ఆమోదయోగ్య ప్రతిపాదనతో రండి
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు బెయిల్‌కు రూ.10,000 కోట్ల చెల్లింపులపై తగిన ఆమోదయోగ్య ప్రతిపాదనతో రావాలని సుప్రీంకోర్టు కొత్త బెంచ్ సోమవారం సూచించింది. కేసులో నెలకొన్న ప్రతిష్టంభన వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండబోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లక్నోలో రాయ్‌ని గృహ నిర్బంధం కింద ఉంచాలన్న విజ్ఞప్తిని మాత్రం జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. న్యాయమూర్తులు జె.ఎస్. కేహార్, కె.ఎస్. రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం 2012 నుంచి సహారా కేసును విచారించింది. అయితే, ఈ నెల 14న రాధాకృష్ణన్ రిటైర్ కావడం, కేహార్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేశారు.
లండన్, న్యూయార్క్‌లో ఉన్న హోటెల్స్‌సహా తన ఆస్తుల అమ్మకానికి సహారా సిద్ధమని సహారా సుప్రీంకోర్టుకు తెలపడం మరో ముఖ్య విషయం. కొత్త బెంచ్ వద్ద ప్రాథమిక స్థాయిలో జరిగిన విచారణ ప్రతిష్టంభనను తొలగించే దిశలో కొంత సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్న బెంచ్, తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించింది. వచ్చే వారం కేసు తదుపరి విచారణ జరగనుంది. 75 రోజల నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాయ్‌ని విడుదల చేయాల్సి ఉందని అంతకుముందు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదించారు. లక్నోలో ఆయనను హౌస్ అరెస్ట్ కింద ఉంచాలని సైతం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.