సహారా చీఫ్ సుబ్రతారాయ్ అరెస్టుకు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ అరెస్టుకు సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మదుపరులకు గ్రూప్ కంపెనీలు రెండు రూ.20,000 కోట్ల చెల్లింపులు జరపడంలో విఫలమైన అంశంలో అత్యున్నతస్థాయి ధర్మాసనం రాయ్‌కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ల విచారణ సందర్భంగా తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఫిబ్రవరి 20న తిరిగి ఇదేనెల 25న తాను స్వయంగా జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించడంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా ఆదేశాలతో రాయ్ ఈ కేసులో మరింత ఇబ్బందిలో పడినట్లయ్యింది. కాగా ఇదే కేసుకు సంబంధించి రెండు కంపెనీల్లోని ముగ్గురు డెరైక్టర్లు.. రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవలు బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ మార్చి 4వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సహారా చీఫ్‌ను తన ముందు ప్రవేశపెట్టాలని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
అమ్మకు బాగోలేదని...
అంతకుముందు రాయ్ తరఫున సుప్రీంకోర్టుకు ప్రముఖ న్యాయవాది రామ్‌జెత్మలానీ తన వాదనలను వినిపించారు. 92 సంవత్సరాల వృద్ధురాలు అమ్మ ఆరోగ్యం బాగాలేనందునే రాయ్ ధర్మాసనం ముందు హాజరుకాలేకపోయినట్లు తెలిపారు. మరణశయ్య మీద ఉన్నట్లు భావిస్తున్న తన తల్లి పక్కనే ఉండాల్సిన పరిస్థితిలో రాయ్ ఉన్నట్లు విన్నవించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని కోరారు. అయితే ఈ వినతిని బెంచ్ తోసిపుచ్చింది. ‘‘ ఇది ధర్మక్షేత్రం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలనే మీ విజ్ఞప్తిని మేము మంగళవారం తిరస్కరించాం. నేడు నాన్-బెయిలబుల్ వారంట్ ఇస్తాం.
ఈ కోర్టు పరిధి చాలా విస్తృతమైంది.’’ అని జెత్మలానీ వాదన సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. తల్లి ఆరోగ్య పరిస్థితిపై లక్నో సహారా ఆసుపత్రి మెడికల్ సర్టిఫికెట్‌ను జత్మలానీ సమర్పించినప్పటికీ, దీనిని అంగీకరించడానికి న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగత హాజరుకు సంబంధించి మంగళవారమే సుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున బుధవారం తాజా విజ్ఞప్తిని మన్నించేది లేదని ఉద్ఘాటించింది. నేడు (బుధవారం) హాజరైన ముగ్గురు డెరైక్టర్లు కూడా మార్చి 4న మళ్లీ తన ముందు హాజరుకావాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
నేపథ్యం ఇదీ...
సహారా గ్రూప్ కంపెనీలు రెండు- ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్) మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం. ఈ కేసులో 2012 ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పొడిగించింది.
దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్లు తక్షణం చెల్లించాలని, రూ.10,000 కోట్లను (2013) జనవరిలో, మిగిలిన సొమ్మును (2013) ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. 2012 డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా.. ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమైంది. ప్రస్తుతం కోర్టులో సెబీ దాఖలుచేసిన ధిక్కరణ పిటిషన్లను సహారా గ్రూప్ ఎదుర్కొంటోంది. వాయిదా వాయిదాకు సుప్రీంకోర్టు నుంచి చివాట్లను తింటోంది. సుప్రీం ఆదేశాల మేరకు రూ.20,000 కోట్ల విలువైన సేల్ డీడ్స్‌నూ సెబీకి అందించింది. కేసు విచారణ నేపథ్యంలో సహారా చీఫ్ విదేశీ పర్యటనకు వీలులేదని సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఒక దశలో డబ్బు తిరిగి చెల్లించేశామని చెప్పిన గ్రూప్, ఈ చెల్లింపులకు సంబంధించి అసలు తనకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలన్న బెంచ్ ఆదేశాలకు నీళ్లునమిలింది. సెబీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ... డబ్బు పునఃచెల్లింపుల నుంచి తప్పుకోడానికి ప్రయత్నించడం వంటి చర్యలతో సుప్రీం ఆగ్రహానికి గురయ్యింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సహారా అందించిన సేల్ డీడ్స్ అమ్మకాలకు సెబీ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 20న రూలింగ్ ఇచ్చింది. దీంతోపాటు 26న(బుధవారం) ధర్మాసనం ముందు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.