మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్‌కు చెందిన రెండు సంస్థలు దాదాపు రూ.24 వేల కోట్ల నిధులు సమీకరించిన కేసులో మరోసారి ఆ గ్రూప్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇన్వెస్టర్లకు తిరిగి డబ్బు చెల్లించే విషయంలో చర్యలు తీసుకుంటున్న సెబీని సర్కారీ గూండాగా పేర్కొనడాన్ని, ఆ మేరకు పత్రికా ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
ఇలాంటి ప్రకటనలు ఇచ్చిన పత్రికల్లోనే తిరిగి సెబీని క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది. తమను తేలిగ్గా తీసుకోవద్దని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖేహార్‌లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. జరిగినదానికి గ్రూప్ తరఫు న్యాయవాది తక్షణం క్షమాపణలు తెలిపారు. ఇన్వెస్టర్లకు నిధులు తిరిగి చెల్లించడానికి సంబంధించి సెబీకి రూ.20,000 కోట్ల విలువైన 71 ఆస్తుల డాక్యుమెంట్లను అప్పగించినట్లు పేర్కొంది. అయితే సహారా చీఫ్ సుబ్రతా రాయ్ విదేశీ పర్యటనకు అనుమతించాలన్న వాదనను తిరస్కరించింది. డాక్యుమెంట్ల పరిశీలనకు సెబీకి గడువిచ్చిన సుప్రీంకోర్టు, కేసు తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.