పెరోల్ పొడిగించాలంటే రూ. 5,092 కోట్లు!
⇒ ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయాలి
⇒ సహారా రాయ్‌కు సుప్రీం గడువు
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను పొడిగించడానికి సుప్రీంకోర్టు కీలక షరతు విధించింది. ఏప్రిల్ 7వ తేదీలోపు సెబీ–సహారా అకౌంట్‌లో రూ.5,092.6 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను ఆదేశించింది. తన ఆస్తులు అమ్మడానికి ఆరు నెలల గడువు కావాలని గ్రూప్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. తనకు సమర్పించిన జాబితాలోని ఆస్తులు అమ్మడానికి ఆమోదముద్ర వేసింది. మదుపరులకు డబ్బు పునఃచెల్లించడానికి వీలుగా తగిన చర్యలు తీసుకోడానికి తగిన అన్ని చర్యలపై దృష్టి సారించాల్సిందేని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 7లోపు డిపాజిట్ చేయడానికి వీలుగా తనకు సమర్పించిన జాబితాలోని 15 ఆస్తుల్లో పదమూడింటిని అమ్మవచ్చని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అలాగే మరో జాబితాల్లో ఉన్న తనఖాలోలేని ఆస్తుల అమ్మకానికీ సుప్రీం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం చెల్లింపు తరువాత పెరోల్ గడువును మరికొంతకాలం పొడిగించి మొత్తం డబ్బు డిపాజిట్ చేసే మార్గాలను అన్వేషించే అవకాశం కల్పిస్తామని సుప్రీం సూచించింది.
ఇంటర్నేషనల్ రియల్టీ సంస్థకు సూచనలు...
కాగా న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో సహారా వాటాలను 550 మిలియన్ డాలర్లకు కొనడానికి ముందుకు వచ్చిన ఒక అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థకు...రాజన్ గొగోయ్, ఏకే శిక్రీలు కూడా ఉన్న ఈ త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ దిశలో తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి రూ.750 కోట్లను ఏప్రిల్ 10వ తేదీ లోగా అత్యున్నత స్థాయి న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.