దాగుడు మూతలాట... | Sahara Group asked to submit title deeds worth Rs 20,000 crore as guarantee | Sakshi

దాగుడు మూతలాట...

Oct 29 2013 1:11 AM | Updated on Sep 2 2018 5:20 PM

దాగుడు మూతలాట... - Sakshi

దాగుడు మూతలాట...

సహారా గ్రూప్ దాగుడు మూతల ఆట ఆడుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకెంతమాత్రం గ్రూప్‌ను నమ్మలేమని సైతం పేర్కొంది.

 న్యూఢిల్లీ: సహారా గ్రూప్ దాగుడు మూతల ఆట ఆడుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకెంతమాత్రం గ్రూప్‌ను నమ్మలేమని సైతం పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా ఆ గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు సమీకరించి న నిధులను తిరిగి చెల్లించడంలో భాగంగా రూ.20,000 కోట్ల విలువకు సమానమైన ఆస్తుల టైటిల్ డీడ్స్‌ను సెబీకి ఇవ్వాలని స్పష్టం చేసింది. అలా చేయకపోతే గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ దేశం విడిచి వెళ్లలేరని కూడా స్పష్టం చేసింది. టైటిల్ డీడ్స్ ఆస్తు ల విలువను నిర్ధారించే రిపోర్టులను కూడా మార్కెట్ రెగ్యులేటర్‌కు ఇవ్వాలని ఉద్ఘాటించింది. ఈ మేరకు జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ కేల్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం సహారా గ్రూప్‌కు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు రూ.19,000 కోట్ల నిధుల చెల్లింపుల్లో విఫలం కావడంపై సహారా గ్రూప్‌పై సెబీ దాఖలు చేసిన మూడు కోర్టు ధిక్కార పిటిషన్లపై కోర్టులో సోమవారం ఈ మేరకు వాదోపవాదనలు జరిగాయి.
 
 నవంబర్ 20కి వాయిదా: మూడు వారాల్లో తన ఆదేశాలను గ్రూప్ అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. అంతకుముందు విచారణ సందర్భంగా రాయ్ న్యాయవాది సీఏ సుందరం అత్యున్నత న్యాయస్థానానికి తన వాదనలు వినిపిస్తూ, విదేశాలకు వెళ్లకుండా రాయ్‌ని నియంత్రిస్తే- అది ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని, వ్యాపారం దెబ్బతింటుందని వివరించారు. అలాగైతే మూడు వారాల్లో తమ ఆదేశాలను నిర్వర్తించాలని డివిజన్ బెంచ్ సూచించింది. ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని, దీని నుంచి సహారా గ్రూప్ తప్పించుకోజాలదని స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల డబ్బు తిరిగి చెల్లించినట్లైతే, గ్రూప్ ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలక్కుండా చూడ్డం జరుగుతుందని వివరించింది.  కేసు తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు రాయ్ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, నగదు రూపంలో రూ.20,000 కోట్లు చెల్లించడం గ్రూప్‌కు సాధ్యం కాదని బెంచ్‌కు వివరించారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే- నగదుకు సమానమైన ఆస్తుల టైటిల్ డీడ్స్ సెబీకి అందజేయడానికి సిద్ధమని వివరించారు. అయితే సెబీ సైతం టైటిల్ డీడ్స్ స్వీకరణకు కొంత వ్యతిరేకత వెలిబుచ్చింది. ఆస్తుల విలువను నిర్ధారించడం కష్టమని తెలిపింది. దీనితో  ఆస్తుల విలువను నిర్ధారించే రిపోర్టులను కూడా మార్కెట్ రెగ్యులేటర్‌కు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.
 
 పూర్వాపరాలు: సహారా గ్రూపులు రెండు- ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్టీ), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్) మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం.  ఈ కేసులో గత ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పెంచింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్ల తక్షణం చెల్లించాలని, రూ.10,000 కోట్లను జనవరి మొదటి వారంకల్లా చెల్లించాలని, మిగిలిన సొమ్మును ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా- ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమయ్యింది. కోర్టులో సెబీ ధిక్కరణ పిటిషన్లను ఎదుర్కొంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement