10 రోజులే అవకాశం, లేదంటే జైలుకే
సహారా అధినేత సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు మరో 10 రోజులు అవకాశమిచ్చింది. ఆయనకు ముందు ఇచ్చిన జూన్ 19 వరకు పెరోల్ గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకముందు ఇచ్చిన గడువులో జూన్ 15 వరకు రూ.1500 కోట్లను చెల్లించాలని లేకపోతే, ఏకంగా తిహార్ జైలుకే పంపుతామని గట్టిగా హెచ్చరించింది. కానీ వాటిలో సహారా రూ.790 కోట్లను మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు పెరోల్ పొడిగింపును కోరింది. లండన్ లోని గ్రోస్వెనోర్ హౌస్ స్టేక్ ను అమ్మామని, దీని ద్వారా మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి చెల్లించాల్సిన నగదును సేకరిస్తున్నామని సహారా సుప్రీంకోర్టుకు చెప్పింది. మిగతా రూ.709.82 కోట్ల మొత్తాన్ని కూడా సహారా-సెబీకి 10 రోజుల్లో రీఫండ్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో జైలుకు పంపాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించింది.
మొత్తంగా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.25,781 కోట్ల మొత్తంలో ఇంకా సహారా రూ.11,169 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇన్వెస్టర్స్ నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేసిన ఘటనలో దోషిగా ఉన్న సుబ్రతోరాయ్ ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు. ఈ విషయంపై సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కు వ్యతిరేకంగానూ, వాటి ప్రమోటర్ సుబ్రతారాయ్, ముగ్గురు డైరెక్టర్లపై 2012లో సెబీ కేసు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణలో నడుస్తోంది. సహారా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తం కోసం కోర్టు వేలం ప్రక్రియను కూడా చేపడుతోంది.