23 వరకూ రాయ్ పెరోల్ పొడిగింపు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు సెప్టెంబర్ 23వ తేదీ వరకూ పొడిగించింది. రెండు గ్రూప్ సంస్థలు మదుపుదారుల నుంచి మార్కెట్ నిబంధనలను వ్యతిరేకంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేయడం, వడ్డీతో సహా దాదాపు రూ.35,000 కోట్లు తిరిగి చెల్లించడంలో వైఫల్యం నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలు సుబ్రతా రాయ్ తిహార్ జైలులో గడిపారు. తల్లి మరణంతో మానవతా కారణాలతో మే నెలలో పెరోల్ పొందారు.
అయితే ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన డబ్బు సమీకరణ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా సుప్రీంకోర్టు ఆయనకు పెరోల్‌ను పొడిగిస్తూ వస్తోంది. అయితే అందుకు ఆయన కొంత మొత్తం సెబీ-సహారా అకౌంట్‌లో డిపాజిట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి రూ.353 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిటర్లకు తాము ఇప్పటికే నిధులు మొత్తం చెల్లించేశామన్న సహారా వాదనపై సెప్టెంబర్ 2వ తేదీన తీవ్రంగా స్పందించింది. ఇందుకు డబ్బు ఎలా సమీకరించారు? డబ్బు చెల్లించిన వారి సుస్పష్ట వివరాలను తెలియజేస్తే కేసు మూసేస్తామని కూడా సుప్రీం సూచించింది. అంత డబ్బు ఆకాశం నుంచి రాలి పడదుకదా? అని కూడా వ్యాఖ్యానించింది.