బీజేపీని ఆహ్వానించేందుకు మార్గం సుగమం
లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపాదనకు రాష్ర్టపతి ఆమోదం
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, లేఖ సమర్పణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతోంది. సుప్రీంకోర్టుతో పాటు రాష్ర్టపతి కూడా ఈ అంశంపై నిర్ణయాలు తీసుకుంటుండటంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ఇందుకు ఆ పార్టీని ఆహ్వానిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) చేసిన ప్రతిపాదనను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినట్లు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే సర్కారు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో ఐదు నెలలుగా జాప్యం చేయడంపై కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ రాష్ర్టపతి పాలన కొనసాగరాదని అభిప్రాయపడిన కోర్టు.. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పేర్కొంది. ఈ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ కేంద్రం ఏకవాక్య సమాధానం చెబుతూ నెట్టుకొస్తోందని అక్షింతలు వేసింది. ఎల్జీ ప్రతిపాదనను ఆమోదిస్తూ రాష్ర్టపతి ఇచ్చిన లేఖను కేంద్రం సమర్పించడంతో.. ఈ పనిని చాలా ముందే చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎల్జీ రెండు రోజుల్లో బీజేపీని ఆహ్వానించే అవకాశం ఉంది.
ఎన్నికలంటే బీజేపీకి భయం: సుప్రీం తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించాయి. ఎన్నికలంటే బీజేపీ దూరంగా పరిగెడుతోందని ధ్వజ మెత్తాయి. ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేకే నీచ రాజకీయాలకు పాల్పడుతూ బీజేపీ జాప్యం చేస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఒక పార్టీ పక్షాన్నే నిలుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించడం సబబు కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. మెజారిటీ లేని పార్టీకి ఎలా అవకాశమిస్తారని డీపీసీసీ చీఫ్ అరవిందర్ సింగ్ ప్రశ్నించారు.
ఈ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ప్రధాని పదవిపై ఆశలతో ఢిల్లీ ప్రజలను మధ్యలోనే వదిలేసి సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారని మండిపడింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రస్తుతం మూడు ఖాళీలున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికవడంతో బీజేపీ బలం 31 నుంచి 28కి తగ్గిపోయింది. మిత్రపక్షం అకాలీదళ్ ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంది. మెజారిటీకి 34 సీట్లు అవసరం. కాగా, ఖాళీ స్థానాలకు వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఓ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆప్ బలం కూడా 27కు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సర్కారు ఏర్పాటు ఇంకాఉత్కంఠను రేపుతోంది.
ఎటూ తేల్చుకోని బీజేపీ: ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేసేందుకు సుప్రీంప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ విషయంలో ఎలాం టి నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ ఢిల్లీ శాఖ భావిస్తుండగా, పార్టీ అధిష్ఠానం మాత్రం ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
ఢిల్లీలోనూ సర్కారు ఏర్పాటు!
Published Wed, Oct 29 2014 1:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement