రూ. 5,000 కోట్లు కట్టండి.. లేదంటే యాంబీ వ్యాలీ వేలం
సహారా సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ 17వ తేదీ నాటికి రూ.5,092.6 కోట్లు డిపాజిట్ చేయకపోతే, రూ.39,000 కోట్ల విలువచేసే పూణేలోని ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీ వేలం వేయక తప్పదని సహారాకు అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో సహారా వాటాను 550 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి సిద్ధపడిన ఇంటర్నేషనల్ రియల్లీ సంస్థ ఈ డీల్ విషయంలో విశ్వసనీయతను నిరూపించుకోడానికి తొలుత రూ.750 కోట్లను సెబీ– సహారా రిఫండ్ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని కూడా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
తనఖాలోని ఆస్తుల జాబితాను అందజేయాలని జస్టిస్ రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడా కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే సహారాకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు సహారా గ్రూప్ సంస్థలు మదుపరుల నుంచి మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసులో దాదాపు రెండేళ్లు సహారా చీఫ్ తీహార్ జైలులో ఉన్నారు. తల్లి మరణంతో పెరోల్‌పై విడుదలైన ఆయన, అటు తర్వాత సుప్రీం నిర్దేశాల మేరకు కొంత మొత్తాల్లో నిధులు డిపాజిట్ చేస్తూ... పెరోల్‌పై కొనసాగుతున్నారు. ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తంపై 2016 అక్టోబర్ 31 వరకూ సహారా గ్రూప్ వడ్డీసహా రూ.47,669 కోట్లు చెల్లించాల్సి ఉందని ఫిబ్రవరిలో కేసు వాదనల సందర్భంగా సెబీ న్యాయవాది ప్రతాప్ వేణుగోపాల్ న్యాయస్థానానికి తెలిపారు.