
తక్షణం అంత మొత్తాన్ని చెల్లించలేం: సహారా
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు జ్యుడీషియల్ కస్టడీలోనే మరికొద్దిరోజులు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా వీరి బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాల్సి రావడం తక్షణం తమకు సాధ్యమయ్యేది కాదని, అంతమొత్తాన్ని ఇప్పటికిప్పుడు సమీకరించలేమని సహారా పేర్కొంది.
ఈ మేరకు తమ అశక్తతను అత్యున్నత న్యాయస్ధానానికి తెలియజేసింది. మార్చి 4వ తేదీ నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల విడుదలకు రూ.5 వేల కోట్లు కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ.5 వేల కోట్లకు సెబీ మార్చుకోదగిన విధంగా బ్యాంక్ గ్యారెంటీ సమర్పిం చాలని ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రూలింగ్‌పై తమ స్పందనను సహారా గురువారం కోర్టుకు తెలియజేసింది. తదుపరి కేసు విచారణ ఏప్రిల్ 3కు వాయిదా పడింది.
తీవ్ర వాదోపవాదనలు...
తనను జైలు పాలు చేయడం తగదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని గతంలో సహారా చీఫ్ సుబ్రతారాయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌పై గురువారం సహారా-సెబీ న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జత్మలానీ తన వాదనలు వినిపించారు. బెంచ్ ఈ కేసు విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోందని అన్నారు. ఒక రూలింగ్ ఇచ్చిన ధర్మాసనమే... ఆ రూలింగ్ తప్పని వేసిన రిట్ పిటిషన్‌ను ఎలా విచారిస్తుందని ప్రశ్నించారు.
తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఏ వ్యక్తినైనా ఎలా జైలుపాలు చేయగలమని పేర్కొన్నారు. సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉండగానే రాయ్‌ని జైలుకు పంపడం తీవ్ర తప్పిదమని అన్నారు. తాత్కాలిక బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్ల భారీ మొత్తం చెల్లించాలన్న షరతుసైతం సమంజసం కాదని అన్నారు. అంతా పక్షపాతంగా ఉందన్న తన క్లయింట్ ఆందోళనను ప్రస్తుత బెంచ్ గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కేసును ప్రస్తుత బెంచ్ విచారించడం తగదని, మరో ధర్మాసనం ముందుకు బదిలీచేయాలని న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ కూడా ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు.
రాయ్‌ని జైలుకు పంపుతూ ఇచ్చిన రూలింగ్‌ను సవరించాలని కోరారు. ధర్మాసనం రూలింగ్‌నే తప్పుపట్టాల్సిన పరిస్థితి చాలా అరుదుగా ఉత్పన్నమవుతుందని సైతం పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ అసలు చెల్లనేరదని సెబీ తరఫు న్యాయవాదులు వాదించారు. రాయ్ తరఫు న్యాయవాదుల వాదనలను వారు పూర్తిగా వ్యతిరేకించారు. వాదనలు ఇంకా ముగియకపోవడంతో తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.