డబ్బే సర్వస్వం కాదు.. | Jail life painful but I am stress free: Sahara's Subrata Roy | Sakshi
Sakshi News home page

డబ్బే సర్వస్వం కాదు..

Published Tue, Feb 2 2016 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

డబ్బే సర్వస్వం కాదు..

డబ్బే సర్వస్వం కాదు..

♦  ఒత్తిడిని అధిగమించే శక్తిని దేవుడిచ్చాడు
♦ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్
♦ ‘థాట్స్ ఫ్రం తీహార్’ పేరుతో పుస్తకం విడుదల

 న్యూఢిల్లీ: వేల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము రీఫండ్ వివాదంలో దాదాపు రెండేళ్లుగా తీహార్ జైల్లో మగ్గుతున్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ తాజాగా రచనా వ్యాసంగం చేపట్టారు. సహారా గ్రూప్ 39వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాయ్ రాసిన ‘థాట్స్ ఫ్రమ్ తీహార్’ పుస్తకాన్ని సోమవారం విడుదల చేశారు. ‘లైఫ్ మంత్రాస్’ శీర్షికన వెలువడనున్న మూడు పుస్తకాల శ్రేణిలో ఇది మొదటిది. జైలు జీవితంలో తన ఆలోచనలను ఇందులో పొందుపర్చిన రాయ్.. ఇది తన ఆత్మకథ మాత్రం కాదని స్పష్టం చేశారు. కేవలం ప్రాథమిక సౌకర్యాలతో జైలు గదిలో గడపాల్సి రావడం తనకు షాక్‌కు గురిచేసిందని రాయ్ తెలిపారు.

జైలు జీవితం చాలా ఒంటరిగాను, దుర్భరంగానూ ఉంటుందని, కానీ అదృష్టవశాత్తు ఎల్లవేళలా ఒత్తిడిని అధిగమించగలిగే శక్తిని భగవంతుడు తనకు ఇచ్చాడని ఆయన  వివరించారు. ‘నేనేం చేశానని నాకీ శిక్ష .. అని అనిపించేది. ఇలాంటి ఆలోచనలు అనేకానేకం మెదడును తొలిచేసేవి. ఎవరినైనా.. బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధమూ లేకుండా ఒంటరిగా బంధించేసినప్పుడు జుత్తు పీక్కోవాలనిపిస్తుంది.. ఒకోసారి పిచ్చెత్తిపోతుంది’ అంటూ రాయ్ పుస్తకంలో పేర్కొన్నారు.  పుస్తకావిష్కరణ కోసం దేశవిదేశాల్లో దాదాపు 5,120 చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

 డబ్బున్నా, షరతులు విధిస్తే...
‘బోలెడంత డబ్బుంటే సుఖంగా బతికేయొచ్చనుకుంటారు అందరూ. కానీ కోరుకున్నంత సంపద ఉన్నా .. మహలు నుంచి బైటి కెళ్లొద్దు.. ఎవరితో మాట్లాడొద్దు, బాహ్యప్రపంచంతో సంబంధం పెట్టుకోవద్దు.. కనీసం టీవీ, రేడియో లాంటివి కూడా ఉండవు అంటూ షరతులు విధిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇరవై .. లేదా ముప్పై లేదా నలభై రోజుల తర్వాతో.. బైటికెళ్లేందుకు తలుపులు తీస్తే ఏం చేయాలో అర్థం కాక ఆ వ్యక్తి జుత్తు పీక్కుంటూ ఉంటాడు లేదా పిచ్చెత్తి పోయి ఉంటాడు. దీన్ని నమ్మని వారెవరైనా నన్ను కలిస్తే ప్రాక్టికల్‌గా నిరూపిస్తాను’ అని రాయ్ వివరించారు. తన భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకునే అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు.

 అప్పట్లోనే హాయిగా ఉండేది...
సహారా గ్రూప్ 1978లో కేవలం రూ. 2,000తో మొదలైందని, ఇప్పటికన్నా అప్పట్లో ఎంతో సంతోషంగా ఉండేదని రాయ్ రాసుకొచ్చారు. పుస్తకం ప్రకారం ప్రస్తుతం గ్రూప్ విలువ దాదాపు రూ. 1,80,000 కోట్లు. అత్యాశకు పోయేవారు సంతోషంగా ఉండలేరని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. ప్రతీ క్షణం సంతోషంగా, సంతృప్తిగా ఉండాలన్నది తన తండ్రి నుంచి నేర్చుకున్నానని ఆయన వివరించారు. డబ్బే పరమావధిగా పనిచేసే ఏ సంస్థా పురోగమించలేదని, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధోగతి పాలైనవి చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement