జైల్లో రాజభోగాలకు రూ 1.23 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ జైల్లోనూ రాజభోగాలు అనుభవించారు. ఏడాదికిపైగా ప్రత్యేక సెల్లో ఉన్న రాయ్ ఏ లోటూ లేకుండా విలాసవంతమైన జీవితం గడిపారు. ప్రత్యేక వసతులు కల్పించినందుకుగాను తీహార్ జైలు అధికారులకు ఆయన చెల్లించిన మొత్తం 1.23 కోట్ల రూపాయలు. భద్రత, విద్యుత్, కాన్ఫరెన్స్ రూమ్ అద్దె, భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించినందుకు జైలు అధికారులు ఈ మొత్తాన్ని వసూలు చేశారు.
ఆయనకు వీడియో కాన్ఫరెన్స్, వైఫై, ఏసీ గదులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు ల్యాప్టాప్లు, ల్యాండ్ ఫోన్లు, ఓ సెల్ఫోన్, సహాయ సిబ్బందిని వినియోగించుకునేందుకు అనుమతించారు. సహారా గ్రూప్ జైలు అధికారులకు ఇంకా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు చెప్పారు. కాగా గత నెలలో రాయ్ను సాధారణ సెల్కు మార్చారు.
డిపాజిటర్లకు 20 వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమైనందుకు రాయ్తో పాటు సహారా గ్రూపు డైరెక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబెలను కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తీహార్ జైలుకు తరలించారు. రాయ్కు బెయిల్ మంజూరు చేయడానికి 10వేల కోట్ల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
5 వేల కోట్లు రూపాయల నగదు, మరో ఐదు వేల కోట్లకు చెక్ రూపంలో సమర్పించాలని సూచించింది. అయితే ఈ డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఆయన విడుదల కాలేదు. తీహార్ జైల్లో రాయ్కు అత్యంత భద్రత ఉండే వార్డును కేటాయించారు. బెయిల్ కోసం డబ్బులు సమకూర్చుకునేందు కోసం న్యూయార్క్, లండన్లో ఉన్న రాయ్ హోటళ్లను అమ్ముకునేందుకు వీలుగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు.