
సహారా సుబ్రతా మరికొన్నాళ్లు జైల్లోనే
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నిధుల చెల్లింపు వివాదం కేసులో సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్‌కి సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం చేపట్టాల్సిన విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఇందుకు గల కారణాలు వెల్లడి కాకపోయినప్పటికీ.. చెల్లింపులకు సంబంధించి సహారా నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ సమర్పించలేకపోవడమే దీనికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిణామంతో సుబ్రతా రాయ్ మరికొన్నాళ్లు జైల్లో గడపాల్సి రానుంది. ఈ నేపథ్యంలో సంబంధిత బెంచ్ ముందు సహారా గ్రూప్ ఈ అంశాన్ని ప్రస్తావించి, విచారణ తేదిని సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సముచిత ప్రతిపాదనతో మార్చి 11న (మంగళవారం) రావాలంటూ ఈ నెల 7న విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సోమవారం సుప్రీం కోర్టు వెబ్‌సైటులో ఉంచిన వివరాల ప్రకారం కేసును వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రూ. 20,000 కోట్ల పైచిలుకు చెల్లింపులకు సంబంధించి మార్చి 4న సుబ్రతా రాయ్‌తో పాటు మరో ఇద్దరు డెరైక్టర్లను సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.