'డీజిల్ కార్లను నిషేధిస్తారా?'
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని బయటపడేసేందుకు ఒక్కో ప్రయత్నం ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కాలుష్యానికి ఎక్కువకారణం అవుతున్న డీజిల్ కార్లను నిషేధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ధర్మాసనం పేర్కొంది. వచ్చే మంగళవారం నాటికి కోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పారు.
డీజిల్ కార్లను ఢిల్లీ నగర వీధుల్లో నుంచి పూర్తిగా బహిష్కరించాలా లేక పరిమితులు విధిస్తే సరిపోతుందా అనే అంశాలను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారం వెల్లడించనుంది. ఏదేమైనా ఢిల్లీ గుండా ట్రక్కులను వెళ్లకుండా తీసుకునే నిర్ణయానికి సుప్రీంకోర్టు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క, కాలుష్యాన్ని అదుపుచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తెస్తున్న సరి-భేసి పాలసీపై స్పందిస్తూ ఏదో ఒక పరిష్కారంతో సమస్య మొత్తం అంతంకాదని, ఇందుకోసం బహుళకార్యక్రమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.