హౌస్ అరెస్ట్ ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో కొనసాగించడానికి బదులు హౌస్ అరెస్ట్ కింద ఉంచాలన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా రెండు సహారా గ్రూప్ కంపెనీలు చిన్న మదుపుదారుల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేయడం... అంత మొత్తాన్ని తిరిగి చెల్లింపుల్లో వైఫల్యత కేసులో రాయ్, మరో ఇరువురు కంపెనీల డెరైక్టర్లు మార్చి 4 నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అసలు రాయ్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని సహారా హెబియస్ కార్పస్ రిట్‌ను సైతం దాఖలు చేసింది. దీనికి సంబంధించి బుధవారం వాదనలు విన్న జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జగ్‌దీష్ సింగ్ కేహార్‌లతో కూడిన బెంచ్ తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
అంతక్రితం ధర్మాసనం ముం దు రాయ్ తరఫు న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తన వాదనలు వినిపిం చారు. ధర్మాసనం నిర్దేశించిన విధంగా రాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరించడం ఆయన జైలులో ఉండగా సాధ్యమయ్యేపనికాదని వివరించారు. కనీసం వారంపాటైనా హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలన్నారు. తద్వారా ఆయన సహారా ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే అంతర్జాతీయ పార్టీలతో సమావేశం కాగలుగుతారని వివరించారు. ఈ సందర్భంగా రానున్న సెలవు దినాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘అరెస్ట్‌కు మేము ఉత్తర్వులు ఇవ్వలేదు. అదే చేస్తే ఆయనను సాధారణ జైలుకే పంపి ఉండేవాళ్లం. జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చాం. ఆయన మా కస్టడీలో ఉన్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.