
సహారా కేసులో మలుపు
న్యూఢిల్లీ: సహారా కేసులో హఠాత్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ జేఎస్ కేహార్ తప్పుకున్నారు. సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ రాకేష్ శర్మ ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. దీనిప్రకారం ఇకపై ఈ కేసు విచారణ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుపుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ జేఎస్ కేహార్ మే 6న ఒక సమాచారం పంపారు.
ఇది మే 7న చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చింది. దీనితో కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ కొత్త బెంచ్‌లో న్యాయమూర్తులు ఎవరనే విషయంపై మాత్రం వివరాలను తాజా ప్రకటన తెలియజేయలేదు. ఈ కేసును విచారిస్తున్న ద్విసభ్య ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మే 14న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, మరో న్యాయమూర్తి సైతం సహారా విచారణ ప్రక్రియ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తీవ్ర ఒత్తిడి...!
తనను నిర్బంధించడం అక్రమం, అన్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగులో ఉండగానే తనను జ్యుడీషియల్ కస్టడీకి ఎలా పంపుతారని సహారా చీఫ్ సుబ్రతారాయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తులు రాధాకృష్ణన్, కేహార్‌లు మే 6వ తేదీన బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజు ఈ కేసు విచారణ నుంచి ఇకపై తప్పుకుంటున్నట్లు జస్టిస్ కేహార్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు సమాచారం పంపడం విశేషం.
నిర్బంధానికి సంబంధించి ఇచ్చిన రూలింగ్‌ను తప్పుబడుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులే ఎలా విచారిస్తారని సైతం సహారా చీఫ్ సుబ్రతారాయ్ తరఫు న్యాయవాది రామ్‌జత్మలానీ అంతక్రితం వాదించడం ఇక్కడ ప్రస్తావనాంశం. ఈ అంశంపై రూలింగ్ ఇచ్చిన సందర్భంగా న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సహారా కేసులో బెంచ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.