మీపై నమ్మకం కోల్పోయాం
♦ రూ.12వేల కోట్లను ఎప్పటిలోగా చెల్లిస్తారు?
♦ రోడ్‌మ్యాప్ ప్రకటించండి సహారాకు సుప్రీం ఆదేశం
♦ రాయ్, మరో ఇద్దరి బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్, గ్రూపు డెరైక్టర్‌లు అశోక్‌రాయ్ చౌదరి, రవిశంకర్‌దూబే పెరోల్‌ను సుప్రీంకోర్టు అక్టోబర్ 24 వరకు పొడిగించింది. రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వచ్చే విచారణ తేదీలోగా చెల్లించడంలో విఫలమైతే రాయ్‌తోపాటు మరో ఇద్దరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్ ముందుకు బుధవారం సహారా కేసు విచారణకు వచ్చింది. సహారా తరఫున కపిల్ సిబల్, సెబీ తరఫున అరవింద్ దత్తార్ వాదనలు వినిపించారు. మిగిలిన నగదు మొత్తాన్ని సెబీకి చెల్లించేందుకు రాయ్‌కు ఏడాదిన్నర సమయం ఇవ్వాలని కపిల్ సిబల్ వాదించారు.
ఎలాంటి షరతులు విధించవద్దని కోరారు. షరతుల మధ్య ఆస్తుల విక్రయం సాధ్యం కాదన్నారు. స్పందించిన ధర్మాసనం రాయ్‌ను ఆస్తులు విక్రయించకుండా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించింది. సెబీ సైతం ఈ విషయంలో స్వేచ్ఛ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ‘సహారా సెబీకి గతంలో సమర్పించిన 60 ఆస్తుల చిట్టాలో 47 ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసిన విషయాన్ని వెల్లడించలేదు. మీపై నమ్మకం కోల్పోయాం.
రూ.12 వేల కోట్ల మిగతా బకాయిలను ఏ విధంగా, ఎప్పటిలోగా చెల్లిస్తారన్న దానిపై నిర్మాణాత్మక ప్రతిపాదన/రోడ్‌మ్యాప్‌ను అఫిడవిట్ రూపంలో ఇవ్వండి’ అని ధర్మాసనం సహారాను ఆదేశించింది. అంతకు ముందు సెబీ తరఫున దత్తార్ వాదిస్తూ వడ్డీతో కలుపుకుని సహారా సెబీకి రూ.37వేల కోట్లను చెల్లించాల్సి ఉందని, ఇందులో అసలు మొత్తం రూ.24వేల కోట్లు అని తెలిపారు. ఇన్వెస్టర్ల నుంచి రూ.24,029 కోట్లను సహారా సేకరించగా... ఇప్పటి వరకు రూ.10,918 కోట్లు చెల్లించినట్టు వివరించారు.