లీకైన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ఉపయోగించుకుంటే కఠిన చర్యలు
సెబీ హెచ్చరిక
ముంబై: చమురు మంత్రిత్వ శాఖ నుంచి సంగ్రహించిన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ఉపయోగించుకున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది. చమురు మంత్రిత్వ శాఖ నుంచి కీలకమైన సమాచారాన్ని ఆ శాఖ ఉద్యోగులు ప్రైవేట్ రంగ ఆయిల్ కంపెనీల ఉద్యోగులు తస్కరించారన్న వార్తల నేపథ్యంలో సెబీ ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇలా చోరీ చేసిన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు ఉపయోగించుకోవడం చట్టవ్యతిరేకమైన ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద వస్తుందని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు.
తమకు సమగ్రమైన నిఘా వ్యవస్థ ఉందని, ఇలా తస్కరించిన సమాచారాన్ని స్టాక్ మార్కెట్లో ఉపయోగించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేవలం చమురుశాఖ నుంచే కాకుండా ఇతర శాఖల నుంచి కూడా కీలకమైన డాక్యుమెంట్లు, ముఖ్యంగా బడ్జెట్ సంబంధిత పత్రాలు లీకైనట్లు సమాచారం.