
బాకీ కడితేనే బెయిల్
న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాల ఆరోపణలతో తీహార్ జైల్లో గడుపుతున్న సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ కు మరోసారి ఎదురు దెబ్బతగిలింది. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడంలో విఫలమవ్వడంతో సుబ్రతో రాయ్ కు బెయిల్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. టిఎస్ థాకూర్, జస్టిస్ అనిల్ ఆర్ దేవ్ జస్టిస్ ఎకె సిక్రి లతో కూడిన డివిజన్ బెంచ్ సుబ్రతో రాయ్ బెయిల్ వ్యవహారంపై తన నిర్ణయాన్ని ప్రకటించింది.
కంపెనీ దాఖలు చేసిన బ్యాంక్ గ్యారంటీ ఫార్మాట్ ను అంగీకరించినప్పటికీ బాకీ చెల్లించేదాకా బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. అయితే ఆ సొమ్మును చెల్లించడానికి కొంత వెసులుబాటును కల్పించింది. 36,000 కోట్ల రూపాయలను సెబీకి చెల్లించేందుకుగాను18 నెలల గడువును ఇచ్చింది. ఈ మొత్తాన్ని తొమ్మిది వాయిదాలలో చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో సహారాకు కొంత ఊరట లభించినట్టే. రూ.5 వేల కోట్లు, అంతే మొత్తానికి బ్యాంకు పూచీకత్తు సమర్పించే దాకా తీహార్ జైలు నుంచి విడుదల చేయబోమని రాయ్ కు కోర్టు స్పష్టం చేసింది. రాయ్ కు విధించిన కస్టడీని మరో 8 వారా ల పాటు పొడిగించింది.
డిపాజిట్‌దార్లను మోసం చేసిన కేసులో సంక్షోభంలో పడి , బెయిల్ కోసం సమకూర్చుకోవాల్సిన డబ్బు కోసం సహారా గ్రూప్ నానా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.