సహారా గ్రూపు ఫౌండర్ చైర్మన్ సుబ్రతా రాయ్ మరణంతో, సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంగతి, వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయనే ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ క్లారిటీ ఇచ్చింది. చట్టపరమైన చర్యలు, విచారణ వ్యక్తిపై కాదని, గ్రూపుపై అని, ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ గురువారం స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా దర్యాప్తు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ FICCI నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ సందర్భంగా బుచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు రీఫండ్ చేయాల్సింన మొత్తం రూ. 25,000 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, మార్చి 31 నాటికి సెబీ మొత్తం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్ చేసింది. పెట్టుబడి రుజువుతో ముందుకు వస్తున్న వారికి చెల్లింపులు జరిగాయని ఆమె చెప్పారు.
కాగా సెబీ-సహారా కేసులో మద్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతోంది. ఈ కేసులో రెండు సహారా గ్రూప్ సంస్థలు– సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారనేది అభియోగం.
సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ జారీ చేసిన హౌసింగ్ బాండ్ల వ్యత్యాసాలను చార్టర్డ్ అకౌంటెంట్ రోషన్ లాల్ ఫిర్యాదుతో సహారా గ్రూప్ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై 2008లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ విచారణ తర్వాత సుబ్రతా రాయ్ కూడా జైలు పాలయ్యారు సహారా కన్వర్టబుల్ డిబెంచర్లు (OFCDలు) జారీ ద్వారా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. సుమారు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుండి సేకరించిన ఈ నిధులను తిరిగి చెల్లించాలని సహారా గ్రూప్ సంస్థలైన SIREL, SHICLలకు 2011లో సెబీ ఆదేశించింది. ఆగస్టు 31, 2012న, సెబీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, సేకరించిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment