Ilham Aliyev
-
విమాన ప్రమాదంపై పుతిన్ ‘సారీ’
మాస్కో: కజకిస్తాన్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం అజెర్బైజాన్ అధ్యక్షుడు ఇలాహ్మ్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారు. అది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో ల్యాండవ్వాల్సిన విమానం బుధవారం అనూహ్యంగా కుప్పకూలి 38 మంది మరణించడం తెలిసిందే. దీనికి రష్యా గగనతల రక్షణ వ్యవస్థలోని క్షిపణి కారణమంటూ ఆరోపణలు వస్తున్న వేళ పుతిన్ క్షమాపణ చెప్పడం గమనార్హం. అయితే, విమాన ప్రమాదానికి బాధ్యత తమదేనంటూ ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అంగీకరించలేదు. ‘అజెర్బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్రోజ్నీ విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు పదేపదే ప్రయత్నించడంతో గగనతల రక్షణ వ్యవస్థలు కాల్పులు జరిపాయి’ అని అంతకుముందు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ కాల్పుల వల్లే విమానం కూలిందంటూ వేరుగా అందులో పేర్కొనలేదు. రష్యా గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్న కారణంగా అధ్యక్షుడు పుతిన్ అజెర్బైజాన్ ప్రెసిడెంట్ అలియేవ్‌కు క్షమాపణ చెప్పారని క్రెమ్లిన్ వివరించింది. దీనిని అజెర్బైజాన్ అధ్యక్షుడి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. -
అధ్యక్షుడి భార్యే ఉపాధ్యక్షురాలు!!
భార్యను ఇంతకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్లు బహుశా ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరేమో. అజర్బైజాన్ అధ్యక్షుడు తన భార్యను ఆ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా నియమించేశారు. తన భార్య మెహ్రిబన్ (52)కు ఈ స్థానం కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్ (55) ప్రకటించారు. ఇందుకోసం ముందుగా ఆయన గత సెప్టెంబర్ నెలలో ఒక రాజ్యాంగ రిఫరెండం కూడా నిర్వహించారు. 19 ఏళ్ల వయసులోనే అలియెవ్ను పెళ్లి చేసుకున్న మెహ్రిబన్.. మెడికల్ యూనివర్సిటీ నుంచి వైద్యపట్టా పొందారు. ఇంతకుముందు కూడా ఆమె ప్రజాప్రతినిధిగా పనిచేశారు, ఒక చారిటీ సంస్థకు నేతృత్వం వహించారు. ఒకవేళ అధ్యక్షుడు విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉంటే.. రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇది కాక ఉపాధ్యక్షులు ఏం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. కానీ, కేబినెట్‌ను పర్యవేక్షించడం లాంటి బాధ్యతలు ఉంటాయని అనుకుంటున్నారు. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన రిఫరెండం తర్వాత అధ్యక్షుడి పదవీ కాలాన్ని కూడా ఐదు నుంచి ఏడేళ్లకు పెంచారు. 2003 వరకు అలియెవ్ తండ్రి అజర్‌బైజాన్‌కు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన నుంచి ఈయన పగ్గాలు అందుకున్నారు. అలియెవ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.