
200 కోట్లు కట్టు లేదా జైలుకు వెళ్లు!
న్యూఢిల్లీ: సహారా అధినేత సుబ్రతా రాయ్‌కి ఇచ్చిన పెరోల్ జూలై 11వ తేదీ వరకు సుప్రీంకోర్టు బుధవారం పొడిగించింది. జూలై 11లోగా రూ. 200 కోట్లు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబికి కట్టాలని, లేకపోతే మళ్లీ తీహార్ జైలుకు వెళ్లకతప్పదని ఆయనను కోర్టు స్పష్టం చేసింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి)కు రూ. 200 కోట్ల డిపాజిట్ చెల్లించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు అండర్ టేకింగ్ ఇవ్వాలని సుబ్రతా రాయ్, సహారా గ్రూప్ డైరెక్టర్ అశోక్ రాయ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిని చెల్లించడంలో వారు విఫలమైతే.. ఆ ఇద్దరు తిరిగి తీహార్ జైలు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
2014 మార్చి 4 నుంచి సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన తల్లి చనిపోవడంతో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సుబ్రతారాయ్‌కి సుప్రీంకోర్టు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. దీంతో మే 6న సుబ్రతా రాయ్, అశోక్ రాయ్ జైలు నుంచి విడుదలయ్యారు.
2008-2009 మధ్యకాలంలో సహారా గ్రూప్‌నకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌజింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు చిన్న పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్లు సేకరించాయి. ఈ డిపాజిట్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబికి గ్యారంటీ చెల్లించడంలో విఫలమవ్వడంతో సుబ్రతారాయ్, అశోక్ రాయ్ జైలు పాలయ్యారు.