'బయటపడే మార్గం మీ చేతుల్లోనే ఉంది'
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ మరికొన్ని రోజుల పాటు తీహార్ జైలులో గడపనున్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సెబీకి చెల్లించాల్సిన డబ్బు ఇచ్చేందుకు ముందుకొస్తే బెయిల్ ఇచ్చే అంశాన్ని మళ్లీ పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. 'మీరు బయటపడే మార్గం మీ చేతుల్లోనే ఉంది' అని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
తనను జైలుపాలు చేయడం తగదంటూ బుధవారం సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టు ఎదుట హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తద్వారా విచారణలో కొత్త అంకానికి తెరలేపారు. చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచ్ ముందు రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ తన వాదనలు వినిపిస్తూ... ఈ కేసు విషయంలో హెబియస్ కార్పస్ రిట్ పరిధి అంశాలు ఇమిడి ఉన్నాయని విన్నవించారు. మార్చి 4న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ, రాయ్‌ని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.24,000 కోట్లు సమీకరించాయన్నది కేసులో ప్రధానాంశం. ఈ నిధులు పునఃచెల్లింపుల్లో విఫలం కావడంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సహారాపై ధిక్కార పిటిషన్లను దాఖలు చేసింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విచారణ ప్రక్రియ అనంతరం సుప్రీం ఆదేశాల ప్రకారం సహారా చీఫ్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. 3 రోజుల్లో రూ.2,500 కోట్లు చెల్లించడానికి సిద్ధమని సహారా గ్రూప్ చేసిన ప్రతిపాదనను బెంచ్ తిరస్కరించింది.