లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.
ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.
ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్‌సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు.
Comments
Please login to add a commentAdd a comment