Market regulator SEBI
-
నష్టాలొస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్‌నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు. సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఐఆర్ఆర్ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్.. బ్రోకరేజీ సిస్టమ్‌లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్ఆర్ఏని డౌన్లోడ్ చేసుకునేందుకు ట్రేడర్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్స్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. రూపాయి రికార్డ్ కనిష్టం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్‌టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
టాప్ 500 కంపెనీలు ‘బాధ్యతా’ నివేదికలు ఇవ్వాలి
న్యూఢిల్లీ: అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణే లక్ష్యంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజా నియమావళిని నోటిఫై చేసింది. దీని ప్రకారం ఇకపై టాప్ 500 లిస్టెడ్ కంపెనీలు అన్నీ వార్షిక ప్రాతిపదికన వ్యాపార బాధ్యతల నిర్వహణా (బీఆర్) నివేదికలను తయారు చేయాల్సి ఉంటుంది. పర్యావరణం, వాటా దారులతో సంబంధాలు, సామాజిక బాధ్యతల నిర్వహణ వంటి అంశాలను వీటిలో పొందుపరచాలి. -
నల్లధనంపై సెబీ యుద్ధం
59 సంస్థలపై నిషేధ న్యూఢిల్లీ : పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకున్నందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 59 సంస్థలపై నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టాక్ మార్కెట్లో ఎలాంటి కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలను నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిల్లో హెచ్ఎన్ఐ, రిద్దిసిద్ధి బులియన్స్, వుడ్‌ల్యాండ్ రిటైల్స్, మహా కాళేశ్వర్ మైన్స్, శ్రీ కమోడిటీస్ తదితర సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. బీఎస్ఈలో స్టాక్ ఆప్షన్ల ద్వారా కొన్ని సంస్థలు ఎప్పుడూ నష్టాలను, మరికొన్ని ఎప్పుడూ లాభాలను గడిస్తున్నట్లు సెబీ గుర్తించింది. ఇది ఏవిధంగా జరుగుతోంది తెలపాలని సెబీ ఆ సంస్థలను కోరినప్పుడు అవి సరైన సమాధానం ఇవ్వలే దు. దీంతో సెబీ వాటిపై నిషేధం విధించింది. సెబీ గతంలో దాదాపు 950 సంస్థలను నిషేధించింది. -
ఇన్వెస్టర్లూ జాగ్రత్త... సెబీ ఎస్ఎంఎస్ ప్రచారం
న్యూఢిల్లీ: మోసపూరిత పథకాల గురించి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు, అవగాహ న కల్పించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొత్తగా విస్తృత ఎస్ఎంఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం’ అనే ప్రకటనలు మోసపూరిత చర్యలో భాగమేనని సెబీ తెలిపింది. పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్టర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. కొందరు మోసగాళ్లు ఇన్వెస్టర్ల మొబైల్ నెంబర్లను ట్యాప్ చేసి, వారికి వివిధ సందేశాలు పంపి, ఆకర్షిస్తున్నారని పేర్కొంది. సెబీ గతంలో నుంచే ఇన్వెస్టర్ల అవగాహన, అప్రమత్తత కోసం పత్రికా, టీవీ ప్రకటనలను ఇస్తోంది. -
లీకైన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ఉపయోగించుకుంటే కఠిన చర్యలు
సెబీ హెచ్చరిక ముంబై: చమురు మంత్రిత్వ శాఖ నుంచి సంగ్రహించిన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ఉపయోగించుకున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది. చమురు మంత్రిత్వ శాఖ నుంచి కీలకమైన సమాచారాన్ని ఆ శాఖ ఉద్యోగులు ప్రైవేట్ రంగ ఆయిల్ కంపెనీల ఉద్యోగులు తస్కరించారన్న వార్తల నేపథ్యంలో సెబీ ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇలా చోరీ చేసిన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు ఉపయోగించుకోవడం చట్టవ్యతిరేకమైన ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వస్తుందని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. తమకు సమగ్రమైన నిఘా వ్యవస్థ ఉందని, ఇలా తస్కరించిన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ఉపయోగించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేవలం చమురుశాఖ నుంచే కాకుండా ఇతర శాఖల నుంచి కూడా కీలకమైన డాక్యుమెంట్లు, ముఖ్యంగా బడ్జెట్ సంబంధిత పత్రాలు లీకైనట్లు సమాచారం. -
సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ మరో ప్రయత్నం
వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రకటన న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులను గుర్తించి, డబ్బు రిఫండ్ చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరో ప్రయత్నం చేసింది. తమ పెట్టుబడులకు సంబంధించిన తగిన ఆధారాలతో జనవరికల్లా వివరాలు తెలియజేయాలని బాండ్హోల్డర్లను సెబీ బుధవారం ఒక ప్రకటనలో కోరింది. ఆగస్టులో కూడా సెబీ ఇటువంటి యత్నమే చేసింది. అప్పట్లో దీనికి 2014 సెప్టెంబర్ 30 వరకూ గడువిచ్చింది. ఈ సందర్భంగా సహారా రెండు కంపెనీలు.. సహారా ఇండియా రియల్టీ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ బాండ్‌హోల్డర్ల నుంచి దాదాపు 4,900 రిఫండ్ క్లెయిమ్స్ అందాయి. సెప్టెంబర్ నాటికి క్లెయిమ్స్ దాఖలు చేయనివారి ప్రయోజనాల కోసం తాజా ప్రకటన చేస్తున్నట్లు సెబీ పేర్కొంది. నిబంధనలను విరుద్ధంగా ఈ కంపెనీలు దాదాపు 3 కోట్ల మదుపుదారుల నుంచి రూ.24,000 కోట్లపైగా నిధుల సమీకరణ... పునఃచెల్లింపుల్లో వైఫల్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ దాదాపు 9 నెలల నుంచీ తీహార్ జైలులో ఉన్న సంగతి విదితమే. మధ్యంతర బెయిల్ కోసం 10,000 కోట్లు చెల్లించాలన్నది సుప్రీం షరతు. ఆర్బీఐ అనుమతి తర్వాతే దేశానికి ఆ డబ్బు...: బెయిల్‌పై సహారా చీఫ్ విడుదలకు సంబంధించి విదేశాల నుంచి తీసుకువచ్చే నిధులకు ఆర్బీఐ ఆమోదం అవసరమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. విదేశీ మారక నిధుల నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఇది తప్పనిసరన్న వాదనతో ఏకీభవించిన జస్టిస్ టీఎస్ ఠాకూర్లతో కూడిన బెంచ్ తాజాగా ఈ సూచన చేసింది. 650 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,600 కోట్లు) విదేశీ రుణం సమకూర్చుకోవడానికి అనుమతించాలన్న సహారా పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. -
సహారా చీఫ్ సుబ్రతారాయ్ అరెస్టుకు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ అరెస్టుకు సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మదుపరులకు గ్రూప్ కంపెనీలు రెండు రూ.20,000 కోట్ల చెల్లింపులు జరపడంలో విఫలమైన అంశంలో అత్యున్నతస్థాయి ధర్మాసనం రాయ్‌కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ల విచారణ సందర్భంగా తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఫిబ్రవరి 20న తిరిగి ఇదేనెల 25న తాను స్వయంగా జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించడంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ఆదేశాలతో రాయ్ ఈ కేసులో మరింత ఇబ్బందిలో పడినట్లయ్యింది. కాగా ఇదే కేసుకు సంబంధించి రెండు కంపెనీల్లోని ముగ్గురు డెరైక్టర్లు.. రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవలు బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ మార్చి 4వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సహారా చీఫ్‌ను తన ముందు ప్రవేశపెట్టాలని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అమ్మకు బాగోలేదని... అంతకుముందు రాయ్ తరఫున సుప్రీంకోర్టుకు ప్రముఖ న్యాయవాది రామ్‌జెత్మలానీ తన వాదనలను వినిపించారు. 92 సంవత్సరాల వృద్ధురాలు అమ్మ ఆరోగ్యం బాగాలేనందునే రాయ్ ధర్మాసనం ముందు హాజరుకాలేకపోయినట్లు తెలిపారు. మరణశయ్య మీద ఉన్నట్లు భావిస్తున్న తన తల్లి పక్కనే ఉండాల్సిన పరిస్థితిలో రాయ్ ఉన్నట్లు విన్నవించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని కోరారు. అయితే ఈ వినతిని బెంచ్ తోసిపుచ్చింది. ‘‘ ఇది ధర్మక్షేత్రం. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలనే మీ విజ్ఞప్తిని మేము మంగళవారం తిరస్కరించాం. నేడు నాన్-బెయిలబుల్ వారంట్ ఇస్తాం. ఈ కోర్టు పరిధి చాలా విస్తృతమైంది.’’ అని జెత్మలానీ వాదన సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. తల్లి ఆరోగ్య పరిస్థితిపై లక్నో సహారా ఆసుపత్రి మెడికల్ సర్టిఫికెట్‌ను జత్మలానీ సమర్పించినప్పటికీ, దీనిని అంగీకరించడానికి న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగత హాజరుకు సంబంధించి మంగళవారమే సుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున బుధవారం తాజా విజ్ఞప్తిని మన్నించేది లేదని ఉద్ఘాటించింది. నేడు (బుధవారం) హాజరైన ముగ్గురు డెరైక్టర్లు కూడా మార్చి 4న మళ్లీ తన ముందు హాజరుకావాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నేపథ్యం ఇదీ... సహారా గ్రూప్ కంపెనీలు రెండు- ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్) మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం. ఈ కేసులో 2012 ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పొడిగించింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్లు తక్షణం చెల్లించాలని, రూ.10,000 కోట్లను (2013) జనవరిలో, మిగిలిన సొమ్మును (2013) ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. 2012 డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా.. ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమైంది. ప్రస్తుతం కోర్టులో సెబీ దాఖలుచేసిన ధిక్కరణ పిటిషన్లను సహారా గ్రూప్ ఎదుర్కొంటోంది. వాయిదా వాయిదాకు సుప్రీంకోర్టు నుంచి చివాట్లను తింటోంది. సుప్రీం ఆదేశాల మేరకు రూ.20,000 కోట్ల విలువైన సేల్ డీడ్స్నూ సెబీకి అందించింది. కేసు విచారణ నేపథ్యంలో సహారా చీఫ్ విదేశీ పర్యటనకు వీలులేదని సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసింది. ఒక దశలో డబ్బు తిరిగి చెల్లించేశామని చెప్పిన గ్రూప్, ఈ చెల్లింపులకు సంబంధించి అసలు తనకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలన్న బెంచ్ ఆదేశాలకు నీళ్లునమిలింది. సెబీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ... డబ్బు పునఃచెల్లింపుల నుంచి తప్పుకోడానికి ప్రయత్నించడం వంటి చర్యలతో సుప్రీం ఆగ్రహానికి గురయ్యింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సహారా అందించిన సేల్ డీడ్స్ అమ్మకాలకు సెబీ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 20న రూలింగ్ ఇచ్చింది. దీంతోపాటు 26న(బుధవారం) ధర్మాసనం ముందు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.