
దేశం విడిచి వెళ్లొద్దు...
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను తిరిగిచ్చే అంశానికి సంబంధించిన కేసులో సహారా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రూ. 20,000 కోట్ల విలువ చేసే ఆస్తుల టైటిల్ డీడ్స్‌ను సెబీకి సమర్పించాలన్న ఆదేశాలను సహారా సరిగ్గా పాటించలేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్‌తో పాటు మిగతా డెరైక్టర్లు వందనా భార్గవ, రవి శంకర్ దూబే, అశోక్ రాయ్ చౌదరీ దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అలాగే గ్రూప్‌లోని ఏ సంస్థా కూడా తమ అనుమతి లేకుండా ఎటువంటి ఆస్తిని విక్రయించడానికి వీల్లేదని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖెహర్‌లతో కూడిన బెంచ్ స్పష్టంచేసింది. గురువారం జరిగిన వాదనల సందర్భంగా.. తాము సుప్రీం కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించామంటూ సహారా గ్రూప్ తరఫు న్యాయవాది సీఏ సుందరం న్యాయమూర్తులకు తెలియజేశారు. అయితే, సహారా గ్రూప్ అసెట్ల విలువను ఉండాల్సిన స్థాయికంటే ఎక్కువ చూపిందని, పైగా రూ. 20,000 కోట్ల విలువ చేసే ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఇవ్వలేదని సెబీ న్యాయవాది అరవింద్ దత్తార్ పేర్కొన్నారు.
వెర్సోవాలోని 106 ఎకరాల స్థలం అధికారిక విలువ కేవలం రూ. 118.42 కోట్లు ఉండగా, సహారా దానికి రూ.19,000 కోట్ల విలువ కట్టిందని దత్తార్ తెలిపారు. పైగా ఇది గ్రీన్ జోన్‌లో ఉండటం వల్ల ఇతరత్రా అభివద్ధికీ ఉపయోగపడదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు బెంచ్.. ఈ మొత్తానికి సరిపడేలా సహారా ఆస్తులు ఇతరత్రా ఇంకా ఏమైనా ఉన్నాయేమో గుర్తించాలని దత్తార్‌కి సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేసింది.