సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
సహారా అధినేతకు సుప్రీంకోర్టు వార్నింగ్
Published Thu, Apr 27 2017 3:56 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జూన్ 15 కల్లా 2500 కోట్ల రూపాయలు సెబీ-సహారా అకౌంట్లో జమచేయాలని ఆదేశించింది. లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. జూన్ 15 వరకు సెబీ అకౌంట్లో డబ్బులు జమచేసేందుకు రెండు చెక్ లను ఇస్తానని సుప్రీంకోర్టుకు హాజరైన సుబ్రతారాయ్ చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు వార్నింగ్ ఇచ్చింది. చెక్ లు క్లియర్ కాకపోతే, మళ్లీ తిహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని జడ్జీలు పేర్కొన్నారు. సహారా గ్రూప్ కు చెందిన రెండు సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా 25వేల కోట్ల మేర వసూలు చేసి, వాటిని తిరిగి ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో వైఫల్యం చెందడంతో అధినేత సుబ్రతారామ్ 2014 లో తీహార్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది.
ఆ తర్వాత తన తల్లి చనిపోయినప్పుడు పెరోల్ మీద బయటికి వచ్చిన సుబ్రతారాయ్, అప్పటినుంచి తన పెరోల్ ను పొడిగించుకుంటూ వెళ్తున్నారు. సహారాకు చెందిన మహారాష్ట్రలోని లగ్జరీ అంబీ వ్యాలీ టైన్ షిప్ ను వేలం వేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలపై సుబ్రతారాయ్ న్యాయవాది, మాజీ మంత్రి కపిల్ సిబాల్ వాదించారు. ఇది 10వేల ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి ఉందని, దీని విలువ 34వేల కోట్ల మేర ఉంటుందని తెలిపారు. సెబీకి బాకీ పడిన దానికంటే దీని విలువే ఎక్కువని చెప్పారు. అయితే ఈ వేలాన్ని మరోసారి సమీక్షించాలనే కపిల్ సిబాల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ సందర్భంగా జూన్ 19న తమ ముందు హాజరుకావాలని సుబ్రతారాయ్ ను సుప్రీం ఆదేశించింది. సహారా ఇప్పటికే దేశీయంగా, విదేశాల్లో ఉన్న ఆస్తులను అమ్మడానికి ప్రయత్నిస్తోంది.
Advertisement