ఆస్తుల అమ్మకంపై సహారా కొత్త ప్రతిపాదన
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతా రాయ్‌ని జైలు నుంచి విడిపించడానికి సహారా కొత్త ప్రతిపాదనను సుప్రీంకోర్టుకు వివరించింది. బెయిల్ మొత్తానికి సంబంధించి ఆస్తుల విక్రయంపై సహారా సమర్పించిన తాజా ప్రతిపాదనపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పందనను కోరింది. నాలుగు వారాల్లో దీనికి సమాధానం తెలపాలని సూచించింది. తాజా ప్రతిపాదనను సహారా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు ఉంచారు. దీని ప్రకారం ముంబైలో హోటల్- సహారా స్టార్, అలాగే ఫార్మూలా 1లో 42 శాతం వాటాలు, నాలుగు విమానాల అమ్మకానికి చర్చలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో లండన్‌లోని గ్రాసోవర్ హౌస్ హోటల్, న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ హోటల్స్ విక్రయాలకూ చర్చలు జరుగుతున్నాయి. గ్రాసోవర్ హౌస్ హోటల్ విక్రయ చర్చలు స్టార్ ఆఫ్ కతార్‌తో జరుగుతున్నాయని, రూ.2,300 కోట్లు వెచ్చించడానికి ఆ సంస్థ సిద్ధమవుతోందని సిబాల్ కోర్టుకు తెలిపారు. అమెరికాలో హోటళ్ల రీఫైనాన్స్ విషయంపై ఒక రష్యా బ్యాంకుతో చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో తన ఆస్తుల అమ్మకానికి కూడా సహారా కోర్టు అనుమతి కోరుతోంది. 2014 మార్చి 4 నుంచీ సహారా చీఫ్ తీహార్ జైలులో ఉన్నారు. ఇన్వెస్టర్లకు రూ.36,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాయ్‌తో పాటు రెండు కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు కూడా జైలులో గడుపుతున్నారు.