రూ.12వేల కోట్లు ఎలా చెల్లిస్తున్నారో చెప్పండి?
రూ.12వేల కోట్లు ఎలా చెల్లిస్తున్నారో చెప్పండి?
Published Wed, Sep 28 2016 5:19 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్కు పెరోల్ గడువు అక్టోబర్ 24వరకు పొడిగిస్తూ ఊరటనిచ్చిన సుప్రీం, సెబీకి చెల్లించాల్సిన రూ.12వేల కోట్లను ఎలా చెల్లిస్తున్నారో తెలుపాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సమర్పించాలని ఆయన తరుఫున న్యాయవాదిని సుప్రీం ఆదేశించింది. మరోవైపు పెరోల్ గడువు పొడిగింపు కోసం సుబ్రతా రాయ్ సెబీ వద్ద రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది..
కాగ గత శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం న్యాయవాదికి, సహారా న్యాయవాదికి మధ్య జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరోల్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వెంటనే జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించింది. అయితే దీనిపై సుబ్రతా రాయ్ సుప్రీంకు క్షమాపణ చెప్పుకున్నారు. ఇలాంటి తప్పు మరోసారి జరుగదని, తన పెరోల్ను తిరస్కరించడాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో పెరోల్ పొడిగింపుపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం, గడువును అక్టోబర్24 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది.
కాగా నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే 6న నాలుగు వారాల పెరోల్ సుప్రీం మంజూరు చేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సిన మొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతుతో ఆగస్టు 3న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ 23వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. నేటి విచారణ సందర్భంగా మరోసారి సుబ్రతారాయ్ పెరోల్ను పొడిగించింది.
Advertisement