
రూ.10కోట్లే లేనప్పుడు 30 కోట్లు ఎలా చెల్లిస్తారు?
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు సంబంధించి రూ.10,000 కోట్ల సమీకరణకు సహారా ముప్పతిప్పలు పడుతోంది. ఈ డబ్బులు చెల్లించేందుకు న్యాయస్థానాన్ని మరో ఆరువారాల గడువు కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 10,000 కోట్ల రూపాయలు చెల్లించడానికే ఇబ్బంది పడుతున్న మీరు ఇన్వెస్టర్లకు 30,000 వేల కోట్లు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించింది.
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కారణ పిటిషన్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుండి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమవడంతో సుబ్రతా రాయ్ జైలు పాలయ్యారు. జైలులోనే ఉండి ఆస్తులు అమ్ముకోవడానికి ఆయనకు ధర్మాసనం అనుమతినిచ్చింది.