సహారా రాయ్కి పెరోల్ పొడిగింపు | Supreme Court extends Sahara Group chief Subrata Roy's parole | Sakshi
Sakshi News home page

సహారా రాయ్కి పెరోల్ పొడిగింపు

Published Tue, Jul 12 2016 1:04 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

సహారా రాయ్కి పెరోల్ పొడిగింపు - Sakshi

సహారా రాయ్కి పెరోల్ పొడిగింపు

మిగిలిన రూ.300 కోట్లు కడతారా..? లేక జైలుకెళతారా?
సుబ్రతారాయ్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
సహారా ఆస్తుల విక్రయంపై ఆంక్షల తొలగింపు

న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతారాయ్‌కు మరి కొంత ఊరట లభించింది. ఆయనకు గతంలో మంజూరు చేసిన పెరోల్ గడువును ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సహారా కేసులో జైలు పాలైన కంపెనీ డైరక్టర్లు రవిశంకర్ దూబే, అశోక్‌రాయ్‌చౌదరిలకు సైతం పెరోల్ మంజూరు చేసింది. రూ.500 కోట్లు కోర్టుకు జమ చేస్తానన్న హామీ మేరకు మిగిలిన రూ.300 కోట్లను కోర్టుకు జమ చేస్తారా...? లేక తిరిగి జైలుకు వెళతారా? అని రాయ్‌ని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మాతృమూర్తి మరణంతో మానవీయ కోణంలో సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి కల్పించిన విషయం తెలిసిందే.

అయితే, ఇందులో ఆయన రూ.200 కోట్లను మాత్రమే డిపాజిట్ చేశారు. కాగా, మిగిలిన రూ.300 కోట్లను డిపాజిట్ చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు గడువివ్వాలని సుబ్రతారాయ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే, ఆస్తుల విక్రయానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ధర్మాసనం రీసీవర్‌ను నియమించి సహారాకు చెందిన అన్ని ఆస్తులను అప్పగిస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? అని ఎదురు ప్రశ్నించింది.

తమ సహనాన్ని పరీక్షించవద్దంటూ సున్నితంగా హెచ్చరించింది. ఇన్వెస్టర్లకు రూ.36వేల కోట్లను తిరిగి చెల్లించాలన్న తమ ఆదేశాలను గుర్తు చేసింది. ఆదేశాల అమలులో విఫలమైతే రాయ్‌తో పాటు మరో ఇద్దరు డైరక్టర్లను తిరిగి తిహార్ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అంతకుముందు రూబెన్ బ్రదర్స్ నుంచి తీసుకున్న 2.4 కోట్ల పౌండ్లు (సుమారు రూ.200కోట్లు) సెబీ-సహారా ఖాతాకు బదిలీ చేసేందుకు అనుమతించాలన్న సిబల్ అభ్యర్థనను ధర్మాసనం ఆమోదించింది.

 సహారా గ్రూపునకు సైతం ఊరట
రాయ్‌తోపాటు సహారా గ్రూపునకు కూడా సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. సహారా గ్రూపునకు చెందిన ఇతర ఆస్తుల విక్రయ, హక్కుల బదిలీకి అనుమతించింది. దీని ద్వారా రూ.5వేల కోట్ల మేర నిధులు సమీకరించి బ్యాంకు గ్యారంటీ కింద సమర్పించేందుకు ఓ అవకాశం ఇచ్చింది. బెయిల్ కోసం సమర్పించాల్సిన రూ.5వేల కోట్లకు ఇది అదనం. లోగడ 19 ఆస్తులను మాత్రమే విక్రయిచేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మ్యూచువల్ పండ్స్, బంగారంపై డిపాజిట్లు, ఎన్‌ఎస్‌ఈలో వాటాలను నగదుగా మార్చుకునేందుకు సైతం సుప్రీంకోర్టు అనుమతి జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement