Sahara Housing scam
-
సహారా ఇష్యూ కొనసాగుతుంది
ముంబై: గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బుచ్ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో 75ఏళ్ల రాయ్ మంగళవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. సహారా అంశం కంపెనీకి సంబంధించినదని, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ఇష్యూ కొనసాగుతుందని తెలియజేశారు. ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా విలేకరులకు బుచ్ ఈ విషయాలు వెల్లడించారు. సహారా ఇన్వెస్టర్లకు వాపసు చేయాల్సిన రూ. 25,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లోనే ఉండగా, రాయ్ మరణించిన నేపథ్యంలో బుచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆధారాలున్న ఇన్వెస్టర్ల క్లయిములకు అనుగుణంగా సుప్రీం కోర్టు నియమిత కమిటీ సొమ్ములు వాపసు చేస్తున్నట్లు బుచ్ తెలియజేశారు. వివరాల్లోకి వెడితే.. సహారా గ్రూప్‌లో భాగమైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీఏ), సహారా హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలు .. ఓఎఫ్‌సీడీల (డిబెంచర్లు) ద్వారా 2007–08లో ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించడం వివాదాస్పదమైంది. దీనితో పోంజీ స్కీముల ఆరోపణల మీద సహారా గ్రూప్ 2010 నుంచి సమస్యల్లో చిక్కుకుంది. ఆపై 2014లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాయ్‌ను అరెస్ట్ చేశారు. గ్రూప్ కంపెనీలు రెండింటికి సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్లు వాపస్ చేయకపోవడంతోపాటు .. కోర్టుముందు హాజరుకావడంలో విఫలం చెందడంతో రాయ్ అరెస్ట్ అయ్యారు. తదుపరి రాయ్ బెయిల్ పొందినప్పటి కీ గ్రూప్ కంపెనీల సమస్యలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రిఫండ్ చేయడానికి, న్యాయస్థానం ఆదేశాల మేరకు సెబీ ప్రత్యేక ఖాతాల్లోకి సహారా గ్రూప్ రూ. 24,000 కోట్లు జమ చేసింది. -
ప్రశ్నార్థకంగా సహారా రూ. 25 వేల కోట్లు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ మరణించడంతో సహారా–సెబీ ఖాతాలోని రూ. 25,000 కోట్ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. రెండు గ్రూప్ సంస్థలు సమీకరించిన నిధులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు వాపసు చేసేందుకు సహారా గ్రూప్ ఈ నిధులను సెబీ ఖాతాల్లో జమ చేసింది. వివరాల్లోకి వెడితే.. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన నిధులను వాపసు చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2011లో ఆదేశించింది. 2012లో సుప్రీం కోర్టు కూడా సెబీ ఉత్తర్వులను సమర్థ్ధిస్తూ, 15 శాతం వడ్డీతో ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 95 శాతం మందికి రిఫండ్ చేసేశామని సహారా గ్రూప్ తెలియజేసినా, ఆ వాదనలను తోసిపుచ్చి రూ. 24,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలంటూ ఉత్తర్వులు ఇచి్చంది. ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ. 25,000 కోట్లు ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు సెబీ రూ. 138 కోట్లు వాపసు చేసింది. చాలా మటుకు ఇన్వెస్టర్ల వివరాలు సరిగ్గా లేకపోవడం, క్లెయిమ్‌లు రాకపోవడంతో మిగతా నిధులన్నీ సెబీ దగ్గరే ఉన్నాయి. అనారోగ్యంతో సుబ్రతో రాయ్ మరణించిన నేపథ్యంలో పంపిణీ చేయని ఈ సొమ్ము పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
హౌస్ అరెస్ట్ ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో కొనసాగించడానికి బదులు హౌస్ అరెస్ట్ కింద ఉంచాలన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా రెండు సహారా గ్రూప్ కంపెనీలు చిన్న మదుపుదారుల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేయడం... అంత మొత్తాన్ని తిరిగి చెల్లింపుల్లో వైఫల్యత కేసులో రాయ్, మరో ఇరువురు కంపెనీల డెరైక్టర్లు మార్చి 4 నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అసలు రాయ్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని సహారా హెబియస్ కార్పస్ రిట్‌ను సైతం దాఖలు చేసింది. దీనికి సంబంధించి బుధవారం వాదనలు విన్న జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జగ్దీష్ సింగ్ కేహార్‌లతో కూడిన బెంచ్ తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. అంతక్రితం ధర్మాసనం ముం దు రాయ్ తరఫు న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తన వాదనలు వినిపిం చారు. ధర్మాసనం నిర్దేశించిన విధంగా రాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరించడం ఆయన జైలులో ఉండగా సాధ్యమయ్యేపనికాదని వివరించారు. కనీసం వారంపాటైనా హౌస్ అరెస్ట్‌కు అనుమతించాలన్నారు. తద్వారా ఆయన సహారా ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే అంతర్జాతీయ పార్టీలతో సమావేశం కాగలుగుతారని వివరించారు. ఈ సందర్భంగా రానున్న సెలవు దినాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘అరెస్ట్‌కు మేము ఉత్తర్వులు ఇవ్వలేదు. అదే చేస్తే ఆయనను సాధారణ జైలుకే పంపి ఉండేవాళ్లం. జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చాం. ఆయన మా కస్టడీలో ఉన్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.