రాయ్ వినతి మళ్లీ తిరస్కరణ
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. మూడు నెలలుగా జైల్లో ఉన్న రాయ్... తనను గృహ నిర్బంధంలో ఉంచాలంటూ చేసిన విజ్ఞప్తిని కోర్టు బుధవారం తిరస్కరించింది. అయితే, ఆయన బెయిల్ కోసం గ్రూప్ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.5 వేల కోట్లు సమీకరించేందుకు, అంతే మొత్తంలో బ్యాంకు గ్యారంటీ సాధించేందుకు అనుమతించింది. భారతీయ నగరాల్లో 9 స్థిరాస్తుల అమ్మకానికి అనుమతిస్తున్నట్లు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఈ ఆస్తుల కొనుగోలుదారులకు సహారా గ్రూప్‌తో ఎలాంటి సంబంధాలు ఉండరాదనీ, సర్కిల్ రేటు కంటే తక్కువ ధరకు విక్రయించరాదనీ స్పష్టంచేసింది.
కాగా అంతక్రితం బెయిల్‌కోసం రూ.10,000 కోట్లు సమర్పించే విషయంలో గ్రూప్ తాజా ప్రతిపాదనను తిరస్కరించింది.
త్రిసభ్య ధర్మాసనానికి నివేదన: ప్రస్తుత ధర్మాసనం కేసును విస్తృతస్థాయి త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ బెంచ్‌ని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా ఏర్పాటు చేస్తారు. కోర్టుకు ఈ విషయంలో సలహాలను, అభిప్రాయాలను అందించడానికి సీనియర్ న్యాయవాది ఎఫ్‌ఎస్ నారిమన్‌ను నియమిస్తున్నట్లు కూడా ధర్మాసనం పేర్కొంది. ఒక వాయిదాకు రూ.1.10 లక్షల ఫీజును ఆయనకు సెబీ చెల్లిస్తుంది. ఆ డబ్బును సెబీ తిరిగి సహారా గ్రూప్ అకౌంట్ నుంచి వసూలు చేసుకోవచ్చు.
పెరోల్ తరహా సడలింపు పరిశీలన!: కాగా 92 సంవత్సరాల తన తల్లిని కలుసుకునేందుకు రాయ్‌ని అనుమతించాలని, పెరోల్ తరహాలో 5 రోజులు జైలు నుంచి పంపడానికి అనుమతినివ్వాలని సీనియర్ అడ్వకేట్ ఎస్ గణేష్ మౌఖికంగా చేసిన విజ్ఞప్తిని పరిశీలించడానికి బెంచ్ అంగీకరించింది. అయితే ఈ అంశాన్ని ఒక అప్లికేషన్ రూపంలో ఫైల్ చేయాలని నిర్దేశించింది.