అమ్మకానికి సహారా గ్రాస్‌వీనర్ హౌస్ | sahara grossvener house for sala | Sakshi
Sakshi News home page

అమ్మకానికి సహారా గ్రాస్‌వీనర్ హౌస్

Published Wed, Mar 4 2015 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

అమ్మకానికి సహారా గ్రాస్‌వీనర్ హౌస్

అమ్మకానికి సహారా గ్రాస్‌వీనర్ హౌస్

లండన్: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కొన్నాళ్ల క్రితం సహారా గ్రూప్ లండన్‌లో కొనుగోలు చేసిన గ్రాస్‌వీనర్ హౌస్ హోటల్‌ను రుణదాతలు అమ్మకానికి పెట్టారు. దీని విలువ దాదాపు 500 మిలియన్ పౌండ్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఉంటుందని అంచనా. సహారా గ్రూప్‌నకు విదేశాల్లో గ్రాస్‌వీనర్ హౌస్‌తో పాటు ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్ పేరిట మరో రెండు హోటల్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్టర్లకు చెల్లింపుల కేసుకు సంబంధించి అరెస్టయిన గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ .. బెయిల్ కోసం కావాల్సిన నిధులను ఈ హోటల్స్‌పై రుణం కింద తెచ్చుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

గ్రాస్‌వీనర్  హౌస్‌పై తీసుకున్న రుణాలను సహారా సమయానికి తిరిగి చెల్లించకపోవడంతో దీని విక్రయ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ను రుణదాతలు ఎంపిక చేసినట్లు బ్రిటన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రియల్టీ కన్సల్టెన్సీ దిగ్గజం జోన్స్ లాంగ్ లాసల్ (జేఎల్‌ఎల్) దీనికి కొనుగోలుదారును అన్వేషించనుంది.
 
2010-2012 మధ్య కాలంలో సహారా గ్రూప్.. గ్రాస్‌వీనర్ హౌస్, ప్లాజా, డ్రీమ్ డౌన్‌టౌన్  హోటళ్లను 1.55 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం రియల్టీ రేట్లు పెరిగిన నేపథ్యంలో వీటి విలువ 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. వీటి కొనుగోలు కోసం బ్యాంక్ ఆఫ్ చైనా వద్ద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు అమెరికాకు చెందిన మిరాచ్ క్యాపిటల్ దగ్గర్నుంచి కొత్తగా రుణం తీసుకునేందుకు సహారా ప్రయత్నించినా అది సాధ్యపడలేదు.
 
గ్రాస్‌వీనర్ హౌస్ కథ ఇదీ..
 ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సర్ ఎడ్వర్డ్ ల్యుటెన్స్ డిజైన్ చేసిన లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ గ్రాస్‌వీనర్ హౌస్‌ను 1929లో నిర్మించారు. అంతర్గతంగా 56,700 చ.మీ. మేర విస్తరించిన ఈ హోటల్‌లో 74 సూట్స్ సహా మొత్తం 494 రూమ్స్ ఉన్నాయి. యూరప్‌లోనే అతి పెద్ద ఫైవ్‌స్టార్ బాల్‌రూమ్ ఇందులో ఉంది. అలాగే పేరొందిన పలు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2008లో దాదాపు రూ. 1,300 కోట్లతో దీనికి కొత్త హంగులు అద్దారు. దీన్ని ప్రస్తుతం జేడబ్ల్యూ మారియట్ నిర్వహిస్తోంది. 2010లో దీని కొనుగోలుకు సహారా గ్రూప్ 470 మిలియన్ పౌండ్లు వెచ్చించింది. అప్పట్లో ఇది అత్యంత భారీ డీల్. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ చైనా రుణాలను తిరిగి చెల్లించగలమని సహారా గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. సాంకేతికాంశాలే సమస్యకు కారణమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement