
మాస్కో: కజకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం అజెర్‌బైజాన్ అధ్యక్షుడు ఇలాహ్మ్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారు. అది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో ల్యాండవ్వాల్సిన విమానం బుధవారం అనూహ్యంగా కుప్పకూలి 38 మంది మరణించడం తెలిసిందే. దీనికి రష్యా గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి కారణమంటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్ క్షమాపణ చెప్పడం గమనార్హం.
అయితే, విమాన ప్రమాదానికి బాధ్యత తమదేనంటూ ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంగీకరించలేదు. ‘అజెర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్రోజ్నీ విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు పదేపదే ప్రయత్నించడంతో గగనతల రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి’ అని అంతకుముందు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ కాల్పుల వల్లే విమానం కూలిందంటూ వేరుగా అందులో పేర్కొనలేదు. రష్యా గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్న కారణంగా అధ్యక్షుడు పుతిన్ అజెర్‌బైజాన్ ప్రెసిడెంట్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారని క్రెమ్లిన్
వివరించింది. దీనిని అజెర్‌బైజాన్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.