Sahara India Pariwar
-
సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!
Sahara Group-Sebi ప్రయివేట్ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లుగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు, జస్టిస్ బీఎన్ అగర్వాల్ సూచనలమేరకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా పలు ప్రకటనలు జారీ చేసింది. తద్వారా తమ సొమ్మును తిరిగి పొందేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించినట్లు మంత్రి రాతపూర్వక సమాధానంలో వివరించారు. తదుపరి 2021 అక్టోబర్‌లో సెబీ మధ్యంతర ఆదేశాల కోసం సుప్రీం కోర్టులో మరోసారి అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం కోర్టువద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పంకజ్ తెలియజేశారు. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 47,245 కోట్లు, సహారా ఇండియన్ రియల్టీ కార్పొరేషన్లో రూ. 19,401 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో రూ. 6,381 కోట్లు చొప్పున పెట్టుబడులు ఇరుక్కున్నట్లు వెల్లడించారు. ఇదేవిధంగా హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 12,958 కోట్లు, సహారాయన్ యూనివర్శల్ మల్టీపర్పస్ సొసైటీలో రూ. 18,000 కోట్లు, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 8,470 కోట్లు నిలిచిపోయినట్లు తెలియజేశారు. కాగా.. సహారా గ్రూప్ ‘సెబీ సహారా రిఫండ్’ ఖాతాలో అసలు రూ. 25,781 కోట్లకుగాను దాదాపు రూ. 15,507 కోట్లు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. చదవండి: టెక్కీలకు గడ్డుకాలం, వరస్ట్ ఇయర్‌గా 2022 -
బతుకు 'సహారా' ఎడారేనా ?
కాలం దెబ్బకు ఎవరైనా కుదేలు కావాల్సిందే. అది ధనవంతుడు, రాజకీయనాయకుడు.... ఎవరైనా జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ కాలం దెబ్బ తినక తప్పదు. అందుకు అత్యుత్తమ ఉదాహరణ సహారా పరివార్ ఇండియా ఛైర్మన్ సుబ్రత రాయ్. సహారా గ్రూప్ ఛైర్మన్‌గా జీవితం అనే వైకుంఠపాళిలో ఆయన ఎంతో వేగంగా అత్యున్నత స్థితికి చేరుకున్నారో ... అంతే వేగంగా కిందకి జారీ పడ్డారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తూ... బెయిల్ కోసం కన్నులు కాయాలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లోని ఆస్తులు న్యూయార్క్ ప్లాజా, గ్రోస్వెనర్ హౌస్.... విక్రయానికి లేదా తనఖా పెట్టుకునేందుకు ఎవరైనా రాకపోతారా అని ఆశాగా ఎదురు చూస్తూ... కాలం వెళ్ల దీస్తున్నారు. ఇంతకీ సుబ్రత రాయ్ కథా కమామిషూ ఏమిటి? గోరఖ్‌పూర్‌లో సహారాలో సుబ్రత చిరుఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి... ఆ కంపెనీనే సొంతం చేసుకున్నారు. అనంతరం బ్యాంకింగ్, మీడియా, ఎంటర్టైనర్, అతిథ్యం.... అన్ని రంగాల్లోకి సహారా ఇండియా పరివార్‌గా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగింది. దేశ విదేశీ పత్రికలు సైతం ఆయన్ని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరని కీర్తించింది. అంతేనా... దేశ విదేశీ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. దేశంలో అత్యధిక ఉద్యోగులు గత సంస్థ భారతీయ రైల్వే. ఆ తర్వాత స్థానాన్ని సహార ఇండియా సొంతం చేసుకుంది. దాంతో సహారా ఇండియా రికార్డు సృష్టించింది. అంతాబాగానే ఉంది. కానీ తన సంస్థలో నగదు కుదువ పెట్టిన మదుపుదారులకు దాదాపు రూ. 24 వేల కోట్లు సుబ్రతరాయ్ సకాలంలో చెల్లించలేకపోయారు. దాంతో మదుపుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు హాజరుకావాలని సుబ్రతను సుప్రీం ఆదేశించింది. ఆ ఆదేశాలను సుబ్రత పెడచెవిన పెట్టాడంతో కోర్టు ఆగ్రహానికి గురైయ్యారు. సుబ్రతను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి... కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు జైలు శిక్ష విధించింది. బెయిల్ విడుదల కావాలంటే రూ. 10 వేల కోట్లు బెయిల్ బాండ్ సమర్పించాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. దాంతో ఆ నగదును సమకూర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అయితే ఆస్తుల విక్రయానికి లేదా తనఖా కోసం కొనుగోలుదారులు వస్తే మాట్లాడేందు... ఇతర ప్రాంతాలలో ఉన్నవారితో మాట్లాడేందుకు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తీహార్ జైల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ సుప్రీం కోర్టు ఆయనకు వెలుసుబాటు కల్పించింది. దాంతో తన ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఎవరైనా ముందుకురాకపోతారా అంటూ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే సహారా గ్రూప్‌ను బ్రూనై సుల్తాన్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేయునున్నారని సమాచారం. ఆయన కొంటే సరే లేకుంటే సుబ్రత జీవితం.... సహారా ఎడారే. -
ఏడాదిలో 20 వేల కోట్లు ఇచ్చేస్తాం
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా రెండు గ్రూప్ కంపెనీలు రూ.25,000 కోట్ల నిధులు సమీకరణ, చెల్లింపుల కేసులో సహారా తాజాగా సుప్రీంకోర్టు ముందుకు మంగళవారం ఒక ప్రతిపాదన తెచ్చింది. దీని ప్రకారం సంస్థ ఏడాదిలో విడతల వారీగా మొత్తం రూ.20,000 కోట్లు మార్కెట్ రెగ్యులేటర్ వద్ద డిపాజిట్ చేస్తుంది. విడతల వారీగా... ఈ ప్రతిపాదనకు సుప్రీం ఆమోదముద్ర వేస్తే- మూడు పనిదినాల్లో రూ.2,500 కోట్లు డిపాజిట్ చేస్తుంది. వరుసగా మూడు నెలల్లో అంటే జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలాంతాలకు రూ.3,500 కోట్ల చొప్పున డిపాజిట్ చేస్తుంది. మిగిలిన రూ.7,000 కోట్లను 2015 మార్చి 31కల్లా డిపాజిట్ చేస్తుంది. చెల్లించాల్సిన మిగిలిన డబ్బుకు సంబంధించి ఏ సమయంలోనైనా మార్చడానికి వీలులేని బ్యాంక్ గ్యారెంటీని ఇవ్వడానికి సిద్ధమని కూడా గ్రూప్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి మార్చి 4 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తమ చీఫ్ సుబ్రతారాయ్‌ని విడుదల చేయాలని సహారా గ్రూప్ విజ్ఞప్తి చేసింది. స్తంభింపచేసిన బ్యాంక్ అకౌంట్ల నిర్వహణకు గ్రూప్ కంపెనీలను అనుమతించాలని కూడా సహారా విజ్ఞప్తి చేసింది. నేడు తిరిగి విచారణ! అయితే దీనిని తక్షణం రికార్డు చేయడానికి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేల్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. తొలుత ఈ ప్రతిపాదనకు సంబంధించిన డాక్యుమెంట్‌ను రిజిస్ట్రీలో దాఖలు చేయాలని, తరువాత దీనిని తమ బెంచ్ పరిశీలిస్తుందని పేర్కొంది. ఇదే జరిగితే బుధవారం బెంచ్ ఈ ప్రతిపాదనను విచారించే అవకాశం ఉంది. సహారా గ్రూప్ ఇంతక్రితం చేసిన ఈ తరహా ప్రతిపాదనను ఒకదానిని సుప్రీంకోర్టు మార్చి7న తిరస్కరించింది. అప్పటి ప్రతిపాదన ప్రకారం, మూడు పనిదినాల్లో రూ.2,500కోట్లను చెల్లిస్తామని సహారా పేర్కొంది. 2015 జూలై ముగింపు నాటికి ఐదు విడతల్లో రూ.14,900 కోట్లు చెల్లిస్తామని తెలిపింది.