సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్థాల(డ్రగ్స్) దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు నెరుపుతూ దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై కేసులు, అరెస్టులు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఆపరేషన్ గరుడ ఏమిటి?
అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్‌వర్క్‌లను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో పలు దఫాలుగా తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఇంటర్‌పోల్ ద్వారా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి డ్రగ్ ట్రాఫికింగ్‌లను గుర్తించేందుకు ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనూ ఈ తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీబీఐ తెలిపింది. ఇంటర్‌పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)ల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్న నెట్‌వర్క్‌లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ కొనసాగిస్తోంది సీబీఐ. దీని ద్వారా డ్రగ్స్ నిర్వహణ, సరఫరా, తయారీ జోన్స్, వారికి మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపట్టింది.
6600 అనుమానితులపై..
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. సుమారు 6600 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసింది. 127 కొత్త కేసులు నమోదు చేసి.. 175 మందిని అరెస్ట్ చేసింది. అందులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సైతం ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1365 గ్రాముల మెఫెడ్రోన్, 33.8 గ్రాముల స్మాక్, బుప్రెనోర్ఫిన్‌కు చెందిన 87 సిరంజీలు, 122 ఇంజెక్షన్లు, 87 ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే 946 అల్ప్రాజోలమ్ ట్యాబ్లెట్లు, 106 కిలోల ట్రామడోల్, 10 గ్రాముల హాష్ ఆయిల్, 0.9 గ్రాముల ఎక్‌స్టాసీ పిల్స్, 1.15 కిలోల ఓపియమ్, 30 కిలోల పప్పీ హక్, 1.43 కిలోల ఇటోక్సికాంట్ పౌండర్, 11039 పిల్, క్యాప్సల్స్ సీజ్ చేసింది.
ఇదీ చదవండి: పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment