సహారా రాయ్‌కు మరో 10 రోజుల గడువు
రూ.710 కోట్ల డిపాజిట్‌పై సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: సెబీ–సహారా కేసులో రూ.709.82 కోట్లను డిపాజిట్ చేయడానికి సుబ్రతాయ్‌రాయ్‌కి సుప్రీంకోర్టు మరో 10 రోజుల సమయాన్ని ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా తాత్కాలిక బెయిల్‌ను కూడా జూలై 5 వరకూ పొడిగించింది. రాయ్ తరఫున జస్టిస్ దీపక్ మిశ్రా, రంజన్ గొగొయ్‌లతో కూడిన బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. రూ.1,500 కోట్లు డిపాజిట్ చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా రాయ్ ఇప్పటికే రూ.790.18 కోట్లు సెబీ–సహారా అకౌంట్‌లో డిపాజిట్ చేశారని, మిగిలిన మొత్తం డిపాజిట్‌కు మరికొంత సమయం కావాలని కోరారు.
దీనికి సుప్రీంకోర్టు తన ఆమోదాన్ని తెలియజేసింది. జూన్ 15, జూలై 15న సెబీకి వరుసగా రూ.1,500 కోట్లు, రూ.552.22 కోట్లు చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఇంతక్రితమే సహారా రెండు చెక్కులను డిపాజిట్ చేసింది. అయితే ఈ డబ్బును సమకూర్చలేకపోవడాన్ని తీవ్రంగా తీసుకున్న సుప్రీంకోర్టు, మహారాష్ట్రలో సంస్థకు చెందిన రూ.34,000 కోట్ల విలువైన యాంబీ వ్యాలీ జప్తునకు ఆదేశాలు ఇచ్చింది.