methamphetamine
-
అండమాన్‌లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్‌తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
రూ.12 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సముద్రంలో 134 సంచుల్లో తరలిస్తుండగా..
కొచ్చిన్: భారత సముద్ర జలాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.12 వేల కోట్ల విలువైన సుమారు 2,500 కిలోల మెథాంఫెటమైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్(ఎన్సీబీ) స్వాధీనం చేసుకుంది. కేరళ తీరంలోని భారత సముద్ర జలాల్లో సంచరిస్తున్న ఓ ఓడ నుంచి ఈ మత్తు పదార్థం ఉన్న 134 సంచులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్(ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ శనివారం మీడియాకు తెలిపారు. అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా తరలించే డ్రగ్స్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో నేవీ, ఎన్సీబీ కలిసి చేపట్టిన ఆపరేషన్‌లో ఒక పాకిస్తానీని అదుపులోకి తీసుకున్నామన్నారు. అఫ్గానిస్తాన్ నుంచి డ్రగ్స్‌తో బయలుదేరిన భారీ ఓడ ఒకటి మక్రాన్ తీరం వెంబడి పాక్, ఇరాన్‌ల మీదుగా డ్రగ్స్‌ను చిన్న పడవల్లోకి పంపిణీ చేసుకుంటూ వస్తోందని చెప్పారు. మట్టన్‌చెర్రీ వద్ద ఈ ఓడను అడ్డగించినట్లు వెల్లడించారు. భారత్, శ్రీలంక, మాల్దీవులకు డ్రగ్స్‌ను చేరవేయడమే స్మగ్లర్ల లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 3,200 కిలోల మెథాంపెటమైన్, 500 కిలోల హెరాయిన్, 529 కిలోల హషిష్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. చదవండి: గగన్‌యాన్.. క్రూమాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టం ఆపరేషన్ విజయవంతం -
రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు శనివారం ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. 198 కిలోల స్పటిక మెథాంఫెటామైన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్ విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబైలోని వసీ ప్రాంతంలో అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నారింజ పండ్ల బాక్సుల్లో భద్రపర్చిన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయని ప్రకటించారు. అక్రమార్కులు దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమతులు పొందారని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
రూ. 7వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ పట్టివేత!
ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్స్ రాకెట్‌ను అక్కడి పోలీసులు ఛేదించారు. హాంగ్‌కాంగ్ నుంచి అక్రమంగా ఆస్ట్రేలియాలోకి తీసుకు వచ్చిన 120 లీటర్ల మెతామ్ఫెటమైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మాఫియా అత్యంత చాకచక్యంగా అమ్మాయిలు ధరించే జెల్ బ్రాలలో డ్రగ్స్‌ను అక్రమంగా తీసుకొచ్చారు. నిఘావర్గాల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న మెతామ్ఫెటమైన్ విలువ1 బిలియన్ డాలర్లు (దాదాపు 7 వేల కోట్ల రూపాయలు) ఉంటుందని అంచనా. ఈ సంఘటనతో ప్రమేయముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక చైనా వ్యక్తితో పాటు ముగ్గురు హాంగ్‌కాంగ్‌కు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే పట్టుబడిన వాటిలో ఇదే అత్యంత పెద్ద డ్రగ్స్ రాకెట్ అని జస్టిస్ మినిస్టర్ మిచెల్ కినాన్ అన్నారు. సిడ్నీలో సీజ్ చేసిన ద్రవరూపంలో ఉన్న డ్రగ్ నుంచి 500 కిలోల క్రిస్టల్ మెత్‌ను తయారు చేయొచ్చని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమాండర్ క్రిస్ షీహాన్ తెలిపారు. చైనా అధికారుల సహాయంతో గత కొంత కాలంగా నిఘా పెంచి ఈ మెతామ్ఫెటమైన్ రాకెట్‌ను ఛేదించగలిగామని తెలిపారు. నిఘావర్గాల సమాచారంతో సిడ్నీలోని మిరండా, హర్స్ట్ విల్లే, పెడాస్టో, కింగ్స్ గ్రూవ్ ప్రాంతాల్లోని గోడౌన్లలోకి వచ్చిన సరుకులను తనిఖీ చేయగా జెల్ బ్రాలతో పాటూ ఇంటి ఉపకరణాలలో నిలువ చేసిన డ్రగ్స్‌ను కనుగొన్నామని తెలిపారు.