
ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు?
పనాజీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్ ను ఆరునెలలుగా జైలులో ఉంచడంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నొచ్చుకున్నారు. ఇంకా ఎన్నిరోజులు ఆయనను జైలులో ఉంచుతారంటూ ప్రశ్నించారు. దక్షిణ గోవా రిసార్ట్ లో జరిగిన 16వ ఆల్ ఇండియా విప్స్ కాన్ఫెరెన్స్ లో పారికార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోర్టు ధిక్కార నేరం కింద సుబ్రతారాయ్ ను ఇన్నిరోజులు జైలులో ఉంచడం తనను బాధించిందన్నారు.
'సుబ్రత రాయ్ ను సుప్రీంకోర్టు ఇంకా ఎన్ని రోజులు జైల్లో ఉంచుతుంది. ప్రజాస్వామ్యవాదిగా ఈ విషయంలో కలత చెందా. సరైన విధానం లేకుండా ఓ వక్తిని నిర్బంధిచకూడదు. సుబ్రతారాయ్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఎందుకు మొండిపట్టుదలతో ఉందో అర్థం కావడం లేదు' అని పారికర్ వ్యాఖ్యానించారు. సుబ్రతారాయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.