బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్న బీఎస్‌ఈ చైర్‌పర్సన్ ఎస్‌ఎస్ ముంద్రా, ఎండీ, సీఈఓ సుందరరామన్ రామమూర్తితో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్‌నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు.
సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్‌లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్‌లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు.
ఐఆర్‌ఆర్‌ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్..
బ్రోకరేజీ సిస్టమ్‌లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్‌ఆర్‌ఏని డౌన్‌లోడ్ చేసుకునేందుకు ట్రేడర్‌కి ఎస్‌ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్
పొజిషన్స్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు.
రూపాయి రికార్డ్ కనిష్టం
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్‌టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment