జహంగీర్ టాటా, రతన్ టాటా, లలిత్ మోడీ, వీజీ సిద్ధార్థ, సుబ్రతా రాయ్, శ్రీకాంత్ బొల్లా
వ్యాపారం చేశారు... విజయాలు సాధించారు...
కొందరు వివాదాల్లోనూ చిక్కుకున్నారు.
ఈ వ్యాపారవేత్తల జీవితాల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.
ప్రస్తుతం కొందరు విజయవంతమైన వ్యాపారవేత్తల ‘బయోపిక్’కి హిందీలో సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ రియల్ బిజినెస్‌మెన్ లైఫ్‌తో బాక్సాఫీస్ బిజినెస్ షురూ చేస్తున్నారు సినీ బిజినెస్‌మెన్ అయిన నిర్మాతలు.
ఇక ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం.
మూడు తరాల టాటా కథ
టాటా గ్రూపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశపు అతి పెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్ షెడ్జీ టాటా. జమ్ షెడ్జీ తర్వాత ఆ కుటుంబానికి చెందిన వారసులు బాధ్యతలు చేపట్టారు. వారిలో రతన్ టాటా ఒకరు. దేశంలో పేరున్న ఈ కుటుంబంపై సినిమా నిర్మించడానికి టీ సిరీస్ భూషణ్‌కుమార్ హక్కులు పొందారు. ‘ది టాటాస్’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. టాటా కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యాపారవేత్తల కథతో ఈ సినిమా ఉంటుంది. ‘ది టాటాస్, హౌ ఎ ఫ్యామిలీ బిల్ట్ ఎ బిజినెస్ అండ్ ఎ నేషన్’ నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంకా ఈ చిత్రానికి నటీనటులు, దర్శకుడి ఎంపిక జరగలేదు.
కాఫీ కింగ్
కేఫ్ కాఫీ డే వ్యవస్థాకుడు వీజీ సిద్ధార్థ జీవితం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో సిద్ధార్థ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యాపారంలో విజయవంతంగా దూసుకెళుతున్న ఆయన అనూహ్యంగా నదిలో శవం అయి తేలడం వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుంది. ‘కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్థ’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.
హిందీలో అక్షయ్‌కుమార్
ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరరై పోట్రు’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధ. రీమేక్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కాగా సౌత్‌లో ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించిన సూర్య రీమేక్‌ని కూడా నిర్మించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకి ఇది తొలి చిత్రం అవుతుంది.
విజయాలు.. వివాదాలతో...
విజయాలు, వివాదాలతో వార్తల్లో నిలిచిన సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ బయోపిక్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు కానీ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్, రచయితగా గుల్జార్ వ్యవహరించనున్నారు. ‘దిల్ సే, గురు, యువరాజ్, స్లమ్‌డాగ్ మిలియనీర్’ వంటి చిత్రాలకు రెహమాన్, గుల్జార్ పని చేశారు. గుల్జార్ లాంటి అద్భుత రచయితతో మళ్లీ కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉందని రెహమాన్ పేర్కొన్నారు.
లలిత్ లైఫ్‌తో...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవిత విశేషాలతో సినిమా రూపొందనుంది. ఐపీఎల్‌తో క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లలిత్ మోడీ జీవితంపై వచ్చిన ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వార్త వచ్చింది. అయితే ఈ వార్త నిజం కాదని లలిత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘ఏదో పుస్తకం ఆధారంగా నాపై సినిమా తీస్తున్నారని విని ఆశ్చర్యపోయాను. దానికి, నాకూ ఎలాంటి సంబంధం లేదు. నా బయోపిక్ గురించి నేను స్వయంగా ప్రకటిస్తాను’’ అని లలిత్ పేర్కొన్నారు.
విజయంతో వెలుగులోకి...
ప్రముఖ అంధ పారిశ్రామిక వేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం వెండితెరకు రానుంది. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఎన్నో ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. చూపు లేకపోయినా విజయంతో వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్ జీవితం ఆధారంగా దర్శకురాలు తుషార్ హిద్రానీ సినిమా తెరకెక్కించనున్నారు. శ్రీకాంత్ బొల్లా పాత్రను రాజ్‌కుమార్ రావ్ పోషించనున్నారు.
ఇవే కాదు.. మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తల బయోపిక్స్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా స్ఫూర్తిగా నిలిచే వ్యాపారవేత్తల జీవిత చిత్రాలంటే ఇంకా ఉంటుంది. అందుకే దర్శక–నిర్మాతలు రియల్ బిజినెస్‌మెన్ జీవితాలను రీల్‌పై ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment