సహారా చీఫ్ కు మరింత ఊరట!
♦ జూలై 11 వరకూ పెరోల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు
♦ సెబీకి రూ. 200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం...
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో మరింత ఊరట లభించింది. తల్లి మరణం కారణంగా అంతిమ సంస్కారాలకు హాజరయ్యేందుకు వీలుకల్పిస్తూ చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం నాలుగు వారాలపాటు పెరోల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాయ్‌తో పాటు గ్రూప్ డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరిలు ఈ నెల 6న జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఈ పెరోల్‌ను జూలై 11 వరకూ పొడిగించేందుకు కోర్టు బుధవారం అంగీకరించింది.
అయితే, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి రాయ్, చౌదరిలు రూ.200 కోట్లు చెల్లించేందుకు వీలుగా ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. సహారా గ్రూప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా డిపాజిట్లు సమీకరించిన కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సుబ్రతా రాయ్ 2014 మార్చి నుంచి తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, జూలై 11కల్లా రూ200 కోట్లు గనుక డిపాజిట్ చేయకపోతే మళ్లీ తీహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది.
పెరోల్‌పై బయట ఉన్న సమయంలో రాయ్, చౌదరిలు సహారా ఆస్తుల అమ్మకానికి వీలుగా ఔత్సాహిక కొనుగోలుదార్లను కలవొచ్చని సుప్రీం పేర్కొంది. అయితే, దేశంలోపలే ఉండటంతో పాటు పోలీస్ ఎస్కార్ట్‌లోనే ఎక్కడికైనా వెళ్లాలని స్పష్టం చేసింది. మరోపక్క, సహారా ఆస్తుల వేలానికి సంబంధించి సెబీ తన చర్యలను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీగా చెల్లించాల్సిన రూ.5,000 కోట్లు, బెయిల్ కోసం అదనంగా కట్టాల్సిన రూ.5,000 కోట్లను సమీకరించేందుకుగాను సహారా ఇతర ఆస్తుల అమ్మకం ప్రక్రియను చేపట్టవచ్చని సుప్రీం సూచించింది.