సహారా మ్యూచువల్ ఫండ్ లెసైన్స్ రద్దు
సెబీ కీలక నిర్ణయం
ఫండ్ వ్యాపారానికి సంస్థ తగదని వ్యాఖ్య
{పస్తుత ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం
ముంబై : సహారా గ్రూప్‌కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మంగళవారం మరో షాక్ ఇచ్చింది. ఆ సంస్థ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) లెసైన్సును రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఈ వ్యాపారం చేయడానికి సహారాకు తగినంత పటిష్ఠత లేదని పేర్కొంది. మరో ఫండ్ హౌస్‌కు సహారా మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్‌ను (కార్యకలాపాలను) బదిలీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ మేరకు 22 పేజీల ఉత్తర్వును వెలువరించింది. సహారా పోర్టిఫోలియో మేనేజ్‌మెంట్ లెసైన్స్‌ను కూడా ఇటీవల సెబీ రద్దు చేసింది.
సహారాకు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.24,000 కోట్లు వసూలు చేయడం, వాటిని తిరిగి చెల్లించడంలో వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ కేసుల్లో ప్రస్తుతం ఆ సంస్థ చీఫ్ సుబ్రతారాయ్ తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో రూలింగ్ ఇవ్వగా దాన్ని సంస్థ ఇప్పటికీ చెల్లించలేకపోతోంది.
సేవల తక్షణ నిలుపుదల...
తన ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. ఇప్పటినుంచీ సహారా మ్యూచువల్ ఫండ్, సహారా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రస్తుత లేదా తాజా మదుపరుల నుంచి ఫండ్‌కు సంబంధించి డబ్బులు తీసుకోరాదని పేర్కొంది. దీనితోపాటు సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ (సహారా స్పాన్సర్), సహారా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల (సహారా ఏఎంసీ) కార్యకలాపాలను వీలైనంత త్వరలో కొత్త స్పాన్సర్‌కూ, సెబీ ఆమోదిత అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి బదలాయించాలని సహారా ఎం ఎఫ్‌ను సెబీ ఆదేశించింది.
వచ్చే ఆరు నెలల్లో సహారా లెసైన్స్ పూర్తిగా స్తంభించిపోతుందని పేర్కొంటూ... ఈ లోగా యూనిట్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలన్నీ తీసుకోవాలని సహారా ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ఆదేశించింది. రానున్న ఐదు నెలల్లో ఫండ్ బదలాయింపు ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లేదంటే మరో 30 రోజుల్లో సంస్థే ఇన్వెస్టర్లకు కేటాయించిన యూని ట్లను తప్పనిసరిగా అమ్మేసి, ఎటువంటి అదనపు వ్యయం లేకుండా ఆయా ఫండ్ విలువను ఇన్వెస్టర్లకు చెల్లించాలని స్పష్టం చేసింది.