ఏడాదిలో 20 వేల కోట్లు ఇచ్చేస్తాం
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా రెండు గ్రూప్ కంపెనీలు రూ.25,000 కోట్ల నిధులు సమీకరణ, చెల్లింపుల కేసులో సహారా తాజాగా సుప్రీంకోర్టు ముందుకు మంగళవారం ఒక ప్రతిపాదన తెచ్చింది. దీని ప్రకారం సంస్థ ఏడాదిలో విడతల వారీగా మొత్తం రూ.20,000 కోట్లు మార్కెట్ రెగ్యులేటర్ వద్ద డిపాజిట్ చేస్తుంది.
విడతల వారీగా...
ఈ ప్రతిపాదనకు సుప్రీం ఆమోదముద్ర వేస్తే- మూడు పనిదినాల్లో రూ.2,500 కోట్లు డిపాజిట్ చేస్తుంది. వరుసగా మూడు నెలల్లో అంటే జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలాంతాలకు రూ.3,500 కోట్ల చొప్పున డిపాజిట్ చేస్తుంది. మిగిలిన రూ.7,000 కోట్లను 2015 మార్చి 31కల్లా డిపాజిట్ చేస్తుంది. చెల్లించాల్సిన మిగిలిన డబ్బుకు సంబంధించి ఏ సమయంలోనైనా మార్చడానికి వీలులేని బ్యాంక్ గ్యారెంటీని ఇవ్వడానికి సిద్ధమని కూడా గ్రూప్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి మార్చి 4 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమ చీఫ్ సుబ్రతారాయ్‌ని విడుదల చేయాలని సహారా గ్రూప్ విజ్ఞప్తి చేసింది. స్తంభింపచేసిన బ్యాంక్ అకౌంట్ల నిర్వహణకు గ్రూప్ కంపెనీలను అనుమతించాలని కూడా సహారా విజ్ఞప్తి చేసింది.
నేడు తిరిగి విచారణ!
అయితే దీనిని తక్షణం రికార్డు చేయడానికి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేల్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. తొలుత ఈ ప్రతిపాదనకు సంబంధించిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రీలో దాఖలు చేయాలని, తరువాత దీనిని తమ బెంచ్ పరిశీలిస్తుందని పేర్కొంది. ఇదే జరిగితే బుధవారం బెంచ్ ఈ ప్రతిపాదనను విచారించే అవకాశం ఉంది. సహారా గ్రూప్ ఇంతక్రితం చేసిన ఈ తరహా ప్రతిపాదనను ఒకదానిని సుప్రీంకోర్టు మార్చి7న తిరస్కరించింది. అప్పటి ప్రతిపాదన ప్రకారం, మూడు పనిదినాల్లో రూ.2,500కోట్లను చెల్లిస్తామని సహారా పేర్కొంది. 2015 జూలై ముగింపు నాటికి ఐదు విడతల్లో రూ.14,900 కోట్లు చెల్లిస్తామని తెలిపింది.