విదేశీయానానికి అనుమతించండి
న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లడానికి వీల్లేదంటూ తనపై విధించిన నిర్బంధాన్ని తొలగించాలని సుప్రీంకోర్టును సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ ఆశ్రయించారు. వ్యాపార పరంగా తనకు విదేశీ పర్యటన తప్పదని, అందువల్ల ఇందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన వేసిన ఒక పిటిషన్ జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేల్కర్‌ల ముందు గురువారం విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్‌ను ఇందుకు సంబంధించిన ప్రధాన కేసు విచారణకు వచ్చే రోజు... అంటే జనవరి 9వ తేదీన పరిశీలిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. రాయ్ తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం తన వాదనలు వినిపిస్తూ, మూడురోజుల్లో తన క్లయింట్ విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తారని వివరించారు. అయితే తాజా పిటిషన్‌పై తాము ఇప్పుడే ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇన్వెస్టర్లకు సహారా చెల్లించాల్సిన రూ.20,000 నిధులకు సంబంధించి గ్రూప్ ఇచ్చిన తన ఆస్తుల టైటిల్ డీడ్స్ వివరాలు జనవరి 9న తెలియజేయాలని సైతం మార్కెట్ రెగ్యులేటర్ సెబీని ద్విసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశించింది.
నేపథ్యం: సహారా గ్రూప్ కంపెనీలు రెండు- ఎస్‌ఐఆర్‌ఈసీ, ఎస్‌ఐహెచ్‌ఐసీ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం. ఈ కేసులో 2012 ఆగస్టు 31న సుప్రీంకోర్టు రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15% వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పొడిగించింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్ల తక్షణం చెల్లించాలని, రూ.10,000 కోట్లను (2013) జనవరి మొదటి వారానికల్లా చెల్లించాలని, మిగిలిన సొమ్మును (2013) ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. 2012 డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా- ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమయ్యింది. ప్రస్తుతం కోర్టులో సెబీ ధిక్కరణ పిటిషన్లను సహారా గ్రూప్ ఎదుర్కొంటోంది. వాయిదా వాయిదాకు సుప్రీంకోర్టు నుంచి చివాట్లను తింటోంది.