రాయ్ విడుదలకు సహారా సిబ్బంది చొరవ
న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమ గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ విడుదలకు సహారా గ్రూప్ సిబ్బంది వినూత్న ఆఫర్‌ను తెరముందుకు తెస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం సహారా ఉద్యోగులు, శ్రేయోభిలాషుల నుంచీ కనీసం లక్షకు తక్కువకాకుండా... రూ.2 లక్షలు, రూ. 3 లక్షలు, ఇలా వారివారి సామర్థ్యాన్ని బట్టి డబ్బును సమీకరిస్తారు. కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలన్నది ఈ ప్రతిపాదన లక్ష్యం.
గ్రూప్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి రిటైల్ బిజినెస్ వరకూ దాదాపు 11 లక్షల మంది వేతన, ఫీల్డ్ కార్మికులు పనిచేస్తున్నట్లు సహారా చెబుతోంది. ఇలా డబ్బు చెల్లించిన వారికి ప్రతిగా సహార్యన్ ఇ-మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్‌లో షేర్లను కేటాయించడం జరుగుతుంది. ఒకపేజీ లెటర్‌పై గ్రూప్ ‘అనుబంధ’ సంస్థలు, సహార్యన్ సొసైటీ డెరైక్టర్లు ఈ మేరకు సంతకం చేస్తూ, సంబంధిత తోడ్పాటు ‘అభ్యర్థన’ చేసినట్లు సమాచారం.
ఈ అంశంపై ఒక సీనియర్ సహారా అధికారిని వివరణ అడిగినప్పుడు ఆయన సమాధానం చెబుతూ, ‘సుబ్రతా రాయ్‌గానీ, లేదా యాజమాన్యం కానీ ఇందుకు సంబంధించి ఎటువంటి లేఖనూ జారీ చేయలేదు. ప్రస్తుత పరిస్థితికి ఆయా వ్యక్తుల నుంచి వచ్చిన భావోద్వేగ స్పందన మాత్రమే ఇది’ అని అన్నారు. సహారాశ్రీ(గ్రూప్‌లో రాయ్‌ని ఇలా పిలుస్తారు) సంస్థను ఒక పరివార్‌గా లేదా కుటుంబంగా నిర్మించారని, ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రతిపాదన లేఖలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు.
మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా 2 గ్రూప్ కంపెనీలు మదుపరుల నుంచి రూ.25 వేల కోట్లు సమీకరించాయన్నది ఈ వ్యవహారంలో ప్రధాన అంశం. ఈ డబ్బు పునఃచెల్లింపుల్లో విఫలమవుతున్నందుకుగాను సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాల మేరకు రాయ్‌సహా రెండు కంపెనీల డెరైక్టర్లు ఇరువురు మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. వీరి తాత్కాలిక బెయిల్‌కుగాను రూ.5 వేల కోట్లను కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ. 5వేల కోట్లు సెబీ పేరుతో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ధర్మాసనం నిర్దేశించింది. ఇంత మొత్తం చెల్లించలేమని సహారా గురువారం ధర్మాసనానికి విన్నవించింది. ఇలాంటి రూలింగ్ తప్పని, రాయ్‌ని జైలులో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని గ్రూప్ దాఖలు చేసిన రిట్‌పై వాదనలు ఏప్రిల్ 3కు వాయిదా పడ్డాయి.