), వసై (ముంబై)లలోని ప్రాపర్టీలను అమ్మడం ద్వారా కంపెనీ రూ. 2,710 కోట్లు సమీకరించవచ్చని అంచనా. ఈ ఆస్తుల విక్రయ లావాదేవీలు వచ్చే ఏడాది మేలోగా పూర్తి కావాల్సి ఉంటుందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని బెంచ్ ఆదేశించింది. కొనుగోలుదారులు ఈలోగా సెబీ-సహారా రీఫండ్ అకౌంటు పేరిట పోస్ట్ డేటెడ్ చెక్కులను డిపాజిట్ చేయాలని సూచించింది. విక్రయ ప్రక్రియ గురించి సహారా తరఫు న్యాయవాదులు సుప్రీంకు వివరించారు. ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్ల రీఫండ్ కేసుకు సంబంధించి సుబ్రతో రాయ్ ఈ ఏడాది మార్చి 4 నుంచి జైల్లోనే ఉన్నారు. -
రాయ్ విడుదలకు మళ్లీ సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు ఆ సంస్థ తాజాగా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు రూ. 25,000 కోట్లు సమీకరించిన కేసులో రాయ్ మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు సంబంధించి రూ.10,000 కోట్ల చెల్లించాలన్న అత్యున్నత న్యాయస్థానం షరతు వ్యవహారంలో విదేశాల్లోని మూడు హోటెల్స్ అమ్మకాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియను రాయ్ న్యాయవాది ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు వివరించారు. ఇటీవల సహారా గ్రూప్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల గురించి కూడా న్యాయమూర్తులు ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న రూ.143 కోట్లు ఉద్యోగుల మూడు నెలల వేతనాలకు ఉద్దేశించినవని సహారా న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. -
ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు?
పనాజీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ ను ఆరునెలలుగా జైలులో ఉంచడంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నొచ్చుకున్నారు. ఇంకా ఎన్నిరోజులు ఆయనను జైలులో ఉంచుతారంటూ ప్రశ్నించారు. దక్షిణ గోవా రిసార్ట్ లో జరిగిన 16వ ఆల్ ఇండియా విప్స్ కాన్ఫెరెన్స్ లో పారికార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోర్టు ధిక్కార నేరం కింద సుబ్రతారాయ్ ను ఇన్నిరోజులు జైలులో ఉంచడం తనను బాధించిందన్నారు. 'సుబ్రత రాయ్ ను సుప్రీంకోర్టు ఇంకా ఎన్ని రోజులు జైల్లో ఉంచుతుంది. ప్రజాస్వామ్యవాదిగా ఈ విషయంలో కలత చెందా. సరైన విధానం లేకుండా ఓ వక్తిని నిర్బంధిచకూడదు. సుబ్రతారాయ్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఎందుకు మొండిపట్టుదలతో ఉందో అర్థం కావడం లేదు' అని పారికర్ వ్యాఖ్యానించారు. సుబ్రతారాయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. -
బతుకు 'సహారా' ఎడారేనా ?
కాలం దెబ్బకు ఎవరైనా కుదేలు కావాల్సిందే. అది ధనవంతుడు, రాజకీయనాయకుడు.... ఎవరైనా జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ కాలం దెబ్బ తినక తప్పదు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ సహారా పరివార్ ఇండియా ఛైర్మన్ సుబ్రత రాయ్. సహారా గ్రూప్ ఛైర్మన్‌గా జీవితం అనే వైకుంఠపాళిలో ఆయన ఎంతో వేగంగా అత్యున్నత స్థితికి చేరుకున్నారో ... అంతే వేగంగా కిందకి జారీ పడ్డారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తూ... బెయిల్ కోసం కన్నులు కాయాలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లోని ఆస్తులు న్యూయార్క్ ప్లాజా, గ్రోస్వెనర్ హౌస్.... విక్రయానికి లేదా తనఖా పెట్టుకునేందుకు ఎవరైనా రాకపోతారా అని ఆశాగా ఎదురు చూస్తూ... కాలం వెళ్ల దీస్తున్నారు. ఇంతకీ సుబ్రత రాయ్ కథా కమామిషూ ఏమిటి? గోరఖ్‌పూర్‌లో సహారాలో సుబ్రత చిరుఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి... ఆ కంపెనీనే సొంతం చేసుకున్నారు. అనంతరం బ్యాంకింగ్, మీడియా, ఎంటర్టైనర్, అతిథ్యం.... అన్ని రంగాల్లోకి సహారా ఇండియా పరివార్‌గా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగింది. దేశ విదేశీ పత్రికలు సైతం ఆయన్ని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరని కీర్తించింది. అంతేనా... దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. దేశంలో అత్యధిక ఉద్యోగులు గత సంస్థ భారతీయ రైల్వే. ఆ తర్వాత స్థానాన్ని సహార ఇండియా సొంతం చేసుకుంది. దాంతో సహారా ఇండియా రికార్డు సృష్టించింది. అంతాబాగానే ఉంది. కానీ తన సంస్థలో నగదు కుదువ పెట్టిన మదుపుదారులకు దాదాపు రూ. 24 వేల కోట్లు సుబ్రతరాయ్ సకాలంలో చెల్లించలేకపోయారు. దాంతో మదుపుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు హాజరుకావాలని సుబ్రతను సుప్రీం ఆదేశించింది. ఆ ఆదేశాలను సుబ్రత పెడచెవిన పెట్టాడంతో కోర్టు ఆగ్రహానికి గురైయ్యారు. సుబ్రతను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి... కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు జైలు శిక్ష విధించింది. బెయిల్ విడుదల కావాలంటే రూ. 10 వేల కోట్లు బెయిల్ బాండ్ సమర్పించాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. దాంతో ఆ నగదును సమకూర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అయితే ఆస్తుల విక్రయానికి లేదా తనఖా కోసం కొనుగోలుదారులు వస్తే మాట్లాడేందు... ఇతర ప్రాంతాలలో ఉన్నవారితో మాట్లాడేందుకు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తీహార్ జైల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ సుప్రీం కోర్టు ఆయనకు వెలుసుబాటు కల్పించింది. దాంతో తన ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకురాకపోతారా అంటూ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే సహారా గ్రూప్‌ను బ్రూనై సుల్తాన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేయునున్నారని సమాచారం. ఆయన కొంటే సరే లేకుంటే సుబ్రత జీవితం.... సహారా ఎడారే. -
విదేశీ హోటళ్ల విక్రయానికి డీల్ ఓకే
న్యూఢిల్లీ: న్యూయార్క్, లండన్లలోని తమ గ్రూప్ మూడు హోటళ్ల విక్రయానికి ఒక పార్టీతో ఒప్పందం కుదిరిందని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టుకు గురువారం తెలిపారు. రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి ఒక బ్యాంక్ అంగీకరించిందని కూడా తెలిపారు. అయితే ఒప్పందాలపై సంతకాలు జరిగేంతవరకూ ఈ వివరాలను వెల్లడించలేనని విన్నవించారు. కాగా చర్చల ప్రక్రియను కొనసాగించడానికి వీలుగా రాయ్ కోరిన విధంగా ఆగస్టు 15 నుంచి మరో 15 రోజుల పనిదినాలు తీహార్ జైలులోని కాన్ఫరెన్స్ రూమ్, చర్చలకు సంబంధించిన సౌలభ్యతలను వినియోగించుకోడానికి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది. దీనితో ఈ చర్చల ప్రక్రియకు మొత్తం 25 రోజుల సమయం ఇచ్చినట్లయ్యింది. అయితే ఇంతకుమించి గడువును పెంచే ప్రశ్నే ఉండబోదని స్పష్టం చేసింది. మదుపరుల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.24,000 కోట్ల వసూలు, వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్ల పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో రాయ్ తీహార్ జైలులో ఐదు నెలలుగా ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ పొందడానికి వీలుగా రూ.10,000 కోట్లు చెల్లించడానికి ఆస్తుల అమ్మకానికి కోర్టు అనుమతించడంతో ప్రతిపాదిత కొనుగోలుదారులతో జైలు కాన్ఫరెన్స్ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారు. కాగా తన పారాబ్యాంకింగ్ డివిజన్‌కు చెందిన రెండు లక్షల మంది సభ్యుల ద్వారా రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల మేర (సభ్యునికి రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకూ) నిధుల సమీకరణకు ఒక ‘కాంట్రిబ్యూషన్ స్కీమ్’ను గ్రూప్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీకే శ్రీవాస్తవ ప్రతిపాదించారు. అయితే ఇది ఒక వ్యక్తిగత చొరవ తప్ప, మేనేజ్మెంట్తో దీనికి సంబంధం లేదని సహారా ఇండియా ప్రతినిధి తెలిపారు. -
జైలు నుంచి బయటకు వచ్చేందుకు...
-
జైలు నుంచి బయటకు వచ్చేందుకు...
ముంబై: ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పడు రాజాలా బతికిన సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు. బెయిల్ ఇవ్వాలంటే రూ. 10 వేల కోట్లు కట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆయన విదేశాల్లోని ఆస్తులను అమ్మకానికి పెట్టారు. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన న్యూయార్క్ ప్లాజా హోటల్, లండన్ లోని గ్రోస్వెనర్ హౌస్ ను అమ్మేందుకు సిద్దమయ్యారు. బెయిల్ కోసం నిధులు సమీకరించుకునేందుకు జైలు నుంచే ఆస్తులు అమ్ముకోవడానికి ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ గత అయిదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. -
తీహార్ జైల్లో సహారా సుబ్రతాకి ‘ఆఫీస్’
న్యూఢిల్లీ: బెయిల్ కోసం నిధులు సమీకరించుకోవడంలో భాగంగా హోటల్స్‌ను విక్రయిస్తున్న సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ .. కొనుగోలుదారులతో తీహార్ జైల్లో నేటి నుంచి చర్చలు జరపనున్నారు. ఇందుకోసం జైల్లోని కాన్ఫరెన్స్ రూమ్‌ను అధికారులు కేటాయించారు. మంగళవారం (నేడు) నుంచి పది రోజుల పాటు చర్చల కోసం ఆయన దీన్ని వినియోగించుకోనున్నారు. సాధారణంగా జైలు అధికారులు అంతర్గత సమావేశాల కోసం ఉపయోగించుకునే ఈ రూమ్‌ను సుబ్రతా రాయ్‌కి సంబంధించి.. ప్రస్తుతం స్పెషల్ జైలుగా వ్యవహరిస్తారు. సుబ్రతాతో పాటు తీహార్‌లోనే ఉన్న ఇద్దరు సహారా డెరైక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దూబే.. కొనుగోలుదారులతో చర్చల్లో పాల్గొంటారు. ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ గత అయిదు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరు చేసేందుకు రూ. 10,000 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో తాజాగా ఆయన న్యూయార్క్, లండన్‌లోని లగ్జరీ హోటల్స్‌ను అమ్మకానికి పెట్టారు. ఇందుకోసమే ఆయన బిడ్డర్లతో చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. రూమ్‌లో సదుపాయాలివీ.. వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఏసీ కాన్ఫరెన్స్ రూమ్‌లో 52 అంగుళాల టీవీ, వై-ఫై కనెక్టివిటీ ఉంటుంది. రాయ్‌కి, డెరైక్టర్లకు రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఒక మొబైల్ ఫోన్ ఇస్తారు. వీటికి సంబంధించిన చార్జీలను సహారా భరించాల్సి ఉంటుంది. ఉదయం 6 గం. నుంచి రాత్రి 8 గం.దాకా స్టెనో, సహాయకులు, ఒక సాంకేతిక సహాయక ఉద్యోగి ఆయనకు అందుబాటులో ఉంటారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో చర్చలు జరుగుతాయి. -
రాయ్ చర్చలకు 10 రోజులు జైలు కాన్ఫరెన్స్ రూమ్
5 నుంచి వినియోగానికి సుప్రీం అనుమతి... న్యూఢిల్లీ: న్యూయార్క్,లండన్లలోని తన మూడు లగ్జరీ హోటళ్లను కొనుగోలు చేయదలచిన వారితో సంప్రదింపులు జరపడానికి సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కి ఆగస్టు 5 నుంచి 10 పనిదినాలు తీహార్ జైలు కాన్ఫరెన్స్ రూమ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్ల సమీకరణకు వీలుగా న్యూయార్క్, లండన్లలోని తన హోటల్స్‌సహా దేశీయ ఆస్తుల విక్రయానికి, ఇందుకు ప్రతిపాదిత కొనుగోలుదారులతో చర్చలు జరిపేందుకు జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ సంప్రదింపులకు కాన్ఫరెన్స్ రూమ్‌ను వినియోగించుకోడానికి వీలుగా 4వ తేదీలోపు నోటిఫికేషన్ జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. షరతులివి...: కేవలం చర్చల నిమిత్తం 10 రోజులే ఆయన కాన్ఫరెన్స్ రూమ్‌లో ఉంటారు. అయితే నిర్ణీత సమయంలోనే ‘కొనుగోలుదారులతో’ సంప్రదింపులు జరపాలి. 10 రోజుల కాలాన్ని సహారా చీఫ్‌కు కాన్ఫరెన్స్ రూమ్‌ను ప్రత్యేక జైలుగా పరిగణించడం జరుగుతుంది. వైఫై, వీడియా కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలను చర్చలకు సమకూర్చడం జరుగుతుంది. రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డెస్క్‌టాప్‌లు, ఒక మొబైల్ ఫోన్ వినియోగానికి కోర్టు అనుమతించింది. ఈ సేవలన్నింటికీ సహారా తగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. -
జైల్లో వైఫై, వీడియో కాన్ఫరెన్స్ కావాలట!
న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాల ఆరోపణలతో గత మూడు నెలలుగా తీహార్ జైల్లో గడుపుతున్న సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ వైఫై, కాన్ఫరెన్స్ రూమ్ కావాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రతో దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన తరపు లాయర్లను, జైలు అధికారులతో సుప్రీం న్యాయమూర్తి విచారించారు. అయితే సుబ్రతో విజ్క్షప్తిపై సమీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జైలు సీనియర్ అధికారులు తెలిపారు. అయితే కొనుగోలుదారులతో, ఇతర ప్రతినిధులను కలుసుకోవడానికి, చర్చలు జరపడానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అవసరముందని సుబ్రతో న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఒకవేళ సుప్రీం కోర్టు అనుమతిస్తే.. వైఫై, వీడియో కాన్ఫరెన్స్, లాప్ టాప్ లకు అవసరమయ్యే ఖర్చును సహారా భరించాల్సి ఉంటుందన్నారు. సుబ్రతోను ఎంతమంది సందర్శకులు, ఎన్ని ఎలక్ట్రానికి వస్తువులు, సిబ్బంది సంఖ్యపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఓ సమీక్ష నిర్వహించనున్నారు. -
జైలు కాంప్లెక్స్‌లోనే తగిన ఏర్పాటు!
►ఆస్తుల కొనుగోలుదారులతో సహారా చీఫ్ ►చర్చలపై ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తన ఆస్తులను కొనుగోలు చేయాలనుకునేవారితో సంప్రదింపులు జరపడానికి వీలుగా తీహార్ జైలు కాంప్లెక్స్‌లో తగిన ఏర్పాటు చేయాలని ఢిల్లీ (ఎన్సీటీ) ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వ్యక్తిగతంగాకానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ ఈ చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సూచించింది. ఈ విషయంపై వేదిక ఏర్పాటుకు జైలు అధికారులను సంప్రదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. కేవలం ఆస్తులు కొనుగోలుచేయాలనుకునే వారితో చర్చలకు మాత్రమే ఈ ఏర్పాట్లు జరగాలి తప్ప, రాయ్‌కి సౌకర్యవంతమైన ఏర్పాటు చేసేలా ఉండరాదని సైతం నిర్దేశించింది. జైలు కాంప్లెక్‌లోని గెస్ట్ హౌస్ లేదా కోర్ట్ రూమ్‌లో ఆస్తుల కొనుగోలుదారులతో సంప్రదింపులకు ఏర్పాటు చేసుకోవచ్చనీ సుప్రీంకోర్టు తెలిపింది. ఆయా అంశాలపై జూలై 30లోపు తమ స్పందనను తెలియజేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంతక్రితం రెగ్యులర్ బెయిల్ వీలుగా రూ.10,000 కోట్లు సమీకరణకు భారత్, విదేశాల్లోని తన ఆస్తుల విక్రయానికిగాను చర్చలకువారంపాటు తనను తీహార్ జైలు గెస్ట్ హౌస్‌కు మార్చాలని రాయ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
సుబ్రతారాయ్‌కు మళ్లీ నిరాశే
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్‌కు నిరాశే ఎదురయ్యింది. బెయిల్ లేదా పెరోల్‌పై రాయ్‌ని విడుదల చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా రెండు గ్రూప్ కంపెనీలు మదుపుదారుల నుంచి దాదాపు రూ.24 వేల కోట్లు వసూలు చేసిన కేసులో- గడచిన ఐదు నెలల నుంచీ రాయ్ తీహార్ జైలులో కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ పొందాలంటే రూ.10 వేల కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. రూ.10,000 కోట్లలో తొలుత కొంత మొత్తం చెల్లించి రెగ్యులర్ బెయిల్‌పై విడుదలై, అటు తర్వాత మిగిలిన మొత్తాలను చెల్లించే విధంగా వెసులుబాటు ఇవ్వాలని సుప్రీం కోర్టును సహారా కోరుతోంది. అయితే ఇందుకు న్యాయమూర్తులు అంగీకారం తెలపలేదు. పెరోల్‌కు సైతం తాజాగా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెసులుబాటు బాట..! కాగా న్యూయార్క్, లండన్లలో ఉన్న లగ్జరీ హోటెల్స్సహా దేశంలోని తొమ్మిది ఆస్తులను విక్రయానికి మాత్రం సుప్రీం సరే అంది. అయి తే జైలు వెలుపల ఎక్కడైనా ఇందుకు సంబంధించి కొనుగోలుదారులతో లావాదేవీలను జరపడానికి వీలుగా ఉదయం 10 గంటల నుంచీ సాయంత్రం 4 గంటల వరకూ సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చింది. షియోమి ఆర్డర్ల వెల్లువతో ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ క్రాష్ ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ మంగళవారం మరోసారి క్రాష్ అయింది. చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ ‘ఎంఐ3’ చౌక స్మార్ట్ఫోన్ల ఆన్లైన్ అమ్మకాలకు బుకింగ్స్ ప్రారంభించిన సందర్బంగా ఒకేసారి ఆర్డర్లు వెల్లువెత్తడంతో పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి మొరాయించినట్లు సమాచారం. చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ.. భారత్‌లో తాజాగా తమ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ విక్రయాలకోసం ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌తో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది మే14న కూడా ‘మోటో ఇ’ మొబైల్ ఆన్లైన్ విక్రయాల ప్రారంభం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సైట్ ఇదేవిధంగా క్రాష్ కావడం తెలిసిందే. కాగా, క్రాష్ వార్తల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది వెబ్సైట్లో సమస్యలను కొద్దిసేపటితర్వాత చక్కదిద్దినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
బెయిల్ లేదు.. పెరోల్ లేదు
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు విముక్తి కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయనకు బెయిల్ లేదా పెరోల్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. న్యూయార్క్, లండన్ లో ఉన్న సహారా హోటళ్లను అమ్మేందుకు లేదా తనఖా పెట్టేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. ఎక్కడ, ఎప్పుడు ఆస్తులు అమ్మేందుకు సంప్రదింపులు జరిపినా పోలీసుల పర్యవేక్షణలోనే జరగాలని సుబ్రతారాయ్ ను ఆదేశించింది. ఆస్తుల అమ్మకానికి సంబంధించి జైలు వెలుపల క్లయింట్లతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలీసుల పర్యవేక్షణలో సంప్రదింపులు కొనసాగించొచ్చని తెలిపింది. తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
దయతో బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా గ్రూప్ ఆస్తులను విక్రయించి రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్- సెబీ వద్ద డిపాజిట్ చేయాల్సిన రూ.10,000 కోట్ల సమీకరించడానికి వీలుకలుగుతుందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసుకుంది. ఐటీ అఫిడవిట్‌కు 2 వారాల గడువు... కాగా కేసుకు సంబంధించి గ్రూప్ కంపెనీలు తనకూ రూ.7,000 కోట్ల పన్ను చెల్లింపులు జరపాల్సి ఉందని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వివరాలు తెలుపుతూ రెండు వారాల్లో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. -
ఆస్తులు అమ్ముకుంటాం.. పెరోల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆస్తుల విక్రయానికి వీలు కల్పిస్తూ తనకు కనీసం 40 రోజుల పెరోల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును గురువారం కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మదుపుదారుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు డబ్బు వసూలు చేసిన కేసులో గత 4 నెలలుగా ఆయన తీహార్ జైలులో కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు కట్టాలని కోర్టు షరతు విధించింది. ఈ నిధుల సమీకరణకు వీలు కల్పించాలని ఇప్పటికే సహారా చీఫ్ పలు ప్రతిపాదనలతో కోర్టు ముందుకు వచ్చారు. వీటిని సుప్రీం తోసిపుచ్చింది. ప్రస్తుత పెరోల్ విజ్ఞప్తి ఈ దిశలో తాజాది. న్యూయార్క్, లండన్లలో లగ్జరీ హోటళ్లను విక్రయిస్తామని సహారా పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న ఆస్తుల విక్రయానికన్నా ముందు దేశీయంగా ఉన్న ఆస్తులను మొదట ఎందుకు విక్రయించకూడదని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సహారా న్యాయవాది రాజీవ్ ధావన్‌ను ప్రశ్నించారు. దీనికి ధావన్ సమాధానం ఇస్తూ, తద్వారా రూ.5,000 కోట్ల సమీకరణ కష్టమని వివరించారు. ఈ పరిస్థితుల్లో న్యూయార్క్‌లోని డ్రీమ్ డౌన్‌టౌన్, ప్లాజా హోటళ్లను, అలాగే లండన్‌లోని గ్రాస్‌వీనర్ హౌస్‌ను తొలుత విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనితో... ఒకవేళ విదేశాల్లోని ఆస్తుల విక్రయింపు ప్రక్రియ పర్యవేక్షణ ఎలా అన్న విషయంలో సలహాలను ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని బెంచ్‌కు సూచించింది. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఐటీ షాక్... మరోవైపు గ్రూప్ చెల్లించాల్సిన పన్నుల విషయంలో ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ కూడా రంగంలోకి దిగింది. పన్నుగా సంస్థ రూ.7,000 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విచారణలో భాగంగా తమ వాదనలూ వినాలని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆదాయపు పన్నుకు సంబంధించి ఐటీ చేసిన వాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దీనిని కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తుందని తెలిపారు. -
రాయ్ వినతి మళ్లీ తిరస్కరణ
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. మూడు నెలలుగా జైల్లో ఉన్న రాయ్... తనను గృహ నిర్బంధంలో ఉంచాలంటూ చేసిన విజ్ఞప్తిని కోర్టు బుధవారం తిరస్కరించింది. అయితే, ఆయన బెయిల్ కోసం గ్రూప్ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.5 వేల కోట్లు సమీకరించేందుకు, అంతే మొత్తంలో బ్యాంకు గ్యారంటీ సాధించేందుకు అనుమతించింది. భారతీయ నగరాల్లో 9 స్థిరాస్తుల అమ్మకానికి అనుమతిస్తున్నట్లు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఈ ఆస్తుల కొనుగోలుదారులకు సహారా గ్రూప్‌తో ఎలాంటి సంబంధాలు ఉండరాదనీ, సర్కిల్ రేటు కంటే తక్కువ ధరకు విక్రయించరాదనీ స్పష్టంచేసింది. కాగా అంతక్రితం బెయిల్‌కోసం రూ.10,000 కోట్లు సమర్పించే విషయంలో గ్రూప్ తాజా ప్రతిపాదనను తిరస్కరించింది. త్రిసభ్య ధర్మాసనానికి నివేదన: ప్రస్తుత ధర్మాసనం కేసును విస్తృతస్థాయి త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ బెంచ్‌ని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఏర్పాటు చేస్తారు. కోర్టుకు ఈ విషయంలో సలహాలను, అభిప్రాయాలను అందించడానికి సీనియర్ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్‌ను నియమిస్తున్నట్లు కూడా ధర్మాసనం పేర్కొంది. ఒక వాయిదాకు రూ.1.10 లక్షల ఫీజును ఆయనకు సెబీ చెల్లిస్తుంది. ఆ డబ్బును సెబీ తిరిగి సహారా గ్రూప్ అకౌంట్ నుంచి వసూలు చేసుకోవచ్చు. పెరోల్ తరహా సడలింపు పరిశీలన!: కాగా 92 సంవత్సరాల తన తల్లిని కలుసుకునేందుకు రాయ్‌ని అనుమతించాలని, పెరోల్ తరహాలో 5 రోజులు జైలు నుంచి పంపడానికి అనుమతినివ్వాలని సీనియర్ అడ్వకేట్ ఎస్ గణేష్ మౌఖికంగా చేసిన విజ్ఞప్తిని పరిశీలించడానికి బెంచ్ అంగీకరించింది. అయితే ఈ అంశాన్ని ఒక అప్లికేషన్ రూపంలో ఫైల్ చేయాలని నిర్దేశించింది. -
సుప్రీంలో సహారా చీఫ్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కు మళ్లీ చుక్కెదురైంది. తనను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుబ్రతా రాయ్ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. కాగా తొమ్మిది నగరాల్లో ఉన్న స్థిరాస్తులను విక్రయించడానికి కోర్టు సహారా గ్రూప్‌కు అనుమతిచ్చింది. సహారా ఆస్తులకు సంబంధించి టైటిల్ డీడ్స్ అందజేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సెబీని అదేశించింది. డబ్బు సమకూర్చుకోవడానికి సహారా ఆస్తులను విక్రయించనుంది. నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన వేల కోట్ల నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించని వివాదంలో.. సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరు డెరైక్టర్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుబ్రతా రాయ్‌కు బెయిల్ మంజూరు కాకపోవడంతో తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్ బెయిల్ పొందేందుకు వీలుగా మూడు విదేశీ హోటళ్లలోని ఈక్విటీల అమ్మకానికి రుణదాత బ్యాంక్ ఆఫ్ చైనాను ఆశ్రయించేందుకు సహారా గ్రూప్‌ను సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. బెయిల్ కోసం రూ.5 వేల కోట్ల నగదు డిపాజిట్, అంతే మొత్తానికి బ్యాంకు గ్యారంటీ సమర్పించాలన్న ఉత్తర్వులను సవరించాలంటూ రాయ్ చేసిన అభ్యర్థనపై కోర్టు తన ఆదేశాలను రిజర్వులో ఉంచింది. బెయిల్ కోసం రూ.3 వేల కోట్లను ఐదు రోజుల్లో, మరో రూ.2 వేల కోట్లను 30 రోజుల్లో డిపాజిట్ చేస్తామనీ, మిగిలిన రూ.5 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీని విదేశీ హోటళ్లలోని ఈక్విటీల అమ్మకం ద్వారా 60 రోజుల్లో సమర్పిస్తామనీ సహారా గ్రూప్ తాజాగా ప్రతిపాదించింది. లండన్‌లోని ఒక హోటల్, న్యూయార్క్‌లోని రెండు హోటళ్లలోని వాటాలను విక్రయిస్తామని తెలిపింది. ఆ హోటళ్లలో వాటాల కొనుగోలుకు భారీగా నిధులు సమకూర్చిన బ్యాంక్ ఆఫ్ చైనాను సంప్రదించడానికి సహారా గ్రూప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ చైనాతో సంప్రదింపుల సారాంశాన్ని తెలుపుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ‘సహారా గ్రూప్ పేర్కొన్న 9 ఆస్తుల అమ్మకానికి అనుమతించడానికి మేం సుముఖంగా ఉన్నాం. నిధుల సమీకరణకు ఆంబీ వ్యాలీని తాకట్టు పెట్టడానికి కూడా ఆనుమతించడానికి సిద్ధం’ అని టి.ఎస్.ఠాకూర్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. -
సుబ్రతారాయ్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్‌ని విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. సుబ్రతోరాయ్ ను బెయిల్ పై విడుదల చేయాలని తాజాగా ప్రతిపాదనలు సహారా గ్రూప్ చేసింది. పదివేల కోట్ల రూపాయల చెల్లింపుపై అమోదకరమైన ప్రతిపాదనతో రావాలని మే 19 తేదిన జరిగిన విచారణలో సహారా గ్రూప్ నిర్వాహకులను సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో సుబ్రతారాయ్ బెయిల్ పై విడుదల కోసం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సహారా గ్రూప్ తాజాగా ఓ ప్రతిపాదనను సమర్పించింది. -
ఆమోదయోగ్య ప్రతిపాదనతో రండి
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు బెయిల్‌కు రూ.10,000 కోట్ల చెల్లింపులపై తగిన ఆమోదయోగ్య ప్రతిపాదనతో రావాలని సుప్రీంకోర్టు కొత్త బెంచ్ సోమవారం సూచించింది. కేసులో నెలకొన్న ప్రతిష్టంభన వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండబోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లక్నోలో రాయ్‌ని గృహ నిర్బంధం కింద ఉంచాలన్న విజ్ఞప్తిని మాత్రం జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. న్యాయమూర్తులు జె.ఎస్. కేహార్, కె.ఎస్. రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం 2012 నుంచి సహారా కేసును విచారించింది. అయితే, ఈ నెల 14న రాధాకృష్ణన్ రిటైర్ కావడం, కేహార్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేశారు. లండన్, న్యూయార్క్‌లో ఉన్న హోటెల్స్సహా తన ఆస్తుల అమ్మకానికి సహారా సిద్ధమని సహారా సుప్రీంకోర్టుకు తెలపడం మరో ముఖ్య విషయం. కొత్త బెంచ్ వద్ద ప్రాథమిక స్థాయిలో జరిగిన విచారణ ప్రతిష్టంభనను తొలగించే దిశలో కొంత సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్న బెంచ్, తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించింది. వచ్చే వారం కేసు తదుపరి విచారణ జరగనుంది. 75 రోజల నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాయ్‌ని విడుదల చేయాల్సి ఉందని అంతకుముందు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదించారు. లక్నోలో ఆయనను హౌస్ అరెస్ట్ కింద ఉంచాలని సైతం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
సహారా కేసులో మలుపు
న్యూఢిల్లీ: సహారా కేసులో హఠాత్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ జేఎస్ కేహార్ తప్పుకున్నారు. సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ రాకేష్ శర్మ ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. దీనిప్రకారం ఇకపై ఈ కేసు విచారణ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుపుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ జేఎస్ కేహార్ మే 6న ఒక సమాచారం పంపారు. ఇది మే 7న చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చింది. దీనితో కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ కొత్త బెంచ్‌లో న్యాయమూర్తులు ఎవరనే విషయంపై మాత్రం వివరాలను తాజా ప్రకటన తెలియజేయలేదు. ఈ కేసును విచారిస్తున్న ద్విసభ్య ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మే 14న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, మరో న్యాయమూర్తి సైతం సహారా విచారణ ప్రక్రియ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తీవ్ర ఒత్తిడి...! తనను నిర్బంధించడం అక్రమం, అన్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగులో ఉండగానే తనను జ్యుడీషియల్ కస్టడీకి ఎలా పంపుతారని సహారా చీఫ్ సుబ్రతారాయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తులు రాధాకృష్ణన్, కేహార్లు మే 6వ తేదీన బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజు ఈ కేసు విచారణ నుంచి ఇకపై తప్పుకుంటున్నట్లు జస్టిస్ కేహార్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు సమాచారం పంపడం విశేషం. నిర్బంధానికి సంబంధించి ఇచ్చిన రూలింగ్‌ను తప్పుబడుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులే ఎలా విచారిస్తారని సైతం సహారా చీఫ్ సుబ్రతారాయ్ తరఫు న్యాయవాది రామ్‌జత్మలానీ అంతక్రితం వాదించడం ఇక్కడ ప్రస్తావనాంశం. ఈ అంశంపై రూలింగ్ ఇచ్చిన సందర్భంగా న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సహారా కేసులో బెంచ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. -
సహారా కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: సహారా కేసుకు సంబంధించి రెండు అంశాల్లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తన తీర్పును సోమవారం రిజర్వ్ చేసుకుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్, మరో ఇద్దరు డెరైక్టర్ల నిర్భంధం రాజ్యాంగ విరుద్ధమని దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్‌పై తీర్పు ఇందులో ఒకటి. మరొకటి రాయ్, ఇద్దరు డెరైక్టర్ల జైలు నుంచి విడుదలకు సంబంధించి రూ.10 వేల కోట్ల చెల్లింపులపై సహారా తాజా గా దాఖలు చేసిన ప్రతిపాదనపై తీర్పు మరొకటి. తాజా ప్రతిపాదన ఇదీ... బెయిల్‌పై రాయ్ విడుదలకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి సహారా న్యాయవాదులు తాజాగా ఒక ప్రతిపాదన చేశారు. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ఈ తాజా ప్రతిపాదన సమర్పించారు. దీని ప్రకారం... రాయ్‌ని విడుదల చేసిన మూడు పనిదినాల్లో అంటే ఏప్రిల్ 25 నాటికి రూ.3,000 కోట్లను సంస్థ చెల్లిస్తుంది. మరో రూ.2,000 కోట్లను మే 30లోపు చెల్లిస్తుంది బ్యాంక్ గ్యారంటీ రూ.5,000 కోట్లను చెల్లించడానికి సంస్థ జూన్ 30 వరకూ సమయం కోరింది. దీనితోపాటు నిబంధనలకు వ్యతిరేకంగా మదుపరుల నుంచి డబ్బు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు గ్రూప్ కంపెనీలు- ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్ బ్యాంక్ అకౌంట్ల ‘డీఫ్రీజ్’ను కూడా న్యాయవాది కోరారు. విక్రయించదలచిన కొన్ని ఆస్తులపై ఉన్న ఆంక్షలను సైతం ఎత్తివేయాలని సహారా కోరింది. దీనికితోడు మార్చి 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో కొన్ని మార్పులను సైతం కోరుతున్నట్లు ధర్మాసనానికి సహారా న్యాయవాది విజ్ఞప్తి చేశారు. రాయ్ విడుదలకు రూ.5,000 కోట్ల నేషనలైజ్డ్ బ్యాంక్ గ్యారంటీని సుప్రీంకోర్టు అప్పట్లో (మార్చి 26) నిర్దేశించింది. అయితే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గ్యారంటీగా దీనిని మార్చాలని విజ్ఞప్తి చేసింది. ధిక్కరణపై ఇలా...: మదుపరుల నుంచి రూ.20,000 కోట్లకు పైగా డబ్బు వసూళ్ల కేసులో సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ పెండింగులో ఉండగానే రాయ్, ఇద్దరు డెరైక్టర్లను జైలుకెలా పంపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, తక్షణం ఆయన్ను విడుదల చేయాలని ఇంతక్రితం గ్రూప్ తన వాదనలను వినిపించింది. అయితే ‘అరెస్ట్‌కు మేము ఉత్తర్వులు ఇవ్వలేదు. అదే చేస్తే ఆయనను సాధారణ జైలుకే పంపి ఉండేవాళ్లం. జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చాం. ఆయన మా కస్టడీలో ఉన్నారు’ అని ధర్మాసనం అప్పట్లో వ్యాఖ్యానించింది. మార్చి 4 నుంచీ రాయ్ తీహార్ జైలులో ఉన్నారు. -
రాయ్ విడుదలకు తాజా ప్రతిపాదన
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతారాయ్, ఇరువురు డెరైక్టర్లను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడిపించడానికి ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేసి సుప్రీంకోర్టు ఆమోదం పొందలేకపోయిన సహారా, గురువారం మరో కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. దీనిప్రకారం నాలుగు రోజుల్లో సంస్థ రూ.2,500 కోట్లు చెల్లిస్తుంది. 60 రోజుల్లో మరో రూ.2,500 కోట్లు చెల్లింపులు జరుపుతుంది. తదుపరి 90 రోజుల్లో రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని ఇస్తుంది. అయితే గురువారం సమయం లేకపోవడంతో, ఈ ప్రతిపాదనను సోమవారం పరిశీలిస్తామని రాయ్ తరఫు సీనియర్ న్యాయవాదులు రామ్‌జత్మలానీ, ధావన్‌కు సుప్రీం తెలిపింది. కాగా డబ్బు సమీకరణకు సంబంధించి డీఫ్రీజ్ చేయాలని కోరుతున్న గ్రూప్ కంపెనీల బ్యాంక్ అకౌంట్ నంబర్లనూ సుప్రీంకు సహారా న్యాయవాదులు సమర్పించినట్లు వార్తలు వచ్చినప్పటికీ... ఇవి ధృవపడాల్సి ఉంది. మదుపరుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారంలో... మార్చి 4 నుంచి తీహార్ జైలులో ఉన్న రాయ్, డెరైక్టర్ల బెయిల్‌కు రూ.10,000 కోట్లను చెల్లించాలని జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. -
సహారా బ్యాంక్ ఖాతాల ‘డీఫ్రీజ్’కు సుముఖం
న్యూఢిల్లీ: మదుపరులకు డబ్బు పునఃచెల్లింపుల కేసులో సహారాకు సుప్రీంకోర్టు మరో అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్, మరో ఇరువురు డెరైక్టర్ల బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించడానికి వీలుగా- అంతమొత్తాన్ని సమీకరించడానికి వెసులుబాటు కల్పించే రూలింగ్‌ను ఇవ్వడానికి సంసిద్ధత తెలిపింది. దీని ప్రకారం- ఈ కేసులో ఇప్పటికే ‘ఫ్రీజ్’ చేసిన గ్రూప్ అకౌంట్లలో కొన్నింటిని ‘డీఫ్రీజ్’ చేయడానికి ధర్మాసనం సుముఖతను వ్యక్తం చేసింది. ఇందుకుగాను సంబంధిత అకౌంట్ల వివరాలను అప్లికేషన్ రూపంలో సమర్పించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లింపులకుగాను ‘విక్రయించదలచిన’ ఆస్తుల వివరాలనూ తెలియజేయాలని సహారా గ్రూప్ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌ను అడిగింది. వాడివేడి వాదనలు.. ఖాతాల స్తంభనసహా రాయ్, డెరైక్టర్లు జైలులో ఉండగా భారీ మొత్తంలో నిధుల సమీకరణ ఎలా సాధ్యమంటూ... అంతక్రితం సహారా న్యాయవాది చేసినవాడివేడి వాదనకు జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ తీవ్రంగా స్పందించింది. ‘‘డీఫ్రీజ్ కోరుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్లు సమర్పించాలని మేము ఇప్పటికే సూచించాం. అయినా మీరు ఇప్పటికీ ఈ నంబర్లను సమర్పించలేదు. వాటిని సమర్పిస్తే... ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మేము భావిస్తున్నాం’’ అని పేర్కొంది. సుదీర్ఘ సమయం వాదనల అనంతరం డీఫ్రీజ్ చేయాల్సిన అకౌంట్ల నంబర్లు, అలాగే ‘విక్రయించదలచిన’ ఆస్తుల వివరాలను సమర్పించడానికి సహారా న్యాయవాది అంగీకరించారు. కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ కంపెనీలు రెండు రూ.24,000 కోట్ల సమీకరణ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటి పునఃచెల్లింపుల్లో వైఫల్యం వ్యవహారంలో... రాయ్, మరో ఇరువురు డెరైక్టర్లు మార్చి 4 నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో (తీహార్ జైలులో) ఉన్నారు. -
హౌస్ అరెస్ట్ ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో కొనసాగించడానికి బదులు హౌస్ అరెస్ట్ కింద ఉంచాలన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా రెండు సహారా గ్రూప్ కంపెనీలు చిన్న మదుపుదారుల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేయడం... అంత మొత్తాన్ని తిరిగి చెల్లింపుల్లో వైఫల్యత కేసులో రాయ్, మరో ఇరువురు కంపెనీల డెరైక్టర్లు మార్చి 4 నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అసలు రాయ్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని సహారా హెబియస్ కార్పస్ రిట్‌ను సైతం దాఖలు చేసింది. దీనికి సంబంధించి బుధవారం వాదనలు విన్న జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జగ్దీష్ సింగ్ కేహార్‌లతో కూడిన బెంచ్ తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. అంతక్రితం ధర్మాసనం ముం దు రాయ్ తరఫు న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తన వాదనలు వినిపిం చారు. ధర్మాసనం నిర్దేశించిన విధంగా రాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరించడం ఆయన జైలులో ఉండగా సాధ్యమయ్యేపనికాదని వివరించారు. కనీసం వారంపాటైనా హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలన్నారు. తద్వారా ఆయన సహారా ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే అంతర్జాతీయ పార్టీలతో సమావేశం కాగలుగుతారని వివరించారు. ఈ సందర్భంగా రానున్న సెలవు దినాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘అరెస్ట్‌కు మేము ఉత్తర్వులు ఇవ్వలేదు. అదే చేస్తే ఆయనను సాధారణ జైలుకే పంపి ఉండేవాళ్లం. జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చాం. ఆయన మా కస్టడీలో ఉన్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
తీహార్ జైల్లోనే సుబ్రత రాయ్
సహారా గ్రూపు అధినేత సుబ్రత రాయ్‌ని తీహార్ జైల్లోనే ఉంచుతాం తప్ప.. గృహ నిర్బంధానికి పంపేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాయ్ తమ కస్టడీలో ఉన్నారు తప్ప ఆయనను తాము పౌర ఖైదుకు పంపలేదని వ్యాఖ్యానించింది. సుబ్రత రాయ్ జైల్లో ఉన్నందున సుప్రీంకోర్టు చెప్పినంత మొత్తం సేకరించడం కష్టంగా ఉందని, అందువల్ల ఆయనను గృహ నిర్బంధానికి పంపాలని కోరుతూ సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ కోరినప్పుడు సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ వ్యాపార వేత్తలు ఎవరూ జైలుకు వచ్చి బేరాలు చేయడానికి ఇష్టపడరని, అందువల్ల ఇంటికి పంపితే అక్కడ బేరసారాలు కుదుర్చుకుని, కట్టాల్సిన సొమ్ము సేకరించడానికి ప్రయత్నం చేస్తారని రాం జెఠ్మలానీ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఆయన వాదనను తిరస్కరించింది. -
ఇప్పుడు కొంత.. 3 వారాల్లో కొంత
హైదరాబాద్: సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు గురువారం సహారా గ్రూప్ తాజా ప్రతిపాదన తెచ్చింది. తమ చీఫ్ సుబ్రతారాయ్, రెండు గ్రూప్ కంపెనీలకు చెందిన డెరైక్టర్లను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదలకు రూ.10,000 కోట్లు చెల్లించడం తక్షణం కష్టమని పేర్కొంటూనే ఇందుకు బదులుగా మరో తాజా ప్రతిపాదన చేసింది. తక్షణం రూ.2,500 కోట్లు చెల్లిస్తామని, మిగిలిన అంతే మొత్తాన్ని (మరో రూ.2,500 కోట్లు) 21 రోజుల్లో చెల్లిస్తామని పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీగా మరో రూ.5,000 కోట్లు సమకూర్చుకోవడానికి 60-90 రోజుల సమయం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ఇంతక్రితం మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని రాయ్ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ప్రతిపాదనను పిటిషన్ రూపంలో దాఖలు చేయాలని, తదనంతరం దీనిని పరిశీలిస్తామని సహారా తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 9న జరగనుంది. రాయ్ న్యాయవాదుల సమాచారం ప్రకారం రూ. 2,500 కోట్లు చెల్లించిన అనంతరం, స్తంభింపజేసిన కొన్ని అకౌంట్లను తిరిగి డీఫ్రీజ్ చేయడానికి ఆమోదించడంతోపాటు, రాయ్‌ని జైలులో కాకుండా, గృహ నిర్బంధంలో ఉంచడానికీ అనుమతించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనివల్ల బ్యాలెన్స్ డబ్బు సమకూర్చుకోవడానికి వీలవుతుందని విన్నవించినట్లు వెల్లడించారు. ఉత్తర్వులు పాటించేందుకే జైలు...: కాగా అంతకుముందు ఈ కేసుకు సంబంధించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాయ్, అలాగే ఇరువురు డెరైక్టర్లను జైల్లో పెట్టడానికి కారణాన్ని ఈ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు రాధాకృష్ణన్, జగదీష్ సింగ్ కేహార్లు వివరించారు. మదుపరుల నుంచి మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన రూ.24,000 కోట్ల డబ్బు మొత్తం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలన్న తన ఆదేశాలను పాటించేలా చేయడమే తాజా నిర్బంధానికి కారణంగా ధర్మాసనం తెలిపింది. సెబీ ధిక్కార పిటిషన్లకు, ఈ నిర్బంధానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. సెబీ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లు విచారణ దశలోనే ఉన్నాయని పేర్కొంటూ, దీనిపై తీర్పు ఏమిటన్నది విచారణ ముగింపు(ధిక్కరణపై), డబ్బు తిరిగి చెల్లింపుల (మదుపరులకు) అనంతరం వెలువరిస్తామని సూచించింది. ‘2014 ఆగస్టు 31, ఆతర్వాత ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడటమే మార్చి 4న మేము జారీ చేసిన జ్యుడీషియల్ కస్టడీ ఉత్తర్వుల ఉద్దేశం. సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లపై శిక్షకాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.10,000 కోట్ల బెయిల్ బాండ్ విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తూ, వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తంలో ఇది కొంతేనన్న విషయాన్ని సహారా గుర్తెరగాలని బెంచ్ పేర్కొంది. -
తీహార్ జైల్లోనే సుబ్రతారాయ్
ఢిల్లీ: సహారా గ్రూప్ కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 9వ తేది వరకూ వాయిదా వేసింది. అప్పటివరకూ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు తీహార్ జైల్లోనే ఉంటారు. వీరు ముగ్గురూ మార్చి 4 నుంచి జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే పది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. ఇప్పటికిప్పుడు 10 వేల కోట్ల రూపాయలు చెల్లించలేమని సహారా గ్రూప్ సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసింది.తాము తక్షణమే 2.500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించగలమని కోర్టుకు తెలిపారు. మూడు వారాల తర్వాత మరో 2.500 కోట్ల రూపాయలు చెల్లిస్తామని సహారా గ్రూప్ విన్నవించింది. దాంతో ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. -
పదివేల కోట్లంటే కష్టం... 2,500 అయితే...
-
సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసిన సహారా గ్రూప్
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు రూ.10వేల కోట్లు చెల్లించలేమని ఆ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. తక్షణమే రూ.2.500 కోట్లు మాత్రమే చెల్లించగలమని ఈ మేరకు తమ అశక్తతను అత్యున్నత న్యాయస్ధానానికి తెలియజేసింది. మూడు వారాల తర్వాత మరో రూ.2.500 కోట్లు చెల్లిస్తామని సహారా గ్రూప్ గురువారం విన్నవించింది. మార్చి 4వ తేదీ నుంచీ సహారా గ్రూప్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కస్టడీలో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల విడుదలకు రూ.5 వేల కోట్లు కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ.5 వేల కోట్లకు సెబీ మార్చుకోదగిన విధంగా బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని ద్విసభ్య ధర్మాసనం గతనెలలో ఆదేశించింది. దాంతో సుబ్రతారాయ్,రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు మరికొద్దిరోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
రాయ్ విడుదలకు సహారా సిబ్బంది చొరవ
న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమ గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు సహారా గ్రూప్ సిబ్బంది వినూత్న ఆఫర్‌ను తెరముందుకు తెస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం సహారా ఉద్యోగులు, శ్రేయోభిలాషుల నుంచీ కనీసం లక్షకు తక్కువకాకుండా... రూ.2 లక్షలు, రూ. 3 లక్షలు, ఇలా వారివారి సామర్థ్యాన్ని బట్టి డబ్బును సమీకరిస్తారు. కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యం. గ్రూప్‌లో ఎంటర్టైన్మెంట్ నుంచి రిటైల్ బిజినెస్ వరకూ దాదాపు 11 లక్షల మంది వేతన, ఫీల్డ్ కార్మికులు పనిచేస్తున్నట్లు సహారా చెబుతోంది. ఇలా డబ్బు చెల్లించిన వారికి ప్రతిగా సహార్యన్ ఇ-మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్‌లో షేర్లను కేటాయించడం జరుగుతుంది. ఒకపేజీ లెటర్‌పై గ్రూప్ ‘అనుబంధ’ సంస్థలు, సహార్యన్ సొసైటీ డెరైక్టర్లు ఈ మేరకు సంతకం చేస్తూ, సంబంధిత తోడ్పాటు ‘అభ్యర్థన’ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై ఒక సీనియర్ సహారా అధికారిని వివరణ అడిగినప్పుడు ఆయన సమాధానం చెబుతూ, ‘సుబ్రతా రాయ్‌గానీ, లేదా యాజమాన్యం కానీ ఇందుకు సంబంధించి ఎటువంటి లేఖనూ జారీ చేయలేదు. ప్రస్తుత పరిస్థితికి ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన భావోద్వేగ స్పందన మాత్రమే ఇది’ అని అన్నారు. సహారాశ్రీ(గ్రూప్‌లో రాయ్‌ని ఇలా పిలుస్తారు) సంస్థను ఒక పరివార్‌గా లేదా కుటుంబంగా నిర్మించారని, ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రతిపాదన లేఖలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు. మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా 2 గ్రూప్ కంపెనీలు మదుపరుల నుంచి రూ.25 వేల కోట్లు సమీకరించాయన్నది ఈ వ్యవహారంలో ప్రధాన అంశం. ఈ డబ్బు పునఃచెల్లింపుల్లో విఫలమవుతున్నందుకుగాను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాల మేరకు రాయ్‌సహా రెండు కంపెనీల డెరైక్టర్లు ఇరువురు మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. వీరి తాత్కాలిక బెయిల్‌కుగాను రూ.5 వేల కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ. 5వేల కోట్లు సెబీ పేరుతో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ధర్మాసనం నిర్దేశించింది. ఇంత మొత్తం చెల్లించలేమని సహారా గురువారం ధర్మాసనానికి విన్నవించింది. ఇలాంటి రూలింగ్ తప్పని, రాయ్‌ని జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని గ్రూప్ దాఖలు చేసిన రిట్‌పై వాదనలు ఏప్రిల్ 3కు వాయిదా పడ్డాయి.