మరోసారి ఇలాంటి తప్పు చేయను
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ క్షమాపణ చెప్పారు. తన పెరోల్ను తిరస్కరించడాన్ని పునఃసమీక్షించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. పెరోల్ను రద్దుచేస్తూ, వెంటనే తనను జైలుకు తరలించాల్సిందిగా సుప్రీం చేసిన ఆదేశాలను కూడా రీకాల్ చేయాలని అభ్యర్థించారు. సుబ్రతా రాయ్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్, బెంచ్ అధినేత జస్టిస్ టీఎస్ థాకూర్కు ఈ విషయం వెల్లడించారు. ఉన్నత న్యాయస్థానాన్ని క్షమాపణ కోరుతున్నా, మరోసారి ఇలాంటి తప్పులు జరుగదనే హామీని ఇస్తున్నాననే సుబ్రతారాయ్ క్షమాపణను కపిల్ సిబాల్ జస్టిస్ థాకూర్కు తెలిపారు.. న్యాయస్థానాలు ఇలాంటి విషయాలను ఉపేక్షించవు, దేనికైనా ఓ పరిమితి ఉంటుందని సుబ్రతా రాయ్పై జస్టిస్ థాకూర్ సీరియస్ అయ్యారు.
రాయ్ అప్లికేషన్ను విచారించడానికి జస్టిస్ అనిల్ ఆర్.ధావే, జస్టిస్ ఏకే. సిక్రీతో సంప్రదింపులు చేస్తానని తెలిపారు. తల్లి మరణంతో మావనీయ కోణంలో ఈ ఏడాది మే6న నాలుగువారాల పెరోల్ను సుప్రీంకోర్టు మంజూరుచేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సిన మొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతుతో ఆగస్టు 3న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత నేటివరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెరోల్ కేసు విచారణ సందర్భంగా సహారా న్యాయవాది, సుప్రీం న్యాయవాది వాదోపవాదాల అనంతరం సుబ్రతాను జైలుకు తరలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఆదేశాలపై మరోసారి పునఃసమీక్షించాలని సుబ్రతా కోరుతున్నారు.