న్యూఢిల్లీ: మదుపరులకు వచ్చే 16 నెలల్లో చెల్లింపులు జరిపేస్తామంటూ సహారా చేసిన ఒక ప్రతిపాదనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. సహారా చేసిన తాజా ప్రతిపాదన అవమానకరమైనదని పేర్కొన్న జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేల్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, గౌరవప్రదమైన ప్రణాళికతో ముందుకురావాలని సూచిం చింది. తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సహారా చీఫ్ సుబ్రతారాయ్ తదుపరి విచారణ వరకూ తీహార్ జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిబంధనలకు విరుద్ధంగా సహారాగ్రూప్ సంస్థలు రెండు రూ.24,000 కోట్లు సమీకరించాయన్నది కేసులో ప్రధానాంశం. ఈ నిధులు పునఃచెల్లింపుల్లో విఫలం కావడంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సహారాపై ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విచారణ ప్రక్రియ అనంతరం సుప్రీం ఆదేశాల ప్రకారం సహారా చీఫ్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
ప్రతిపాదన ఏమిటి?
కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేయాలని సహారా విజ్ఞప్తి చేసింది. దీనితో ప్రత్యేకంగా ఏర్పాటైన బెంచ్ ముందు సహారా న్యాయవాదులు ఒక ప్రతిపాదన చేస్తూ, 3 రోజుల్లో రూ.2,500 కోట్లు చెల్లించడానికి గ్రూప్ సిద్ధమని పేర్కొన్నారు. మిగిలిన మొత్తం రూ.14,900 కోట్లను 2015 జూలైనాటికి 5 విడతల్లో చెల్లిస్తామని గ్రూప్ హామీ ఇస్తోందని తెలిపింది.
అయితే ఈ దశలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, వడ్డీతోసహా గ్రూప్ చెల్లించాల్సింది దాదాపు రూ.34,000 కోట్లని పేర్కొన్నారు. ప్రస్తుతం చెల్లింపులకు అంగీకరిస్తున్న రూ.17,400 కోట్లు కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనితో సహారా ప్రతిపాదనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. గౌరవప్రదమైన ప్రతిపాదనతో రావాలని సూచించింది. కాగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 మధ్య ప్రతిరోజూ రాయ్‌ని సహారా ఫైనాన్షియల్ కన్సల్టెంట్లు, న్యాయవాదులు కలుసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.
సహారా ప్రతిపాదనకు సుప్రీంకోర్టు నో...
Published Sat, Mar 8 2014 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement